ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు 980 రోజులు నిండాయి. అది ఎప్పుడు ముగుస్తుందో ఎలా అంతమవుతుందో తెలియని స్థితి. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి దేశాలు ఎన్ని ఆయుధాలు, డాలర్లు ఎన్ని కుమ్మరించినా రోజురోజుకూ కొత్త ప్రాంతాల్లోకి రష్యా సేనలు చొచ్చుకుపోతున్నాయి. యుద్ధరంగంలో విజయం మాట అటుంచి నిలదొక్కుకొనేందుకే ఇబ్బందులు పడుతున్నాయని జెలెన్‌స్కీ దళాల గురించి ఎకనమిస్ట్ వంటి పత్రికలు రాస్తున్నాయి. అయినప్పటికీ మరోసారి చూడవలే అన్నట్లుగా అమెరికా రంగంలోకి దిగింది. ఇప్పటికే వేలాది కంపెనీలు, వ్యక్తుల మీద, రష్యా మీద అనేక ఆంక్షలను ప్రకటించిన అమెరికన్లు బుధవారం నాడు చైనాతో సహా పన్నెండు దేశాలకు చెందిన మరో నాలుగువందల కంపెనీలు, కొందరు వ్యక్తుల మీద కొత్తగా ఆంక్షలు విధిం చించారు. వీటిలో మన దేశానికి చెందిన పందొమ్మిది కంపెనీలు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అటు ప్రజోపయోగానికి, దాన్నే మిలిటరీ అవసరాలకు వినియోగించే కీలక, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను ఈ కంపెనీలు రష్యాకు సరఫరా చేస్తున్నాయన్నది అమెరికా ఆరోపణ. తమ సాంకేతిక పరిజ్ఞాన అపహరణ, దిగుమతి, కొన్ని రకాల పరికరాలను, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాటిని భారత కంపెనీలు రష్యాకు మళ్లించి అక్కడ డ్రోన్ల వంటి ఆయుధాల తయారీకి తోడ్పడుతున్నాయని అంటోంది. అలా జరుగుతోందో లేదో ఎలాంటి రుజువులు లేవు.
అయితే ఏ నిబంధనల ప్రకారం అమెరికా వందల కోట్ల డాలర్ల ఆధునిక ఆయుధాలు, నగదు ఉక్రెయిన్‌కు అందిస్తున్నట్లు? అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇది రాసిన సమయానికి ఈ పరిణామంపై మన దేశ స్పందన లేదు. ఉక్రెయిన్ వివాదంలో తటస్త వైఖరితో ఉన్న సంగతి తెలిసిందే. ఎటూ మొగ్గకపోయినప్పటికీ అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు, ఎరువులు, ఇతర వస్తు వులు, మిలిటరీ సామగ్రి, ఆయుధాలను మనదేశం కొనుగోలు చేస్తున్నది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇప్పటి వరకు రష్యా ఆయుధ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయమూ కలిగినట్లు వార్తలు లేవు. అదే విధంగా అంతకు ముందు కంటే ముడి చమురును కూడా ఎక్కువగా ఎగుమతి చేస్తోంది.ఈ కారణంగానే ఉక్రోశంతో మరిన్ని ఆంక్షలకు అమెరికా తెగబడుతోంది.ఉత్తర కొరియా నుంచి వచ్చిన సైనికులు రష్యా తరఫున ఉక్రెయిన్‌లో దాడులు చేస్తున్నారని కూడా కొద్ది రోజులుగా కొత్త పల్లవి అందుకుంది. ఉక్రెయిన్‌లో నాటో దేశాలు వివిధ దేశాల నుంచి రప్పించిన కిరాయి మూకలు రష్యన్ల మీద దాడులకు వినియోగిస్తున్నారనే వార్తలు వెలు వడిన పూర్వరంగంలో రష్యా మీద ఎదురుదాడికి ఉత్తర కొరియాను లాగటం తప్ప ఇంతవరకు అలాంటి ఆధారాలున్నట్లు అమెరికా కూడా చెప్పటం లేదు.
రానున్న వారాల్లో వస్తారని ఒకసారి, ఇప్పటికే పదివేల మందిని సిద్ధం చేశారు, శిక్షణ ఇప్పిస్తున్నారంటూ మరోసారి పెంటగన్, సిఐఏ కట్టుకథలను వ్యాపింపచేస్తున్నాయి.అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, యుద్ధరంగంలో ఉన్న ఉక్రెయిన్ మిలిటరీ కమాండర్లు, పశ్చిమదేశాలకు చెందిన వారు రానున్న ఆరునెలల్లో రష్యా దళాలను అడ్డుకోవటం, అసలు పోరు ఎటుపోతున్నదో అర్ధం కావటం లేదంటూ ప్రయివేటు సంభాషణల్లో చెబుతున్నారని ఎకనమిస్ట్ పత్రిక రాసింది. ఒకటి రెండు చోట్ల పుతిన్ సేనలను నిలువరించినా అనేక ప్రాంతాల్లో రష్యా చొచ్చుకుపోతున్నదని పేర్కొన్నది. కొన్నిసార్లు పెద్దగా సాధించిందేమీ లేకపోయినా మొత్తం మీద రష్యా సేనలు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ముందుకు పోతున్నాయని అమెరికా అగ్రపత్రిక న్యూయార్క్ టైమ్స్ కూడా రాసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రష్యా అదుపులోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాలలో సగం గత మూడునెల్లో సాధించినవే అని, ఉక్రెయిన్ సేనలు డాన్‌బాస్ ప్రాంతంలో నిలవటం కష్టమని నిపుణులను ఉటంకిస్తూ ఆ పత్రిక రాసింది.
తాను నేరుగా రంగంలోకి దిగేందుకు నాటోకూటమి భయపడుతున్నది. ఎన్ని ఆయుధాలిచ్చినా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి.ఉక్రెయిన్‌లో రోజురోజుకూ శిక్షణ పొందిన సైనికుల సంఖ్య కూడా తగ్గుతున్నది, నాటో ఇచ్చిన ఆధునిక ఆయుధాలను జెలెన్‌స్కీ సేనలకు అందచేస్తే అవెక్కడ రష్యన్ల పరం అవుతాయోమోన్న భయం కూడా ఉంది.అందుకే వినియోగించేందుకు నిపుణుల పేరుతో అమెరికా, ఇతర దేశాల నుంచి పరిమితంగా మిలిటరీని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.అక్కడ పరిస్థితి ఇలా ఉంది గనుకనే అమెరికా ఉక్రోశం రోజు రోజుకూ పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది.