పేదలపై దౌర్జన్యమా…!

– గుడిసెలు వేసుకున్న వారి అక్రమ అరెస్టులు అప్రజాస్వామ్యం : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పర్వతాలు
నవ తెలంగాణ -వంగూరు
గుడిసెలు వేసుకున్న పేద వారికి ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని కోరుతుంటే.. వారిని అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో పేదలకు పంపిణీ చేసిన స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలపై ఆదివారం పోలీసులు దౌర్జన్యానికి దిగి, వారి గుడిసెలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాన్ని ఆ పార్టీ జిల్లా నాయకులు సందర్శించి పరిశీలించారు. పేదలతో కలిసి పరిశీలించడానికి వెళుతున్న సీపీఐ(ఎం) నాయకులను, గుడిసెలు వేసుకున్న పేదలను పోలీసులు అడ్డుకొని మహిళలని కూడా చూడకుండా వారిపై దాడిచేసి, అరెస్టులు చేసి వంగూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో గుడిసెవాసులతో పర్వతాలు మాట్లాడారు. 1997లో ఆనాటి ప్రభుత్వం పేదలకిచ్చిన ఇండ్ల స్థలాలను నేడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుంజుకోవడమే కాక, నేడు పేదల పక్షాన నిలబడిన సీపీఐ(ఎం) కార్యకర్తలను అరెస్టులు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1997లో గ్రామంలో ఉన్న పేదలకు 11 ఎకరాల భూమిలో పట్టాలు ఇచ్చారని, వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇప్పటివరకు ఇండ్లు నిర్మించుకోలేకపోయారని తెలిపారు. అటువంటి భూమిని నేటి పాలకులు ప్రభుత్వ భూమి అని, అందులో రైతు వేదిక ఫంక్షన్‌ హాల్‌, మసీదు లాంటివి నిర్మించడం సరికాదన్నారు. కొంతమంది ఆ స్థలాన్ని కొంత ఆక్రమించుకొని ఇల్లూ కట్టుకున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా పేదలను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పట్టాలు ఉన్న స్థలాలోకి లబ్దిదారులు వెళితే అడ్డుకోవడం అరెస్టులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సార్లు తహసీల్దార్‌, రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతోనే ఆ స్థలంలో గుడిసెలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు దృష్టి సాధించి వెంటనే లబ్దిదారులకు హద్దులు చూపించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆంజనేయులు, జిల్లా నాయకులు బాలస్వామి, బాల్‌రెడ్డి, బొల్లె జగన్‌, పరశురాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.