– ఛేదనలో కుర్రాళ్లు చతికిల
– 102కే కుప్పకూలిన భారత్
– తొలి టీ20లో జింబాబ్వే గెలుపు
టీ20 ప్రపంచకప్ చాంపియన్ టీమ్ ఇండియాకు దిమ్మతిరిగే షాక్. ప్రతిభావంతులతో కూడిన శుభ్‌మన్ గిల్ సేనపై ఆతిథ్య జింబాబ్వే సంచలనం సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేని పసికూన.. ఏకంగా వరల్డ్ చాంపియన్‌పై మెరుపు విజయంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
116 పరుగుల ఛేదనలో భారత్ చతికిల పడింది. 19.5 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. 13 పరుగుల తేడాతో జింబాబ్వే మెరుపు విజయం నమోదు చేసింది. రవి బిష్ణోరు (4/13) నాలుగు వికెట్ల మాయజాలంతో తొలుత జింబాబ్వే 115 పరుగులకే పరిమితమైంది. గెలుపు లాంఛనమే అనుకున్న తరుణంలో.. జింబాబ్వే బౌలర్లు అద్భుతం చేశారు. ప్రపంచకప్ విజయానందంలో మునిగిన భారత్‌కు ఝలక్ ఇచ్చారు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో జింబాబ్వే 1-0తో ముందంజ వేసింది.
నవతెలంగాణ-హరారే
ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్ చాంపియన్ ఒకవైపు. టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేని జట్టు మరోవైపు. సహజంగానే మ్యాచ్ ఏకపక్షమే అనుకుంటారు. కానీ హరారేలో అంచనాలకు అందని ఫలితం వచ్చింది. భారత్, జింబాబ్వే తొలి టీ20లో ఆతిథ్య జింబాబ్వే అనూహ్య విజయం అందుకుంది. యువ సారథి శుభ్‌మన్ గిల్ జట్టుపై 13 పరుగుల తేడాతో విజయం సాధించారు. 116 పరుగుల ఛేదనలో భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (31, 29 బంతుల్లో 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (27, 34 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించినా.. ఇతర బ్యాటర్లు నిరాశపరిచారు. అభిషేక్ శర్మ (0), రుతురాజ్ గైక్వాడ్ (7), రియాన్ పరాగ్ (2), రింకూ సింగ్ (0) వైఫల్యంతో భారత్ ఓటమి భంగపాటు ఎదుర్కొంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. క్లైవ్ మందాడె (29 నాటౌట్, 25 బంతుల్లో 4 ఫోర్లు), బ్రియాన్ బెనెట్ (22, 15 బంతుల్లో 5 ఫోర్లు), డయాన్ మేయర్స్ (23, 22 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. భారత స్పిన్నర్ రవి బిష్ణోరు (4/13) నాలుగు వికెట్ల మాయజాలంతో మెరిశాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. తొలి టీ20లో విజయంతో టీ20 సిరీస్‌లో జింబాబ్వే 1-0తో ఆధిక్యం సాధించింది. భారత్, జింబాబ్వే రెండో టీ20 హరారేలోనే సోమవారం జరుగనుంది.
పసికూన స్ట్రోక్: భారత్ లక్ష్యం 120 బంతుల్లో 116 పరుగులు. ఐపీఎల్‌లో విశేష అనుభవం కలిగిన కుర్రాళ్లకు ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. కానీ పవర్‌ప్లేలోనే జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మ (0) నాలుగు బంతులు ఆడినా ఒక్క పరుగూ చేయలేదు. రుతురాజ్ గైక్వాడ్ (7), రియాన్ పరాగ్ (2), రింకూ సింగ్ (0)లు క్రీజులో నిలువలేకపోయారు. 4.6 ఓవర్లలో 22/4తో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (31) ఓ ఎండ్‌లో నిలబడటంతో భారత్ రేసులోనే నిలిచింది. కానీ అతడికి లోయర్ ఆర్డర్ నుంచి సైతం సహకారం దక్కలేదు. ధ్రువ్ జురెల్ (6) నిరాశపరిచాడు. ఆల్‌రౌండ్ వాషింగ్టన్ సుందర్ (27), అవేశ్ ఖాన్ (16) ఆఖర్లో విలువైన పరుగులు జోడించినా.. ఫలితం దక్కలేదు. రవి బిష్ణోరు (9), ముకేశ్ కుమార్ (0) తేలిపోయారు. 19.5 ఓవర్లలో 102 పరుగులకే భారత్ ఆలౌటైంది. జింబాబ్వే బౌలర్లలో తెండారు చతార (3/16), సికందర్ రజా (3/25) మూడేసి వికెట్లతో మ్యాజిక్ చేశారు. జింబాబ్వేకు మెరుపు విజయం కట్టబెట్టారు.
బిష్ణోరు మాయ: తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. స్పిన్నర్ రవి బిష్ణోరు నాలుగు వికెట్ల మాయజాలం చేయగా.. వాషింగ్టన్ సుందర్ సైతం మ్యాజిక్‌లో జతకలిశాడు. దీంతో జింబాబ్వే 90 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఆఖరు వికెట్‌కు జోడించిన 25 పరుగులే జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాయి. టాప్ ఆర్డర్‌లో ఓపెనర్ వెస్లీ (21, 22 బంతుల్లో 3 ఫోర్లు), బ్రియాన్ (22) సహా మిడిల్ ఆర్డర్‌లో డయాన్ మేయర్స్ (23) కీలక ఇన్నింగ్స్‌లతో మెరిశారు. కెప్టెన్ సికిందర్ రజా (17) ఓ ఫోర్, సిక్సర్‌తో అలరించాడు. లోయర్ ఆర్డర్‌లో క్లైవ్ (29) రాణించటం జింబాబ్వేకు కలిసొచ్చింది.
స్కోరు వివరాలు :
జింబాబ్వే ఇన్నింగ్స్: వెస్లీ (బి) బిష్ణోరు 21, ఇన్నోసెంట్ (బి) ముకేశ్ 0, బ్రియాన్ (బి) బిష్ణోరు 22, సికందర్ రజా (సి) బిష్ణోరు (బి) అవేశ్ 17, మేయర్స్ (సి,బి) వాషింగ్టన్ 23, కాంప్‌బెల్ (రనౌట్) 0, క్లైవ్ నాటౌట్ 29, వెల్లింగ్టన్ (స్టంప్డ్) జురెల్ (బి) వాషింగ్టన్ 0, ల్యూక్ (ఎల్బీ) బిష్ణోరు 1, బ్లెస్సింగ్ (బి) బిష్ణోరు 0, చతార నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 115.
వికెట్ల పతనం: 1-6, 2-40, 3-51, 4-74, 5-74, 6-89, 7-89, 8-90, 9-90.
బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 3-0-28-0, ముకేశ్ కుమార్ 3-0-16-1, రవి బిష్ణోరు 4-2-13-4, అభిషేక్ శర్మ 2-0-17-0, అవేశ్ ఖాన్ 4-0-29-1, వాషింగ్టన్ సుందర్ 4-0-11-2.
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) మసకద్జ (బి) బెనెట్ 0, శుభ్‌మన్ గిల్ (బి) సికిందర్ రజా 31, రుతురాజ్ గైక్వాడ్ (సి) కైయ (బి) ముజరబాని 7, రియాన్ పరాగ్ (సి) బవుటా (బి) చతార 2, రింకూ సింగ్ (సి) బెనెట్ (బి) చతార 0, ధ్రువ్ జురెల్ (సి) మెదెవెరె (బి) జాంగ్వే 6, వాషింగ్టన్ సుందర్ (సి) ముజరబాని (బి) చతార 27, రవి బిష్ణోరు (ఎల్బీ) సికిందర్ రజా 9, అవేశ్ ఖాన్ (సి) సికందర్ రజా (బి) మసకద్జ 16, ముకేశ్ కుమార్ (బి) సికిందర్ రజా 0, ఖలీల్ అహ్మద్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (19.5 ఓవర్లలో ఆలౌట్) 102.
వికెట్ల పతనం: 1-0, 2-15, 3-22, 4-22, 5-43, 6-47, 7-61, 8-84, 9-86, 10-102.
బౌలింగ్: బ్రియాన్ బెనెటె 1-1-0-1, వెల్లింగ్టన్ మసకద్జ 3-0-15-1, చతార 3.5-1-16-3, బ్లెస్సింగ్ 4-0-17-1, ల్యూక్ 4-0-28-1, సికిందర్ రజా 4-0-25-3.