– సెమీస్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్
– ఒలింపిక్ చాంప్‌పై సంచలన విజయం
– ఫైనల్లో అడుగుపెట్టిన బల్లెం వీరుడు నీరజ్
– పారిస్ 2024 ఒలింపిక్స్
ఉగ్ర వినేశ్ ఫోగట్. భారత స్టార్ మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ సంచలనం సృష్టించింది. రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న వినేశ్ ఫోగట్.. రికార్డులను బద్దలుకొట్టే ప్రదర్శనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్ యు సుసాకిని చిత్తు చేసిన వినేశ్ ఫోగట్.. ఒక్సాన లివాచ్‌ను సైతం మట్టికరిపించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మరోవైపు భారత సూపర్‌స్టార్ నీరజ్ చోప్రా.. సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో జావెలిన్ త్రో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ 11వ రోజు పోటీలు. భారత్‌కు మెడల్స్ ఏమీ రాలేదు. కానీ ఓ రెండు గంటలు వంద కోట్ల భారతీయులు ఉద్విగభరిత క్షణాలను ఆస్వాదించారు.
నవతెలంగాణ-పారిస్
యు సుసాకి (25) జపాన్ రెజ్లింగ్ దిగ్గజం. అంతర్జాతీయ కెరీర్‌లో మంగళవారం వరకు ఓటమి ఎరుగని ఘన చరిత్ర ఆమె సొంతం. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం, నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ కిరీటం ఆమె సొంతం. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రత్యర్థికి కనీసం ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా పసిడి విజయం సాధించిన యు సుసాకి.. పారిస్ ఒలింపిక్స్‌లోనూ పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ప్రీ క్వార్టర్‌ఫైనల్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌తో బౌట్‌లోనూ సుసాకినే ఫేవరేట్. మ్యాచ్‌కు ముందు అంచనాలను తగినట్టుగానే బౌట్ మరో ఏడు క్షణాల్లో ముగుస్తుందనే వరకు సుసాకి ఆధిక్యం నిలుపుకుంది. ప్రథమార్థంలో ఎదురుదాడి చేయలేక, ద్వితీయార్థంలోనూ అదే రీతిలో నిలిచి వినేశ్ ఫోగట్ రెండు పాయింట్లు కోల్పోయింది. జపాన్ రెజ్లర్ గెలుపు ఖాయమైందని అనుకున్న క్షణాల వ్యవధిలోనే వినేశ్ ఫోగట్ బౌట్ గతిని మార్చివేసింది. అప్పటివరకు ఎదురుదాడి చేయకుండా ఓపిగ్గా ఎదురుచూసిన వినేశ్ ఫోగట్.. సుసాకిని తలకిందులుగా చేసి మ్యాట్‌పై పడేసింది. ఏడు క్షణాల పాటు సుసాకిని కదలకుండా అదిమిపట్టేసింది. ఇటు భారత శిబిరం.. అటు జపాన్ శిబిరం సహా ప్రపంచ రెజ్లింగ్ అభిమానులు సైతం ఏమాత్రం ఊహించని ప్రదర్శన వినేశ్ ఫోగట్ చేసింది. యు సుసాకిని చిత్తు చేసి 3-2తో అద్వితీయ విజయం నమోదు చేసింది. మహిళల 50 కేజీల ఫ్ట్రీ స్టయిల్ విభాగం క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. యు సుసాకి ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో ఒక్కో పాయింట్ సాధించింది. వినేశ్ ఫోగట్ బౌట్ ఆఖరు క్షణాల్లో మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. వినేశ్ ఫోగట్ టేక్‌డౌన్‌ను సుసాకి సవాల్ చేసింది. కానీ రిఫరీలు వినేశ్ ఫోగట్‌కు రెండు పాయింట్లకు తోడు అదనంగా మరో పాయింట్‌ను అవార్డు చేశారు. ఇక సుసాకిని వినేశ్ ఫోగట్ టేక్‌డౌన్ చేయటంతో కోచ్ ఆల్కోస్ పారిస్ నుంచి న్యూఢిల్లీకి వినపడేలా కేకలు వేశారు. అద్భుత విజయం అనంతరం కోచ్ ఆల్కోస్‌ను హత్తుకుని వినేశ్ ఫోగట్ ఆనందం పంచుకుంది.
సెమీస్‌లో అడుగు : కీలక క్వార్టర్‌ఫైనల్లోనూ వినేశ్ ఫోగట్ అదరగొట్టింది. ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్‌పై 7-5తో మెరుపు విజయం నమోదు చేసింది. ప్రథమార్థంలో 2-0తో ఆధిక్యంలో నిలిచిన వినేశ్ ఫోగట్‌కు సెకండ్ హాఫ్‌లో ఒక్సానా నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. ద్వితీయార్థంలో వినేశ్ ఫోగట్ 2, 1, 2 చొప్పున పాయింట్లు ఖాతాలో వేసుకోగా.. ఒక్సానా సైతం 2, 1, 1, 1 పాయింట్లతో రేసులోకి వచ్చింది. ఒక్సానా లివాచ్‌పై రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించిన వినేశ్ ఫోగట్ తొలిసారి ఒలింపిక్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో క్యూబా రెజ్లర్ గజ్‌మాన్ లోపేజ్‌తో వినేశ్ ఫోగట్ తలపడనుంది. పాన్ అమెరికా 2023 చాంపియన్ లోపేజ్‌పై విజయం సాధిస్తే.. వినేశ్ ఫోగట్ కనీసం రజత పతకం ఖాయం చేసుకోనుంది. ఈ మ్యాచ్ మంగళవారం అర్థరాత్రి అనంతరం జరుగుతుంది.
ఫైనల్లోకి నీరజ్ చోప్రా : ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత సూపర్‌స్టార్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా పతక రేసు మొదలెట్టాడు. మంగళవారం పురుషుల జావెలిన్ త్రో అర్హత రౌండ్‌లో నీరజ్ చోప్రా బల్లెం అందుకున్నాడు. గ్రూప్-బిలో నిలిచిన నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే బల్లెంను 89.34 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్‌లో నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శన ఇదే. మరో రెండు అవకాశాలను నీరజ్ చోప్రా వినియోగించుకోలేదు. గ్రూప్-ఏలో నిలిచిన కిశోర్ కుమార్ ఝా ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు. తొలి ప్రయత్నంలో 80.73 మీటర్లు, మూడో ప్రయత్నంలో 80.21 మీటర్లు మాత్రమే బల్లెంను విసిరాడు. రెండో ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. పసిడి రేసులో నీరజ్ చోప్రా పోటీదారులు జులియన్ వెబర్ (జర్మనీ) 87.76 మీటర్లు, పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా) 88.63 మీటర్లు, అర్షద్ నదీమ్ (పాకిస్థాన్) 86.59 మీటర్లు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్స్ గురువారం జరుగనుంది.
ఈరోజు వరుసగా రెండు మెగా మ్యాచుల్లో విజయం సాధించిన వినేశ్ ఫోగట్ భారత సింహం. నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్, డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్‌ను, ఆ తర్వాత మాజీ వరల్డ్ చాంపియన్‌ను ఓడించింది. కానీ ఇక్కడ ఓ విషయం చెప్పదలచుకున్నాను. ఈ అమ్మాయి (వినేశ్)ని స్వదేశంలో అణిచివేశారు, హింసించారు. సొంతదేశంలో వీధుల్లోకి తీసుకురాబడింది. ఈ అమ్మాయి ప్రపంచాన్ని జయించబోతుంది కానీ.. మన దేశ వ్యవస్థ ముందు మాత్రం ఆమె ఓడిపోయింది.
– బజరంగ్ పూనియా,
టోక్యో ఒలింపిక్స్ మెడలిస్ట్