– పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
– వెల్లడించిన వాతావరణ శాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా,దక్షిణ ఛత్తీస్‌గడ్, ఏపీ వద్ద కేంద్రీకృత మైన వాయుగుండం విదర్భ, తెలంగాణలో విస్తరించిందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసీఫాబాద్, భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశముందని వివరించింది. హైదరాబాద్ నగరంలో రాగల 48 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.