విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేసే విధానానికి సవరణలు చేస్తూ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) రూపొందించిన నిబంధనల ముసాయిదాకు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. కొత్తగా రూపొందించిన ఈ విధివిధానాలు రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నాయనేది వాటి ప్రధాన విమర్శ. అందుకే ఈ నిబంధనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.వైస్ ఛాన్సలర్ ఎంపిక, నియామకాలకు సంబంధించి 2010 నాటి నిబంధనలకు యు.జి.సి సవరణలు ప్రతిపాదించింది. 2010 నాటి నిబంధనల ప్రకారం కనీసం పదేళ్లపాటు ప్రొఫెసర్‌గా పని చేసిన అనుభవంగల విద్యావేత్తలు ఈ పదవికి అర్హులు. తాజా సవరణ ద్వారా విద్యావేత్తలే కాకుండా పారిశ్రామిక రంగం, ప్రభుత్వ యంత్రాం గం, పబ్లిక్ పాలసీ రంగాలలో పదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారినైనా వైస్ ఛాన్సలర్‌గా నియమించచ్చని ప్రతిపాదిం చింది. ప్రతిపాదనలు రాజ్యాంగ పరమైన అనేక చిక్కులు తెచ్చి పెడుతుంది. ప్రస్తుతం ఈ అంశం మీద రాజకీయంగా చెలరేగిన నిరసనలు, బహుశా ఈ నిరసనలకు వ్యతిరేకంగా యు.జి.సి గానీ అధికార పార్టీ గానీ రాజకీయంగా ఎలా స్పందిస్తాయన్న విషయాలను పక్కనపెట్టి ఈసమస్య లోటుపాట్లు చర్చించేందుకు ప్రయత్నిద్దాం.
యు.జి.సి చట్టం లక్ష్యం
పార్లమెంట్ 1956లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం చేసింది. విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలను నిర్థారించ డానికి, సమ న్వయ పరచడానికి యు.జి.సిని నెలకొల్పుతున్నామని పార్లమెంటు ప్రకటించింది. అంతేగాక విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ, పరిశోధనల ప్రమాణాలను నిర్ధారించడానికి, మెరుగుపరచడానికి యు.జి.సి కఅషి చెయ్యాలని చట్టం స్పష్టం చేస్తున్నది. ఈ కర్తవ్యాల నిర్వహణ కోసం, విశ్వవిద్యాలయాల నిర్వహణ, అభివృద్ధి కోసం యు.జి.సి నిధులు కేటాయించాలి. విశ్వ విద్యాలయాలు అందించే విద్యలో మెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలు సిఫార్సు చెయ్యవచ్చు. విశ్వవిద్యాలయాల సాధారణ, ప్రత్యేక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన గ్రాంట్లు ఇవ్వమని సలహా ఇవ్వవచ్చు. విద్యకు సంబంధించి దేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటి నుంచీ, విదేశీ విశ్వ విద్యాలయాల్లో విద్యాబోధన గురించి సమాచారం సేకరించి, ఆ సమాచారం మొత్తాన్ని ప్రతి విశ్వవిద్యాలయానికి అందుబాటులో ఉంచవచ్చు. ఫీజుల నియత్రణను పర్యవేక్షించ వచ్చు. యు.జి.సి చట్టం సెక్షన్ 26 ప్రకారం ఈచట్టాన్ని తు.చ తప్పక పాటించాలి. అమలు చేయాలని యు.జి.సి నిబంధనలు రూపొందించవచ్చు. అయితే యు.జి.సి రూపొందించే నిబంధనలు యు.జి.సి చట్టానికి, అందులోని నియమాలకు లోబడి ఉండాలని చట్టం స్పష్టంగా చెబుతుంది. ఈ చట్టంలో అన్నిటికన్నా ముఖ్యమైన నిబంధన ఏమిటంటే విశ్వవిద్యాలయంలో బోధన సిబ్బందిగా నియమించబడడానికి కావాల్సిన అర్హతలు, విశ్వవిద్యాలయం జారీచేసే డిగ్రీలకు ఉండే ప్రమాణాలు, ఆ ప్రమాణాలు నిలబెట్టడానికి విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేసుకుని జరగాల్సిన కృషికి సంబంధించినది.
తనకు మాలిన ధర్మం
ప్రస్తుతం విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవులకు అర్హతలు సవరిస్తూ కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చే అధికారం చట్ట ప్రకారం యు.జి.సికి ఉన్నదా అనేదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. వాస్తవానికి చట్టంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ల ఎంపిక నియామకాలలో యు.జి.సికి ఎలాంటి అధికారాలూ లేవు. చట్టం ప్రకారం యు.జి.సి మౌలిక లక్ష్యం విశ్వవిద్యాలయాల ప్రమాణాలు నిర్ధారించడం, పెంపొందించడం, సమన్వయం చేయడం వరకే పరిమితం. బోధనా ప్రమాణాలు నిర్ణయించడం, బోధనా సిబ్బందికి ఉండాల్సిన అర్హతలకు సంబంధించి ఆదేశాలు కూడా యు.జి.సి ఇవ్వవచ్చు. కానీ చట్టంలో ఎక్కడా పేర్కొనని వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో జోక్యం చేసుకోవడం తనకు మాలిన ధర్మమే. యు.జి.సి రూపొందించే నియమ నిబంధనలు యు.జి.సి చట్టానికి లోబడే ఉండాలి తప్ప చట్టాన్ని అతిక్రమించే హక్కు ఆ సంస్థకు లేదు. కాబట్టి వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి యు.జి.సి తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు చట్ట రీత్యా చెల్లుబాటు కావు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేసిన శాసనాల ద్వారా విశ్వవిద్యాలయాలను నెలకొల్పాయి. కాబట్టి ఆయా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకాలకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు వంటివి సదరు ప్రభుత్వాలు శాసన రూపేణా నిర్ణయించాలే తప్ప ఆ పని యు.జి.సి చేపట్టరాదు. వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియ యు.జి.సి భావిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రమాణాలను సమన్వయం చేయడం, పెంపొందించడం వంటి అంశాల పరిధిలోకి రాదు.సురేష్ పాటిల్ ఖేడ్ వర్సెస్ ద ఛాన్సలర్ యూనివర్శిటీస్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అదర్స్ కేసులో (2011) ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ అంశాన్నే నిర్థారిస్తుంది. కోర్టువారి దృష్టిలో విశ్వవిద్యాలయాల ప్రొ ఛాన్సలర్‌లు, వైస్ ఛాన్సలర్ల నియామక పద్ధతులు గానీ, అర్హతలు గానీ విశ్వవిద్యాలయాల ప్రమాణాల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తాయని భావించడానికి వీలులేదని ఆ తీర్పు స్పష్టం చేస్తుంది. కాబట్టి యు.జి.సి చట్టంలోని సెక్షన్ 26 కింద విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపిక, నియామకాలు యు.జి.సి పరిధిలో లేవని తేటతెల్లం అవుతుంది.
విశ్వవిద్యాలయాల స్థాపన కోసం కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన శాసనాలను తోసిరాజనే అధికారం యు.జి.సికి ఉందా అనేది రాజ్యాంగ పరమైన సవాలు. గతంలో కొన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్ల అర్ధాంతర తొలగింపు సందర్భంగా ఈ ప్రశ్న తలెత్తింది. సురేష్ పాటిల్ ఖేడ్ కేసులో బొంబాయి హైకోర్టు ఇంకా ఇలా పేర్కొంది. యు.జి.సి రెగ్యులేషన్స్ 2010లో రెగ్యులేషన్ 7.3.0ను అనుసరించి యు.జి.సి పార్లమెంట్ చేసిన చట్టాన్ని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను అతిక్రమించజాలదు. అయితే సుప్రీంకోర్టు కల్యాణి మతివనన్ వర్సెస్ కె. విజయరాజ్ అండ్ అదర్స్ కేసులో (ఆలిండియా రిపోర్ట్ 2015 సుప్రీంకోర్టు 1875 పేరా 22) చట్టం ద్వారా రూపొందించిన యుజిసి నిబంధనలు ఏ విశ్వవిద్యాలయాలకు చెందుతాయో వాటికి వర్తిస్తాయి’ అని పేర్కొన్నది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదిస్తే ఆ నిబంధనలు వర్తింప చేయవచ్చు’ అంటూ తన తీర్పుకు గల ప్రాతిపదికన వివరించింది. అయితే ప్రస్తుతం యుజిసి చేసిన సవరణ ప్రతిపాదనలను పార్లమెంటు ఆమోదించినవి కావు. పార్లమెంట్ ఆమోదించిన తర్వాతే సవరణ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. అప్పటి వరకూ అవి ప్రతిపాదనలుగానే ఉంటాయి. అయితే కల్యాణి మతివనన్ కేసులో సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు చట్ట సభలలో నియమ నిబంధనలను ప్రవేశపెట్టి ఆమోదించే సంవిధానాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పక తప్పడం లేదు.
యుజిసి నిబంధనలు రాష్ట్రాలు చేసే చట్టాలను పక్కనబెట్టే అవకాశం ఉన్నదా లేదా అనేది రాజ్యాంగంలోని 254వ అధికరణం కింద పరిశీలించాలి. ఈ అధికరణాన్ని అనుసరించి ఏ రాష్ట్ర ప్రభుత్వ చట్టమైనా కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా వుంటే అలా ఉన్న భాగం చెల్లుబాటు కాదు. అయితే ప్రస్తుతం యుజిసి తీసుకువచ్చిన సవరణ ప్రతిపాదనలు 254వ అధికరణం కింద కేంద్ర చట్టం పరిధిలోకి వస్తాయా అనేది కీలకమైన ప్రశ్న. ఈ అధికరణంలోని రెండవ క్లాజ్‌ను అనుసరించి ఏ రాష్ట్ర శాసనసభ అయినా చట్టం చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపితే రాష్ట్రపతి ఆమోదం లభించిన తరువాతనే ఆ చట్టం అమల్లోకి వస్తుంది.
ఈ క్లాజులో చట్టం అనే మాటకు అర్థం శాసనసభ ఆమోదించిన బిల్లు అని మాత్రమే. ఆ బిల్లు మీద రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డాకే అది చట్టంగా చలామణిలోకి వస్తుంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత బిల్లుకు చేసే సవరణలు చట్టరీత్యా చెల్లుబాటు కావు. రాష్ట్రాలు చేసిన చట్టాలను అధిగమించాలంటే పార్లమెంట్ ఉభయ సభలు ఆ మేరకు బిల్లు ఆమోందించి, దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. రాష్ట్రపతి ఆమోద ముద్రపడిన తర్వాత మాత్రమే రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం చెల్లుబాటు కాకుండా పోతుంది.
కీలకమైన రూలింగ్
ఏమైనప్పటికీ కల్యాణి మతివనన్ కేసులో కోర్టు కీలకమైన రూలింగ్ ఇచ్చింది. యుజిసి చట్టంలోని 7.3.0 నిబంధన ప్రకారం రాష్ట్రాల శాసనసభల ద్వారా నెలకొల్పబడిన కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు యుజిసి సిఫార్సులు మాత్రమే చేయగలదని బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రస్తుత వివాద పరిష్కారానికి ఆ రూలింగ్ తోడ్పడుతుంది.
(‘ద హిందూ’ సౌజన్యంతో)
– పి.డి.టి ఆచారి