మహిళ హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు

నవతెలంగాణ కంటేశ్వర్
ఒక మహిళను హత్య చేసిన కేసు రుజువు కావడంతో ముద్దాయిలు సయ్యద్ హైమద్, బుద్దవాలి దత్తులకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ మేరకు నిజామాబాద్ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి.శ్రీనివాస్ బుధవారం ముప్పై ఐదు పేజీల తీర్పు వెలువరించారు. తీర్పులోని వివరాలు… కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మత్తమాల గ్రామానికి చెందిన సయ్యద్ అహ్మద్, పిట్లం మండల కేంద్రంలోని శాంతి నగర్ వాస్తవ్యుడు బుద్దవాలి దత్తు స్నేహితులు. పిట్లం మండలానికి వాసి అయినా ఒక షెడ్యూల్డు తెగల మహిళతో దత్తుకు అక్రమ సంబంధం ఉన్నది. ఈ విషయం తెలుసుకున్న అహ్మద్ తనకు ఆమెతో పరిచయం చేయమని చెప్పి, తద్వారా ఆమెతో శృంగారానికి ఒప్పించమని కోరడంతో సరేనన్నాడు.ఒకరోజు వారు ముగ్గురు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో అహ్మద్ ఆమెను శారీరకంగా సుఖపెట్టక సోయి తప్పిపోయాడని కోపగించిన ఆమె కోపంతో వెళ్ళిపోయింది. మల్లి కలుద్దామని ఆమెను అడగడంతో ఆమె నీకు చేతకాదు అంటూ హేళన చేసేది.ఇద్దరు సదరు మహిళను చంపాలని,ఆమెపై ఉన్న బంగారు, వెండి నగలు తీసుకోవాలని నిర్ణయించుకుని ఒక కత్తిని కొనుగోలు చేశారు. 6 ఆగస్టు,2021 న ఎలాగో ఆమెను ఒప్పించి పిట్లం దగ్గర గల జాతీయ రహదారి పక్కన గల ఎలిమెలి కుంట చెరువు దగ్గరలోని చెట్ల మధ్యలోకి వెళ్లి మద్యం తాగారు.మధ్య మత్తులో సోయి తప్పిపోయిన ఆమెను అహ్మద్ తనవెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి, గొంతు కోశాడు.దత్తు అమెపైన గల బంగారు,వెండి నగలు,డబ్బులు తీసుకుని హత్యకు సహకరించాడు. కోర్టు నేర విచారణలో పైన పేర్కొన్న హత్య, దొంగతనం అభియోగాలు రుజువు కావడంతో ఇద్దరికీ హత్య కేసులో జీవిత కారాగారం, దొంగతనం కేసులో మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తు న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు.