బిపర్‌జోయ్‌ విలయం.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్
గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్‌జోయ్‌ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను  దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. బిపర్‌జోయ్‌ తుపాను గుజరాత్‌లో తీరం తాకిన తర్వాత అతి తీవ్రమైన కేటగిరి నుంచి తీవ్ర స్థాయికి తగ్గిందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం తుపాను సముద్రం నుంచి భూమి వైపు కదిలిందని సౌరాష్ట్ర-కచ్‌ వైపు కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బిపర్‌జోయ్‌ తీవ్రత 105-115 కి.మీ.కి తగ్గిందని పేర్కొంది. గుజరాత్‌ విధ్వంసం తర్వాత తుపాన్‌ రాజస్థాన్‌కు మళ్లిందని ఐఎండీ డైరెక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. రాజస్థాన్‌ మీదుగా తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు . ఇది వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా తుపాను సృష్టించిన విలయానికి ఇప్పటి వరకు 22 మంది గాయపడ్డారని, 23 జంతువులు చనిపోయాయని గుజరాత్‌ రిలీఫ్‌ కమిషనర్‌ అలోక్‌ పాండే తెలిపారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, 524 చెట్లు నేలకొరిగాయని తెలిపారు. దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అయితే భావ్‌నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నంలో పశువుల యజమాని, అతని కుమారుడు మరణించినట్లు పీటీఐ పేర్కొంది.