– రామంతాపూర్‌లో ఘటన
నవతెలంగాణ-ఉప్పల్
హైదరాబాద్ రామంతాపూర్‌లోని ప్రభుత్వ హౌమియోపతి ఆస్పత్రి ఇన్ పేషంట్ వార్డులో సిలింగ్ పెచ్చులు ఊడి మీద పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. పీజీ విద్యార్థిని స్నేహిత, హెడ్ నర్సు గాయపడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు. స్నేహిత తలకు బలమైన గాయమై.. 8 కుట్లు పడ్డాయి. హెడ్ నర్స్ సునీతకు స్వల్ప గాయాలయ్యాయి. ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి.సత్య ప్రసాద్, నాయకులు ఆస్పత్రిని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ఆస్పత్రులకు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లాఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.
మౌలిక సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హౌమియోపతి ఆస్పత్రికి ఇటీవల రూ.10 లక్షల గ్రాంట్ విడుదల అయిందని, మరమ్మతులు, ఇతర సదుపాయాల కోసం విడుదల చేశారని సూపరిం టెండెంట్ లక్ష్మీదేవి చెప్పారన్నారు. ఆ నిధులను సక్రమంగా వాడనందునే ఈ ఘటన జరిగిందన్నారు. నాణ్యత పాటించకుండా పనులు చేసి రంగులతో ఆస్పత్రి భవనాన్ని ముస్తాబు చేశారని ఎద్దేవా చేశారు. తక్షణమే ఈ వార్డులోని పేషంట్‌లను ఇతర వార్డులకు మార్చాలన్నారు. ప్రభుత్వం, డిపార్టుమెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ ఈ ఘటనపై విచారణ జరిపించి నిర్లక్ష్యం కనబర్చిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.