ఉగాండా ఢమాల్‌

ఉగాండా ఢమాల్‌– 39 పరుగులకే ఆలౌట్‌ కరీబియన్ల ఏకపక్ష విజయం
నవతెలంగాణ-ప్రొవిడెన్స్‌
తొలిసారి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పోటీపడుతున్న పసికూన ఉగాండాపై వెస్టిండీస్‌ పంజా విసిరింది. కరీబియన్‌ పేసర్‌ అకీల్‌ హొస్సేన్‌ (5/11) ఐదు వికెట్ల విజృంభణతో ఉగాండా ఉలిక్కిపడింది. 12 ఓవర్లలో 39 పరుగులకే కుప్పకూలింది. అల్జారీ జొసెఫ్‌ (2/6) సైతం మెరవటంతో ఉగాండా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు ఆలౌటైంది. 174 పరుగుల భారీ ఛేదనలో ఉగాండా బ్యాటర్లు విలవిల్లాడారు. కరీబియన్‌ భీకర పేస్‌ ముందు తేలిపోయారు. టెయిలెండర్‌ జుమా (13 నాటౌట్‌) ఒక్కడే ఉగాండా ఇన్నింగ్స్‌లో రెండెంకల స్కోరు సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. జాన్సన్‌ చార్లెస్‌ (44, 42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్‌ (30 నాటౌట్‌, 17 బంతుల్లో 6 ఫోర్లు) సమా నికోలస్‌ పూరన్‌ (22), రోవ్‌మాన్‌ పావెల్‌ (23), రూథర్‌ఫోర్డ్‌ (22) రాణించారు. గ్రూప్‌-సిలో రెండు విజయాలు సాధించిన వెస్టిండీస్‌.. అఫ్గనిస్థాన్‌తో సమానంగా 4 పాయింట్లు గెల్చుకుంది. మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో అఫ్గాన్‌ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉండగా, విండీస్‌ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇదే గ్రూప్‌లో న్యూజిలాండ్‌ అట్టడుగు స్థానంలో ఉంది.