– పార్టీ కోసం పని చేసే వారికి మాత్రం హ్యాండిచ్చారు…
– బండ్లలో మేమే పెట్రోల్ పోసుకుని తిరగాల్సి వచ్చింది
– ఖమ్మం సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ నేతల ఆవేదన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ పార్లమెంటు సన్నాహక సమావేశాలు కాస్తా ఆవేశ సభలుగా, ఆవేదనలకు వేదికలుగా మారుతున్నాయి. ఈనెల మూడున ప్రారంభమైన ఈ సమావేశాల్లో ప్రతీ రోజూ వివిధ పార్లమెంటు స్థానాలకు చెందిన నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై తీవ్ర ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని వెళ్లగక్కటం పరిపాటిగా మారింది. వారు లేవనెత్తుతున్న అంశాలకు, వేస్తున్న ప్రశ్నలకు కేటీఆర్, హరీశ్‌రావు సహా ఇతర సీనియర్లందరూ సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఒకరకంగా క్షేత్రస్థాయిలోని నేతలు బీఆర్‌ఎస్ అధిష్టానాన్ని ఉతికి ఆరేస్తున్నారు. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంటు సన్నాహక సమావేశంలో సైతం ఇవే సీన్లు రిపీటయ్యాయి. ఎమ్మెల్సీ తాతా మధుకే ఆ జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టటంపై నాయకులు భగ్గుమన్నారు. ‘ఎమ్మెల్పీ పదవి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రెండూ ఆయనకేనా…?’ అంటూ వారు నిలదీసినట్టు సమాచారం. ‘తమకు నచ్చిన వారికేమో ఒకటికి రెండు పదవులిస్తారు.. పార్టీ కోసం పని చేసే వారికి మాత్రం హ్యాండిస్తారు…’ అంటూ వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని మధుకు కాకుండా వేరే వారికి ఇస్తే బాగుండేదంటూ నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు లబ్ది చేకూరిందనీ, అందుకు భిన్నంగా బీఆర్‌ఎస్ హయాంలో గత పదేండ్ల కాలంలో ఏ ఒక్క రోజు క్యాడర్‌ను పట్టించుకోలేదని వారు వాపోయినట్టు సమాచారం. చివరకు బండ్ల(బైకులు)లో పెట్రోల్ పోసుకుని తిరగటానికి కూడా డబ్బులివ్వలేదనీ, దీంతో తామే జేబులోంచి డబ్బులు తీశామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పకుండా రైతు బంధును ఇవ్వటంలో ఆంతర్యమేంటంటూ ఈ సందర్భంగా పలువురు సీనియర్లు అడిగినట్టు వినికిడి. మరోవైపు మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలపై అనుకున్నంత స్థాయిలో ప్రచారం చేయలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మరోసారి ‘నామా’కే ఛాన్స్…
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరపున మరోసారి నామా నాగేశ్వరరావుకే అవకాశం దక్కనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు మంగళవారం నాటి సమావేశంలో ప్రతిపాదనలు వచ్చాయి. నామాకే మరోసారి ఛాన్స్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా భావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
నేడు ‘వరంగల్’పై సమీక్ష
సన్నాహక సమావేశాల్లో భాగంగా బుధవారం వరంగల్ ఎంపీ స్థానంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డితోపాటు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు హాజరుకానున్నారు.