మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఏకగ్రీవం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే నాటికి నాలుగు నామినేషన్లు దాఖలు కాగా స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కమల నామినేషన్‌ తిరస్కరణకు గురయింది. మిగిలిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు చల్లా వెంకటరామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, కూర్మయ్యగారి నవీన్‌కుమార్‌ల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు నామినేషన్ల గడువు ముగియటంతో ఆ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించినందుకు వెంకటరామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, నవీన్‌కుమార్‌ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.