– మరికొందరు బ్యాక్ టు పెవిలియన్
– అయోమయంలో బీజేపీ నాయకత్వం
– కేవలం ఒక్క అభ్యర్థితోనే రెండో జాబితా
– మహబూబ్‌నగర్ అభ్యర్థిగా ఏపీ మిథున్‌రెడ్డి
– తీవ్ర అసంతృప్తిలో డీకే అరుణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీలో రోజుకో కీలక వికెట్ పడిపోతున్నది. శుక్రవారం ఒక్కరోజే రెండు ముఖ్యమైన వికెట్లు పడ్డాయి. అచ్చిరాని మైదానం(ఎన్నికల గోదా)లోకి దిగి పరుగులు చేయలేక ఇబ్బంది పడటం ఎందుకనుకుంటున్నారో ఏమోగానీ ముందే పెవిలియన్ బాట(మళ్లీ సొంతగూళ్లకు) పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. గెలుపు మీద ఆశలు వదులున్న బీజేపీ టెయిలెండర్లతో 2023 ఫైట్‌ను మమా అనిపించాలని చూస్తున్నది. తాము గెలవలేకపోయినా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి తెలంగాణలో కాంగ్రెస్ నెట్‌రన్‌రేట్‌ను వీలైనంత మేరకు తగ్గించే ప్రయత్నాల్లో మునిగింది. దీంతో నాయకత్వం తీరుపై క్షేత్రస్థాయి శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.కొంత కాలంగా బీజేపీ ముఖ్య నేతల తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. అసంతృప్తితో రగిలిపోతూ పలుమార్లు మీటింగ్‌లు ఏర్పాటు చేసిన సీనియర్లలో ఈయన కూడా ఒకరు కావడం గమనార్హం. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమంటూనే ఆ పార్టీకే మేలు చేసేలా వ్యవహరిస్తున్న బీజేపీ తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ కూడా పార్టీకి బైబై చెప్పేశారు. చెయ్యిని అందుకున్నారు. కేసీఆర్ మంచిచెడులన్నీ తెలిసిన దిలీప్‌కుమార్ బీజేపీని వీడటం ఆపార్టీకి పెద్దలోటే. దీంతో శుక్రవారం ఒక్కరోజే ఆ పార్టీ నుంచి ఇద్దరు కీలక నేతలు వెళ్లిపోయినట్టు అయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పార్టీని వీడుతున్న నేపథ్యంలో..కాంగ్రెస్ రెండో లిస్టుపై ఆధారపడి బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నది. హస్తం పార్టీలో సీటు దక్కని అసంతృప్త నేతలు తమవైపు వస్తారని ఆశతో ఎదురుచూస్తున్నది. అయితే, అది కూడా నెరవేరేటట్లు కనిపించడం లేదు.
బీజేపీ రెండో జాబితా ఒక్కరితోనే..డీకే పయనమెటో?
బీజేపీ జాతీయ నాయకత్వం శుక్రవారం రెండో జాబితాను వెల్లడించింది. ఆ జాబితాలో కేవలం ఒకే ఒక్క పేరు ఉండటం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆ పేరూ ఆ పార్టీలో చిచ్చుపెట్టింది. మొదటి నుంచీ మహబూబ్‌నగర్ సీటు తనకు కేటాయించాలని డీకే అరుణ పట్టుబడుతూ వస్తున్నారు. అదే సమయంలో ఆ సీటు కోసం మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా కాస్కోని కూర్చున్నారు. తన కొడుకు కోసం గట్టి ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. అందులో భాగంగానే ఆ సీటును జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి కేటాయించింది. తండ్రీకొడుకులు పార్టీ మారుతారనే భయంతోనే ఆ సీటు కేటాయించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ కేటాయింపుపై డీకే అరుణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె పయనమెటు? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు రంగంలోకి దిగి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. మల్కాజిగిరి నియోజకవర్గంలోనూ ఓ ముఖ్య నేత పువ్వు పార్టీకి బైబై చెప్పబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.