మోడీ ప్రభుత్వ అప్రకటిత ఎమర్జెన్సీ

మోడీ ప్రభుత్వ
అప్రకటిత ఎమర్జెన్సీ– ఆర్థిక, సామాజిక రాజకీయ విశ్లేషకులు పాపారావు
– ”అలుపెరగని పోరాటం” పుస్తకావిష్కరణ
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌
నాటి ఎమర్జెన్సీ నుంచి నేటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీ వరకు వివిధ అంశాలను ‘అలుపెరుగని పోరాటం’ పుస్తకంలో ప్రముఖ పాత్రికేయుడు, న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ పొందుపరిచారని ఆర్థిక, సామాజిక రాజకీయ విశ్లేషకులు పాపారావు అన్నారు. పుర్కాయస్థ రచించిన ‘అలుపెరగని పోరాటం’ పుస్తకాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. నవతెలంగాణ బుక్‌ హౌస్‌ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. సీపీఐ(ఎం) జూబ్లీహిల్స్‌ జోన్‌ కమిటీ, నవతెలంగాణ బుక్‌ హౌజ్‌ మేనేజర్‌ వాసు, టి.సాయి శేషగిరిరావు, ప్రబీర్‌ పురకాయస్థ సహచరులు అంబేద్కర్‌, సృజన ఆధ్వర్యంలో కామ్రేడ్‌ జితిన్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ మధురానగర్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని పాపారావు ఆవిష్కరించి నాయకులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యూస్‌ క్లిక్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ప్రజా సమస్యలు, కార్మిక సమస్యలు ప్రజలందరికీ తెలియజేసిన గొప్ప వ్యక్తి ప్రబీర్‌ పుర్కాయస్థ అన్నారు. ఈ పుస్తకంలో ప్రజా సమస్యలను పేర్కొన్నారని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐలతో దాడులు చేయించి జైలుకు పంపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులను ఎన్నికల సమయంలో జైల్లో పెట్టడం అంటే వారిని పోటీలో లేకుండా చేసి తాను లబ్దిపొందడానికి యత్నిస్తోందని విమర్శించారు. ఇది ఎమర్జెన్సీ కిందికే వస్తుందని తెలిపారు. న్యూస్‌ క్లిక్‌ యూట్యూబ్‌ ఛానల్‌పై అనేక రకాల దాడులు చేసి జర్నలిస్టుల ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు తీసుకెళ్లారని గుర్తు చేశారు. దేశంలో ప్రస్తుతం మీడియా మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ చేతిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాపర్తి అశోక్‌, సీహెచ్‌.చంద్రశేఖరరావు, జె.స్వామి, జి.బిక్షపతి, జి.హనుమంతురావు, నీలి పాపారావు, సి.శ్రీనివాస్‌, బాలు, రమణ, ప్రసాద్‌, కుమార్‌, పుల్లయ్య పాల్గొన్నారు.