విలక్షణ నటుడు చంద్రమోహన్‌ ఇకలేరు

Typical actor Chandramohan is no moreచంద్రమోహన్‌..తెలుగు చలన చిత్ర సీమలో దాదాపు ఐదున్నర దశబ్దాలుగా భిన్న పాత్రలు, సినిమాలతో అలరించిన విలక్షణ నటుడు. లక్కీ హీరోగా పేరొందిన ఆయన 175 చిత్రాల్లో హీరోగా నటించగా, మొత్తంగా 932 చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో నటించి సినిమాతో సుదీర్ఘ ప్రయాణం చేశారు. తెలుగుతోపాటు తమిళంలో ఐదు చిత్రాలు, కన్నడ, మలయాళ భాషల్లో ఒక్కొక్క చిత్రంలో నటించిన చంద్రమోహన్‌ ఇకలేరనే వార్తతో తెలుగు చిత్ర సీమ శోక సంద్రంలో మునిగిపోయింది.ఇంత పొట్టిగా ఉన్నాడు హీరో అవుతాడా అని నవ్విన వాళ్ళందరికి దీటైన సమాధానం చెబుతూ సాగిన చంద్రమోహన్‌ సినీ జీవిత విశేషాల పరంపరని ఓసారి చూద్దాం..
చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. 1942 మే 23న కష్ణా జిల్లా పమిడిముక్కలలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. బాపట్లలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివారు. చదువుకునే రోజుల నుంచే నాటకాలు వేయడంలో ఆయన దిట్ట. సినిమా రంగంపై మనసు మరలడంతో మద్రాసు వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు.
ఆరంభంలోనే బిఎన్‌రెడ్డి వంటి మేటి దర్శకుని దష్టిలో పడ్డారు. ఆయనే చంద్రశేఖర్‌కు చంద్రమోహన్‌ అని నామకరణం చేశారు. బిఎన్‌రెడ్డి తెరకెక్కించిన ‘రంగులరాట్నం’ (1966) చిత్రంతో హీరోగా చంద్రమోహన్‌ పరిచయం అయ్యారు. ఈ సినిమాలోని ఆయన నటనకు మంచి పేరుతోపాటు నంది అవార్డు కూడా అందుకున్నారు. అయితే దాదాపు మూడేళ్ళ వరకు ఆయనకి హీరోగా ఏ అవకాశమూ రాకపోవడంతో చిన్న చిన్న పాత్రల్లో నటించాల్సి వచ్చింది. హీరో వేషం ఇచ్చి నిలబెడదామని కొంతమంది దర్శక, నిర్మాతలు ప్రయత్నించిన లాభం లేకపోయింది. చివరకు ఆయన అన్నయ్య కె.విశ్వనాథ్‌ ధైర్యం చేసి ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. హీరోగా చంద్రమోహన్‌ జీవితానికి ఈ చిత్రం తిరిగి నాంది పలికింది. ఆ తర్వాత ‘పదహారేళ్ల వయసు’ చిత్రంలో అవకాశం రావడంతో హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగి, ఇక వెనుదిరిగి చూసుకోలేదు.
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు … ఇలా దిగ్గజ కథానాయ కులతోనూ నటించారు. చంద్రమోహన్‌కి శోభన్‌బాబు మంచి ఫ్రెండ్‌, గైడ్‌ కూడా. చంద్రమోహన్‌ హస్తవాసి మంచిదని ఆస్తి కొన్న ప్రతిసారీ తన దగ్గర శోభన్‌బాబు పదివేలు తీసుకొనేవారట. అలాగే కష్ణ, విజయనిర్మల పెళ్లి జరిగింది కూడా చంద్రమోహన్‌ సారధ్యంలోనే.
చంద్రమోహన్‌ పక్కన నటించిన దాదాపు 60 మంది కథానాయికల్లో అత్యధికులు అగ్ర స్థానానికి చేరుకున్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ, రాధిక, ప్రభ, విజయశాంతి, తాళ్లూరి రామేశ్వరి.. ఇలా ఎంతమందికో చంద్రమోహన్‌ తొలి హీరో. అలాగే లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయ శాంతి…. ఇలా చాలా మంది హీరోయిన్లతో నటించారు. ‘రాఖీ’ చిత్రంలో ఎమోషనల్‌ సీన్‌ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడం, అలాగే అనారోగ్యం కారణంగా ‘దువ్వాడ జగన్నాథం’ షూటింగ్‌ వాయిదా పడటంతో తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదని నటనకు రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. గోపీచంద్‌ హీరోగా నటించిన ‘ఆక్సిజన్‌’ (2017)లో చంద్రమోహన్‌ చివరి సారిగా నటించారు.
ఝుమ్మంది నాదం (సిరిసిరి మువ్వ), మావిచిగురు తినగానే (సీతామాలక్ష్మి), మేడంటే మేడా కాదు (సుఖ దు:ఖాలు), కలనైనా క్షణమైనా (రాధాకళ్యాణం), మల్లెకన్న తెల్లన (ఓ సీత కథ), సామజవరాగమనా (శంకరాభరణం), పక్కింటి అమ్మాయి పరువాల (పక్కింటి అమ్మాయి), బాబా… సాయిబాబా (షిర్డీసాయి బాబా మహత్యం) వంటితర పాటలెన్నో ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి.
కళాతపస్వి కె.విశ్వనాథ్‌, గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం.. చంద్రమోహన్‌ ..ఈ ముగ్గురూ అక్కాచెల్లెళ్ల పిల్లలు. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ‘శంకరాభరణం’ చిత్రానికి ఈ ముగ్గురూ కలిసి పనిచేయడం విశేషం. చంద్రమోహన్‌కి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మేనల్లుడు. ఆయన నిర్మించిన ‘చిన్నోడు – పెద్దోడు’ చిత్రంలో చంద్రమోహన్‌ నటించారు.
‘పదహారేళ్ల వయసు’, ‘సిరిసిరి మువ్వ’ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు, 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ కమెడీయన్‌గా నంది అవార్డు, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
భార్య జలంధర, రచయిత్రి. డాక్టర్‌ గాలి బాలసుందరరావు ఏకైక కూతురు ఆమె. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి మధుర మీనాక్షి అమెరికాలో, రెండో అమ్మాయి మాధవి చెన్నైలో ఉంటున్నారు.
రంగులరాట్నం (1966), సుఖదుఃఖాలు (1967), ఆత్మీయులు (1969), బొమ్మా బొరుసా (1971), కాలం మారింది (1972), జీవన తరంగాలు (1973), అల్లూరి సీతారామరాజు (1974), ఓ సీత కథ (1974), దేవదాసు (1974), ప్రాణం ఖరీదు (1978), సిరిసిరిమువ్వ (1978), సీతామాలక్ష్మి (1978), పదహారేళ్ళ వయసు (1978),. తాయారమ్మ బంగారయ్య (1979), శంకరాభరణం (1979), శుభోదయం (1980), రాధా కళ్యాణం (1981), ముగ్గురు మిత్రులు (1985), చందమామ రావే (1987), అల్లుడు గారు (1990), ఆదిత్య 369 (1991), ఆమె (1994), నిన్నే పెళ్ళాడతా (1996), పాపే నా ప్రాణం (2000), చెప్పాలని ఉంది (2001), డార్లింగ్‌ డార్లింగ్‌ (2001), శుభాశీస్సులు (2001), మన్మధుడు (2002), 7/జీ బందావన్‌ కాలనీ (2004), వర్షం (2004), నేనుసైతం (2004), అతనొక్కడే (2005), పౌర్ణమి (2006) వంటి తదితర ఎన్నో చిత్రాల్లో ఆయన పోషించిన భిన్న పాత్రలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి.
సినిమా జీవితం చాలా నేర్పింది. పేరు, డబ్బు, రిలేషన్స్‌.. ఏవీ శాశ్వతం కాదు అని, ఆర్ధికంగా జాగ్రత్త పడకపోతే వచ్చే దైన్యం దుర్భరంగా ఉంటుందని తెలియజేసింది. నమ్మక ద్రోహులకు దూరంగా ఉండాలనీ చెప్పింది. ఎప్పటికీ చెప్పుకోలేని చేదు నిజాలు గుండెల్లో ఎలా దాచుకోవాలో కూడా అలవాటు చేసింది.
– చంద్రమోహన్‌