‘గోయింగ్ మై వే” సినిమా ఈయనను తిరుగులేని కళాకారుడిగా నిలబెట్టింది. ఫాదర్ చార్ల్స్ చక్ నటించిన మాలీ పాత్ర ఎంతో ఆదరణ పొందింది. ఇందులో ఆయన పాడిన పాటకు ఉత్తమ గీతంగా ఆస్కార్ లభించింది. ఇందులోని పాటలన్నీ గొప్ప ప్రజాదరణ పొందాయి. ఈ రోజుకీ అవి ఆమెరికా వాసుల సంస్కతికి చిహ్నాలుగా గుర్తింపులో ఉన్నాయి.
న్యూయార్క్‌లోని సెంట్ డామ్నిక్స్ చర్చిలో ఫిట్శ్ గిబ్బన్ ఫాదర్ గా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు. వయసు పైబడినా ఎంతో ఓర్పుతో పని చేస్తూ ఉంటాడు. ఆ చర్చిని నిర్మించిన రోజుల నుంచీ ఆయన అక్కడే పని చేస్తున్నారు. ఆ చర్చితో నలభై ఆరేండ్ల అనుబంధం ఉంది. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పని చేయడానికి ఫాదర్ చార్ల్స్ అనే ఓ మాలి వస్తాడు. ఈయనను అందరూ చక్ అని పిలుస్తారు. చక్ యువకుడు, సంగీతకారుడు, అలాగే మారుతున్న ప్రజల వైఖరిని అర్థం చేసుకున్న వాడు. పాత పద్ధతిలోనే పనులు నిర్వహిస్తున్న ఫిట్శ్ గిబ్బన్ చర్చి పట్ల ఎంత నిబద్ధతతో పని చేసినా చర్చి అప్పుల్లో కూరుకుపోతూనే ఉంది. అక్కడికి వచ్చేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫిట్శ్ గిబ్బన్ సహాయకుడిగా అక్కడకు వస్తాడు చక్.
అక్కడి చుట్టుపక్కల పిల్లలు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పోలీసు వారికి పని పెడుతూ ఉంటారు. స్త్రీలు ఒకరిపై ఒకరు పితూరీలు చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. వీరిని ఫిట్శ్ గిబ్బన్ అర్ధం చేసుకోలేక పోతాడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన చక్ ఆ పరిస్థితులను గమనిస్తాడు. చక్ పాతతరం ఫాదర్లకు భిన్నంగా ప్రవర్తిస్తాడు. చర్చిలో కాకుండా విడిగా అతను మామూలు బట్టలు వేసుకుంటాడు. పిల్లలతో ఆటపాటలలో పాల్గొంటాడు. యువతులతో మాట్లాడడంలో అతని చొరవ ఫిట్శ్ గిబ్బన్‌కు మొదట భయం కలిగిస్తుంది. చక్ నడక నడతలో ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంటుంది. అతనిలో మామూలు యువకుడి ఉత్సాహం, ఉరకలేస్తూ ఉంటుంది. ఇది ఫిట్శ్ గిబ్బన్‌ను అయోమయంలో పడేస్తుంది. చర్చి ఫాదర్ గంభీరంగా ప్రజలకు కాస్త దూరంగా ఉంటూ వారికి మంచి చెడులు చెబుతూ సలహాలిస్తూ ఉండాలన్నది ఫిట్శ్ గిబ్బన్ అభిప్రాయం. కాని చక్ ప్రజలను వారి తప్పులతో సహా స్వీకరించడం.. ఎవరికీ నీతి చెప్పాలని ప్రయత్నించకపోవడం.. వారితో కలిసి ఆడి పాడడం ఇవన్నీ ఫిట్శ్ గిబ్బన్‌ను అయోమయంలో పడేస్తాయి. ముఖ్యంగా మాట కన్నా చక్ పాటను ఎక్కువగా ఉపయోగించడం ఆయనకు అర్థం కాదు.
చక్ నిజానికి ఆ చర్చికి అసిస్టెంట్‌గా కాకుండా ఇన్చార్జిగానే వస్తాడు. కాని నలభై ఏండ్లకు పైగా అక్కడ ఫాదర్‌గా చేసి తన జీవితాన్ని ధారపోసిన ఫిట్శ్ గిబ్బన్‌ను తొలగించి అతని స్థానాన్ని తాను తీసుకోవడానికి ఇష్టపడడు. ఒక వ్యక్తి ఎంత త్యాగం చేస్తే అన్నేండ్లు ఆ చర్చిలో ఉండగలడో చక్ అర్ధం చేసుకుంటాడు. అందుకే బిషప్ అతనికి ఇన్చార్చిగా అన్ని హక్కులు ఇచ్చినా ఫిట్శ్ గిబ్బన్‌కు అసిస్టెంట్ గానే ఉండదల్చుకుంటాడు. అతని ప్రధాన స్థానానికి అడ్డు రాడు. ఆ చర్చి ఫిట్శ్ గిబ్బన్ జీవితం అన్నది అతనికి అర్ధమవుతుంది. ఆ వయసులో అతన్ని ఆ స్థానం నుంచి తొలగిస్తే దాని వల్ల ఆయన మానసికంగా కంగిపోతాడని, జీవించే కోరికను పోగొట్టుకుంటాడని చక్ అర్ధం చేస్కుంటాడు. అన్నేండ్లు ఐర్లాండ్‌లోని తానెంతో ప్రేమించే తల్లిని కనీసం చూడలేదని, కలుసుకోవడానికి వెళ్ళేందుకు డబ్బు కూడా లేకపోవడం విని చక్ ఫిట్శ్ గిబ్బన్ ఎంత నిబద్దతతో అక్కడ పని చేసాడో తెలుసుకుని గౌరవిస్తాడు. కాకపోతే మారుతున్న మనుషులు వారి ఆలోచనలతో ఆయన వాళ్ళని చర్చి వైపుకు మళ్లించలేకపోతున్నాడని అర్థం చేసుకుంటాడు. అందుకే అతని హోదాకు అడ్డు రాకుండా అక్కడ చక్ తన పద్ధతిలో మార్పు తీసుకొచ్చే పని మొదలెడతాడు.
చర్చికి సంబంధించిన ఓ స్త్రీ ఇంటి అద్దె కొన్ని నెలలుగా కట్టకుండా ఫిట్శ్ గిబ్బన్ మంచితనాన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. చక్ ఆమెలోని స్వార్ధాన్ని గమనించి ఆమెకు సహాయపడతాడు. అలాగే తల్లిదండ్రుల ఇంటి నుండి గాయని అవ్వాలని కేరెల్ అనే అమ్మాయి పారిపోయి వస్తుంది. ఈమెను పోలీసు చర్చికి తీసుకువస్తాడు. ఆమెను బలవంతంగా ఇంటికి పంపకుండా ఆ ఊరిలో అద్దెకు ఉండేందుకు చక్ సహాయం చేస్తాడు. ఇవేవి ఫిట్శ్ గిబ్బన్‌కు నచ్చవు. కారెల్ ను బలవంతంగా ఇంటికి పంపించేయాలన్నది ఆయన అభిమతం. కాని ఆ వయసులో ఎవరూ మంచి వినరని, వారిని ఆమోదించినట్లుంటూ వారికి కీడు జరగకుండా చూసుకోవాలన్నది చక్ అభిప్రాయం. చక్ పనితీరు నచ్చక ఫిట్శ్ గిబ్బన్ బిషప్‌ను కలిసి ఇతన్ని మార్చమని అడుగుతాడు. అప్పుడే అతనికి చక్ ఆ చర్చి ప్రధాన ఫాదర్‌గా వచ్చాడని తెలుస్తుంది. దీంతో ఫిట్శ్ గిబ్బన్ తాను అన్ని వ్యవ్యహారాల నుంచి తప్పుకుని, తన ఇంట్లో ప్రధానమైన గది చక్కు ఇచ్చేయాలని చూస్తాడు. కాని చక్ వీటికి ఒప్పుకోడు.
ఆ రాత్రి అక్కడ అన్నేండ్లు తన ఇంట్లో ఆ చర్చిలో తాను ప్రధాన స్థానం నుంచి దూరం జరగాలనే బాధతో ఎవరికీ చెప్పకుండా ఫిట్శ్ గిబ్బన్ తన సామానుతో వెళ్ళిపోతాడు. కాని చక్ పోలీసులతో వెతికిచ్చి ఆయన్ను మళ్ళీ వెనక్కు వచ్చేలా చేెస్తాడు. వచ్చిన ఫిట్శ్ గిబ్బన్ తో చక్ ఏమీ అనడు. అతన్ని ప్రధాన కుర్చీలో స్వయంగా కూర్చోబెట్టి అతన్ని గౌరవిస్తాడు. ఆ చర్చిలో ఫిట్శ్ గిబ్బన్ ఎంత సేవ చేసాడో తనకు తెలుసని అతని గౌరవానికి ఎప్పటికీ భంగం కలిగించనని చక్ తన చర్యల ద్వారా తెలియజేస్తాడు. దీనితో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది.
చక్ ఆ చుట్టుపక్కల దొంగతనాలకు దిగుతున్న యువతతో స్నేహం చేస్తాడు. వారితో ఫుట్‌బాల్ ఆట ఆడుతూ వారి స్నేహాన్ని సంపాదిస్తాడు. వారితో కలిసి ఓ సంగీత బందాన్ని నిర్మించడానికి పూనుకుంటాడు. అయితే ఆ పిల్లలు తమకు చర్చి పాటలు నచ్చవని, తమకొచ్చిన అల్లరి పాటలే పాడతామని అంటారు. చక్ దీనికి ఒప్పుకుని ఆ పాటలనే శ్రుతిలో నేర్పించే పనిలో పడతాడు. ఇది ఫిట్శ్ గిబ్బన్‌ను భయపెడుతుంది. చర్చి ప్రాంగణంలో ఆ పిల్లలు పాడే అల్లరి పాటలు అతన్ని అందోళనకు గురి చేస్తాయి. అయితే ఆ అల్లరి పాటల నుంచి సంగీతంపై ఆసక్తి పెంచుతూ వారితో పూర్తి స్థాయి చర్చి గీతాలను పాడించే స్థితికి వస్తాడు చక్. ఆ సంగీత మాధుర్యంలో పడిపోయి ఆ పిల్లలు చర్చి గీతాలను సాధన చేస్తూ ఉంటారు. వారిలో క్రమంగా తమ పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. వారి అల్లరి తగ్గిపోతుంది.
చక్ ఫాదర్‌గా మారకముందు అతనికి జెన్నీ అనే స్నేహితురాలు ఉండేది. ఈమె ప్రస్తుతం ఓపెరాలో పెద్ద గాయని. ఆమెను సంగీతం వైపుకు మళ్లించిందే చక్. జెన్నీ చక్ ని ఎంతో గౌరవిస్తుంది. ఈమె ప్రదర్శన కోసం న్యూయార్క్ నగరం వచ్చినపుడు చక్ని మళ్లీ చూస్తుంది. పక్క ఊరి చర్చిలో అసిస్టెంట్‌గా ఉన్న టిమోతో ఓ డౌడ్ కూడా వీళ్ల స్నేహితుడే. చక్ అక్కడికి రాగానే టిమోతిని కలుస్తాడు. ఇద్దరు కలిసి తీరిక సమయాల్లో గోల్ఫ్ ఆడడం ఫిట్శ్ గిబ్బన్‌కు ఎంతో వింతగా అనిపిస్తుంది.
కారొల్ ఆ ప్రాంతంలో ధనవంతుడి కొడుకు టెడ్‌తో కలిసి జీవిస్తూ ఉంటుంది. టేడ్ ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు. కారొల్ని సంగీత లోకానికి పరిచయం చేస్తానని ప్రగల్భాలు పలుకుతాడు. కారొల్ని మొదట కలిసినప్పుడే చక్ ఆమెలో సంగీత పరిజ్ఞానం తక్కువ అని ఆ టీనేజ్‌లో ఉండే తిరుగుబాటు స్వభావం వల్ల ఆమె తానో గాయకురాలినై పోవాలని కలలు కంటుందని తెలుసుకుంటాడు. ఆమె గొంతు బావుంటుంది కాబట్టి ఆమె గానం పట్ల కషి చేయవచ్చని అయితే పాటను ఎలా సాధన చేయాలో తెలుసుకోవాలని చక్ ఆమెకు చెప్తాడు. కారెల్, టేడ్ వివాహం లేకుండా కలిసి జీవిస్తున్నారని చర్చికి తెలిసిన తరువాత చక్ వాళ్ళని కలవడానికి వెళతాడు. ఆ యువకులకు తానేం చెప్పినా అర్ధం కాదని అతనికి తెలుసు. తాను చెప్పాలనుకున్నది పరోక్షంగా ఓ గీతంగా మలచి, వాళ్లనే తమ జీవితాన్ని నిర్ణయించుకొమ్మని చెప్పి వదిలేస్తాడు చక్. క్రమంగా వాళ్లలో ఆలోచన పుడుతుంది. వాళ్ళు వివాహం చేసుకుంటారు. అది తీసుకొచ్చిన బాధ్యతతో టెడ్ సైన్యంలోకి వెళతాడు. అతని కోసం ఎదురు చూస్తానని కారొల్ అంటుంది. వారిద్దరి లోని మార్పు, బాధ్యత టెడ్ తండ్రిని కూడా ఆశ్చర్యపరుస్తుంది.
జెన్నీ చక్ సంగీత బందాన్ని చర్చిలో కలుస్తుంది. టెడ్ రాసి సంగీతం కూర్చిన పాటను వింటుంది. దాన్ని రికార్డ్ చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదని తెలుసుకుంటుంది. ఆ పాటకు డబ్బు వస్తే చర్చి మీదున్న అప్పు తీర్చవచ్చన్నది చక్ ఆలోచన. ఇది తెలుసుకుని ఆమె తన మెట్రో పాలిటన్ ఓపెరాలో పూర్తి ఆర్కెస్ట్రాతో ఆ పాటను పబ్లిషర్ల ముందు పాడుతుంది. కాని అది వారికి నచ్చదు. చక్, అతనితో పాటున్న పిల్లల బందం నిరాశ పడ్తారు. పిల్లలను ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావడానికి చక్ వాళ్లందరూ సరదాగా పాడే పిల్లల పాటను అక్కడ ఆర్కెస్ట్రా ఉండగా పాడడం మొదలెడతాడు. పిల్లలు ఉత్సాహంగా అతనితో గొంతు కలుపుతారు. ఇది బయటకు వెళ్లిన పబ్లిషర్లకు వినిపిస్తుంది. వాళ్లకు ఇది బాగా నచ్చుతుంది. దీన్ని తాము రికార్డ్ చేస్తామని ముందుకువస్తారు. దానితో ఆ పిల్లల్కు ఉపాధి ఆ చర్చికి అప్పులు తీరే దారి దొరుకుతుంది.
చక్, ఫిట్శ్ గిబ్బన్, టిమోతీల మధ్య స్నేహం పెరుగుతుంది. గోల్ఫ్ ఆటలో ఫిట్శ్ గిబ్బన్ ఆనందం అనుభవిస్తాడు. అతనిలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. తన వయసు పై బడుతుందని, తానెందుకూ పనికిరాని వాడినయి పోతున్నాననే న్యూనత భావన నుంచి క్రమంగా బయటకు వస్తాడు. పాటను కొనుక్కున్న పబ్లిషర్లను చర్చికి వచ్చి ఆ డబ్బు ఇవ్వమని చెప్తాడు చక్. ఓ ఆదివారం ప్రార్ధన తరువాత చర్చి కోసం సహాయం చేయమని అడిగిన ఫిట్శ్ గిబ్బన్ ఆ రోజు అక్కడ ఉన్న వాళ్లందరూ వేసిన డబ్బుకు ఆశ్చర్యపోతాడు. తాను ఇప్పటికి డబ్బు సేకరించగలనని అతనిలో నమ్మకం పెరుగుతుంది.
ఓ ప్రమాదంలో చర్చి భాగం మంటల్లో కాలిపోతుంది. దాన్ని మళ్లీ నిర్మించుకుంటారు అందరూ. దీనితో చర్చి పట్ల అక్కడి ప్రజల్లో కూడా ప్రేమ కలుగుతుంది. చర్చికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దానితో చక్‌ను అక్కడి నుంచి బదిలీ చేసి కష్టాల్లో ఉన్న మరో చర్చికి అసిస్టెంట్‌గా పంపిస్తాడు బిషప్. ఫిట్శ్ గిబ్బన్‌కు అసిస్టెంట్‌గా టిమోతిని నియమిస్తాడు. చక్‌ను పోగొట్టుకుంటున్నందుకు బాధపడుతూనే టిమోతిని అక్కడకు ఆహ్వానిస్తాడు ఫిట్శ్ గిబ్బన్. చక్ ఐర్లాండ్ నుంచి ఫిట్శ్ గిబ్బన్ తల్లిని అక్కడకు రప్పించి వారిద్దరినీ కలుపుతాడు. ఫిట్శ్ గిబ్బన్ తల్లి పాడిన జోల పాటను చక్ ఎన్నో సార్లు ఆయనకు పాడి వినిపించాడు. దాన్ని ఇప్పుడు ఆ చర్చిలో పిల్లలు పాడుతుండగా తొంభై ఏళ్ళ తల్లి ఫిట్శ్ గిబ్బన్‌ను దగ్గరకు తీసుకుంటూ ఉండగా చక్ మరో చర్చిలో తన బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయాణమవుతాడు.
”గోయింగ్ మై వే” ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డును గోల్డన్ గ్లోబ్ అవార్డునూ పొందిన మొదటి చిత్రం. అలాగే ఉత్తమ చిత్రంగానూ ఉత్తమ కథకు ఆస్కార్ నామినేషన్లు పొందిన ఒకే ఒక చిత్రం. ఉత్తమ చిత్రం, ఉత్తమ పాట ఆస్కార్లను అందుకున్న మొదటి చిత్రం. అలాగే దీనికి తరువాత ”ది బెల్స్ ఆఫ్ సెంట్ మేరీస్” అనే సినిమాను సీక్వెల్ గా తీసారు. అలా సీక్వెల్ వచ్చిన మొదటి ఆస్కార్ ఉత్తమ చిత్రం కూడా ఇదే. బింగ్ క్రాస్బీకి ఫాదర్ చక్ పాత్రకు ఉత్తమ నటుడిగానూ అలాగే బారీ ఫిట్శ్ గెరాల్డ్‌కు ఫాదర్ ఫిట్శ్ గిబ్బన్ పాత్రకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా ఆకాడమీ అవార్డు లభించాయి. అలా ఇద్దరు ప్రధాన నటులకు అకాడమీ అవార్డులు వచ్చిన మొదటి చిత్రం కూడా ”గోయింగ్ మై వే”
బారీ ఫిట్శ్గెరాల్డ్ ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కోసం నామినేట్ అయ్యారు. అంటే ఒకే పాత్రకు రెండు కేటగిరీల్లో ఆయన నామినేట్ అయ్యారు. ఆయన ఉత్తమ నటుడిగా హీరో బింగ్ క్రాస్బీతో పోటీపడ్డారు. ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ లభించినా ఫాదర్ ఫిట్శ్ గిబ్బన్ పాత్ర ఆయనను ప్రజలకు ఎంత చేరువ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత రూల్స్ మారడంతో ఈ గౌరవం మరెవరికీ దక్కలేదు.
గోయింగ్ మై వే అమెరికన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయి. ఇది ఇప్పటికీ అమెరికా సంస్కతిలో ఓ భాగం. ఈ సినిమాలో క్రాస్బీ పాడిన పాటలన్నీ విశేష ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా తరువాత ఆయన గాయకుడిగానూ ఆర్టిస్టుగానూ అమెరికాలో ప్రభంజనం సష్టించారు. అత్యధిక రికార్డులను అమ్మిన గాయకుడిగానూ ఆయనను ఇప్పటి తరం గుర్తు చేసుకుంటారు. 1926 నుంచి 1977 దాకా దిగ్విజయంగా సాగిన ఆయన సంగీత యాత్రలో ఈ సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ఆయన అమెరికన్ గాయకుడుగా మొదటి స్థానానికి వెళ్ళడానికి సహకరించింది. ఇతర దేశాలకూ పరిచయం చేసింది.
పి.జ్యోతి
98853 84740