సహకార బ్యాంకు రంగంలో టు-టైర్‌ విధానం మేలు

– సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సహకార బ్యాంకు రంగంలో టు-టైర్‌ విధానం ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం కోఠిలో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉభయ తెలుగు రాష్ట్రాల బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో త్రీ-టైర్‌ విధానం అమల్లో ఉందనీ, దీని వల్ల పరిపాలనా పరంగా కానీ, నిర్వహణ పరంగా గానీ అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం త్రీ-టైర్‌ విధానంలో భాగంగా గ్రామాల స్థాయిలో ప్యాక్స్‌ చైర్మెన్‌, జిల్లా స్థాయిలో డీసీసీబీ చైర్మెన్‌, రాష్ట్ర స్థాయిలో టేస్కాబ్‌ చైర్మెన్‌ వ్యవస్థ అమల్లో ఉందని తెలిపారు. టు-టైర్‌ విధానం అమల్లోకి వస్తే గ్రామాల స్థాయిలో ప్యాక్స్‌ చైర్మెన్‌, రాష్ట్ర స్థాయిలో టేస్కాబ్‌ చైర్మెన్‌ ఉంటారనీ, జిల్లా స్థాయిలో డైరెక్టర్‌ మాత్రమే రాష్ట్ర బ్యాంక్‌ ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. టు-టైర్‌ విధానం అమలులోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాలలో సహకార బ్యాంకు డైరెక్టర్లు ఎంపిక అవుతారని వివరించారు. అయితే రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ( ఆర్బీఐ ) ప్రతిపాదన మేరకు దేశంలో 12 రాష్ట్రాల్లో టు-టైర్‌ విధానం అమలు జరుగుతోందని చెప్పారు. బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు రవీంద్రనాథ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాంబాబు, కార్యదర్శులు కృష్ణారావు, ఉదరు కుమార్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.