ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

– ఒకరు మతి, మరొకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-నార్సింగి
ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తి మతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్ర పరిధిలోని జాతీయ రహదారి 44పై కట్ట మైసమ్మ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం బాలాజీనగర్‌కు చెందిన మడూరి రమేష్‌ (50) ఈనెల 11న సాయంత్రం మిర్జాపల్లిలో పనులు ముగించుకుని తన స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. మార్గమధ్యంలో నార్సింగి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై కట్ట మైసమ్మ వద్దకు చేరుకోగానే నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన మియాపురం లక్ష్మీనారాయణ (58) రాంగ్‌ రూట్లో తన టీవీయస్‌ ఎక్సెల్‌ బండిని అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి రమేష్‌ను ఢీకొట్టాడు. బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు వాహన దారులు రోడ్డుపై పడి ఇరువురికి గాయాలయ్యాయి. రమేష్‌ ఎడమ చెంపకు, కుడి భుజానికి, ఎడమ మోకాలుకు, కుడి పాదానికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీనారాయణ తలకు, ఎడమ కాలుకు తీవ్ర గాయాలు కాగా ఇరువురికి పోలీసులు చికిత్స కోసం రామాయంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీనారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలని సూచించారు. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా లక్ష్మీనారాయణ మార్గ మధ్యంలోనే మతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మత దేహాన్ని రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.