– పది మందికి గాయాలు
– రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఘటన
నవతెలంగాణ-మొయినాబాద్
ఇండోర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం కుప్పకూలి ఇద్దరు కూలీలు మృతిచెందాడు. మరో పది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం సురంగల్ రెవెన్యూ పరిధిలోని ఫైర్‌ఫాక్స్ టెన్నిస్ స్టేడియంలో ఆడిటోరియం నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో బీహాల్, కలకత్తాకు చెందిన 12 మంది కూలీలు పనిచేస్తున్నారు. పని చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఆడిటోరియం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఇద్దరు కూలీలు బాబ్లూ(35), సునీల్(30) అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మరో పది మంది కూలీలను కూడా బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రంగా తెలిపారు.