జూన్ 25 ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ ప్రకటన వెలువడిన రోజు. ఈ జూన్ 24వ తేదీన లోక్‌సభ మొదటి రోజు సమావేశంలో.. ”ప్రజాస్వామ్యం వర్సెస్ ఎమర్జెన్సీ” అంటూ నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు గోడీ మీడియాలో ప్రధానంగా వెలువడ్డాయి.భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ నిస్సందేహంగా ఒక చీకటి అధ్యాయం. అయితే దాదాపు ఫాసిస్టు తరహాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్యాంగాన్ని మార్చేందుకు సిద్ధమౌతున్న వ్యక్తి మాటల్లో ధ్వనించే ప్రజా స్వామ్యం అనేది కపటత్వం తప్ప మరొకటి కాదు.దాదాపు అర్ధ శతాబ్దం క్రితం, 1975 జూన్ 25న భారత రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ అధికారికంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. అందుకు కారణం అలహాబాద్ హైకోర్టు తీర్పు. దీని ప్రకారం 1971లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు. అధికార భీతితో ప్రభుత్వం హడావుడిగా రాజ్యాంగంలోని 352వ అధికరణను వర్తింపజేసి అత్యవసర పరిస్థితిని విధించింది. ఇది 1977 మార్చి 21 వరకు కొనసాగింది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి కాలం.
అత్యవసర పరిస్థితి ప్రకటించిన వెంటనే పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వార్తాపత్రికలు, ఆకాశవాణి, దూరదర్శన్ మాత్రం ప్రభుత్వ వైభవాన్ని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. వార్తాపత్రికలు, మ్యాగజైన్ల నుండి తమకు అభ్యంతరకరమైన విషయాలను తొలగించేందుకు బ్యూరో ఆఫ్ ప్రెస్ సెన్సార్‌షిప్ పనిచేసింది. అయినప్పటికీ, కొన్ని వార్తాపత్రికలు, అనేక మంది జర్నలిస్టులు ప్రధానంగా నిజాన్ని పేర్కొనేందుకు ప్రయత్నించారు. ఫలితంగా ఎందరో ఎడిటర్లు, జర్నలిస్టులు అరెస్ట్ కావాల్సి వచ్చింది. పార్లమెంటరీ వ్యవస్థను నిర్లక్ష్యం చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై దాడులు, దేశవ్యాప్తంగా మూకుమ్మడి అరెస్టులు జరిగాయి. సమావేశాలు, ప్రదర్శనలు, ఊరేగింపులు, సమావేశాలు నిషేధించ బడ్డాయి. జ్యోతిబసు, జయ ప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశారు సహా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు జైళ్ల పాలయ్యారు. మీసా (అంతర్గత భద్రతా చట్టం నిర్వహణ) తదితర చట్టాల కింద వేలాదిమంది రాజకీయ కార్యకర్తలు, నాయకులను అరెస్టు చేశారు.అంతేగాక, సామాన్య ప్రజల ప్రాథమిక హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కు, పౌరహక్కులు హరించబడ్డాయి. సాంస్కృతిక ప్రపంచంలో ఆంక్షలు, అరెస్టులు కూడా జరిగాయి. నాటక ప్రదర్శనల నిషేధం, సినిమా ప్రదర్శనల నిలిపివేత జరిగాయి.
ఎమర్జెన్సీ-ఆర్‌ఎస్‌ఎస్
ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. సంఫ్‌ు చీఫ్ బాలా సాహెబ్ దేవరస్ అరెస్టు తర్వాత ఆయన్ను, కార్యకర్తలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇందిరా గాంధీకి పదే పదే లేఖలు రాశారు. ఒక లేఖలో సంఫ్‌ు రాజకీయేతర వైఖరిని నొక్కిచెబుతూ, దేశ సేవ పట్ల తమ నిబద్ధతను తెలియజేశారు. రెండో లేఖలో దేశ అభివృద్ధి, దేశ నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. జైలులో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను విడుదల చేయాలని వేడుకున్నారు. మూడవ లేఖలో దేశ సంక్షేమం కోసం కలిసి పని చేసే మార్గాల గురించి చర్చించడానికి ఇందిరాగాంధీతో ఒక ప్రయివేటు సమావేశాన్ని అభ్యర్థించారు. చివరికి విడుదలకు ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తును నింపి సమర్పించడం ద్వారా వారు విడుదలయ్యారు.
‘ప్రజాస్వామ్యం’ అర్థరహితం
నరేంద్ర మోడీ హయాంలో అన్నిటినీ పీఎంఓ కార్యాలయం కేంద్రంగా మారింది. మోడీ ఎప్పుడూ ప్రజాస్వామ్య బాటలో నడవలేదు. ‘మన్ కీ బాత్’ అంటారు. విలేకరుల సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఎన్నడూ సమాధానం ఇవ్వలేదు. పార్లమెంటులో విపక్షాల చర్చను ఆయన వినలేదు. ఎవరి మాట వినకుండా, పార్లమెంట్‌లో చర్చ లేకుండానే డీమోనిటైజేషన్ చేశారు. కోవిడ్ కాలంలో అహేతుక, అశాస్త్రీయ చర్యలను చేపట్టారు. పి.ఎం కేర్స్ ఫండ్‌ను ప్రయివేట్ ఫండ్‌గా మార్చారు. ఎటువంటి చర్చ లేకుండా ఎలక్టోరల్ బాండ్లని ప్రవేశపెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు క్రమంగా తగ్గించబడ్డాయి. పార్లమెంటులో చర్చకు అవకాశం లేదు. పార్లమెంటరీ వ్యవస్థలో చట్టాలు చేసే హక్కును తీసివేసి ఆర్డినెన్స్ రాజ్‌ని స్థాపించారు. వ్యవసాయ చట్టం, విద్యుత్ చట్టం ఆర్డినెన్స్‌లు చేసి అమలుకు దిగింది. పార్లమెంటులో మెజారిటీ ఉండడంతో బిల్లులను దాదాపు బలవంతంగా ఆమోదించడం ఆనవాయితీగా మారింది.భారత రాజ్యాంగం లక్షణాలలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య నిర్మాణం ప్రధానమైనవి. కానీ మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సారాంశంపైనే క్రమపద్ధతిలో దాడికి దిగింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను ధ్వంసం చేయడం ద్వారా ఇది రాష్ట్రాలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రాల అనుమతి లేకుండానే ఆర్టికల్ 370ని రాజ్యాంగం నుండి ఏకపక్షంగా రద్దు చేసింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అదేవిధంగా జీఎస్టీని ఏకపక్షంగా అమలు చేసింది. ఇవన్నీ రాష్ట్రాల హక్కులను, ఆర్థిక స్వాతంత్య్రాన్ని నాశనం చేశాయి.
స్వతంత్ర సంస్థలన్నిటిని తన అధీనంలో ఉంచుకుంది. ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి, ప్రభుత్వాలను స్వాధీనం చేసుకోవడానికి, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడానికి ఇ.డి, సిబిఐ వంటి కేంద్ర సంస్థలను వినియోగించుతున్నది. సంఫ్‌ు విధేయులను ఈ సంస్థల ప్రధాన అధికారులుగా నియమిస్తున్నది. ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిబిఐ మొదలైన వాటిని ఈ విధంగానే నింపింది. విద్యారంగాన్ని కేంద్రీకరించడానికి, ప్రయివేటీకరించడానికి గాను సిబిఎస్‌ఇ నుండి హిస్టారికల్ రీసెర్చ్ కౌన్సిల్ వరకు అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలల్లోను తమ విధేయులను నియమించడం ద్వారా వాటిని స్వాధీనం చేసుకున్నారు. నేడు అవినీతితో పార్లమెంటు దద్దరిల్లుతోంది. యుజిసి, ఎన్‌టిఎ వంటివి బీజేపీ, సంఫ్‌ుభావజాలం నిండిన అసమర్థుల చేతుల్లోకిపోయాయి. స్కూళ్లు, కాలేజీల్లో ఏం బోధించాలి, పాఠ్యపుస్తకాల్లో ఏం చేర్చాలి, ఏం తీసివేయా లనేది సంఫ్‌ు నిర్ణయిస్తోంది. న్యాయ వ్యవస్థపై నియంత్రణను కొనసాగిం చడానికి చేసిన ప్రయత్నాన్నీ విస్మరించ కూడదు. న్యాయమూర్తుల నియామకం నుంచి న్యాయవ్యవస్థపై ప్రభుత్వం నిరంతరం ఒత్తిడి తెచ్చింది. ఎన్నికల కమిషనర్‌ను నియమించే బాధ్యత నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించి ఎన్నికల కమిషన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది.
ప్రమాదంలో లౌకికవాదం, బహుళత్వం
భారతదేశంలో లౌకికవాద భావజాలాన్ని అనుసరించి మతం, భాష, కులం-గోత్రం, లింగం, సంస్కృతితో సంబంధం లేకుండా చట్టం దృష్టిలో ప్రజలందరూ సమానమే. కానీ, ప్రజలను విభజించే లక్ష్యంతో, మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించేందుకు సవరించిన సిఎఎ ని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అమలు చేసింది. సామాజిక సామరస్యాన్ని, ఐక్యతను ధ్వంసం చేసి సంఫ్‌ు హిందూత్వ భావ జాలాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మైనార్టీలు, దళితులు, గిరిజనులపై దాడులు, చిత్రహింసలు నిత్యకృత్యమవుతున్నాయి. బుల్డోజర్ రాజ్, ఎన్‌కౌంటర్, బీజేపీ ప్రభుత్వం అనేవి నేడు పర్యాయపదాలుగా తయారయ్యాయి. గోసంరక్షణ దళాలు సహా వివిధ హిందుత్వ శక్తులు ఎవరు ఏం తినాలో, ఏం ధరించాలో నిర్ణయించారు. గోసంరక్షణ పేరుతోనో, లవ్ జిహాద్ పేరుతోనో మూకదాడులు జరుగుతున్నాయి.
అసమ్మతి అణిచివేత
కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలను ఆమోదించడంతో చరిత్రాత్మక రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమాన్ని అణిచివేసేందుకు మోడీ ప్రభుత్వం సైన్యం, పోలీసులతో దేశానికి అన్నం పెట్టే రైతాంగం పైనే యుద్ధానికి దిగి వారిని క్రూర హింసలకు గురిచేసింది. ఢిల్లీలోని షాహీన్‌బాగ్, జెఎన్‌యు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సాగిన సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వం, హిందుత్వ శక్తులు ఇలాంటి దాడులు నిర్వహించాయి. భీమా కోరేగావ్ కేసులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్నారు. స్టాన్‌స్వామి జైలు కస్టడీలోనే మరణించారు. శాస్త్రీయ దృక్పధాన్ని అనుసరించిన దబోల్కర్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్‌ను హిందుత్వ శక్తులు హత్య చేశాయి.
అప్రకటిత ఎమర్జెన్సీ
మోడీ హయాంలో ఎమర్జెన్సీ ప్రకటించనప్పటికీ దేశం అప్రకటిత ఎమర్జెన్సీలో ఉంది. ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభమైన మీడియాను నేడు ”గోడీ మీడియా” అని పిలుస్తారు. ఇ.డి, సిబిఐ, ఆదాయపు పన్ను నియంత్రణలపై మొదట్లో విమర్శించిన ప్రధాన స్రవంతి మీడియా గోడీ మీడియాగా మారిపోయింది. స్వతంత్ర జర్నలిస్టులు, పోర్టళ్లు, సోషల్ మీడియాను నియంత్రించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేసింది. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకుగాను న్యూస్ క్లిక్, ది వైర్, ఎన్‌డిటీవీలపై దాడి, మూసివేతే లక్ష్యంగా పెట్టుకుంది. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు సిద్దిక్ కప్పన్, మహ్మద్ జుబేర్, ప్రబీర్ పుర్కాయస్థతో సహా పలువురు జర్నలిస్టులు జైలు పాలయ్యారు.సాంస్కృతిక ప్రపంచంపై కూడా అప్రకటిత ఎమర్జెన్సీ నీడ పడుతోంది. ప్రభుత్వ విధానానికి, మోడీ-షా, వారి హిందుత్వ భావజాలానికి వ్యతిరేక అభిప్రాయం వెల్లడిం చితే చాలు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయన్న సాకుతో, హిందూత్వ, మితవాద శక్తులు దాడి చేసి సినిమాలు, నాటక ప్రదర్శనలను, నృత్య సంగీత కార్యక్రమాలను నిలిపివేస్తాయి. ఢిల్లీ గ్యాంగ్ రేప్‌పై వెలువడిన బిబిసి డాక్యుమెంటరీ మన దేశంలో నిషేధించబడింది. మత ఛాందసవాదం, ఎల్‌జిబిటిక్యుల గురించిన చిత్రం ”అన్-ఫ్రీడమ్” సెన్సార్ బోర్డ్ ద్వారా నిరోధించబడింది. అనేక మంది కళాకారులు, యూట్యూబర్లు, నేహాసింగ్ రాథోడ్ వంటి స్టాండ్-అప్ కమెడియన్లు ప్రతిరోజూ ట్రోలింగ్‌లకు గురవుతున్నారు.చంపేస్తామంటూ వారికి బెదిరింపులు వస్తున్నాయి.అయితే ప్రస్తుత మోడీ 3.0 మునుపటి లాగా ఉండబోదు. ప్రతిపక్షాల సంఖ్య గతంలో కంటే ఎక్కువగానే ఉంది. ప్రజల తీర్పు మోడీకి అనుకూలంగా లేదు. సంకీర్ణ ప్రభుత్వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ దేశాన్ని పాత పద్ధతిలో నడపలేరు. అయినా బీజేపీ అధికారంలో ఉంది కనక ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం సురక్షితం కాదు.అందుకే ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించే పోరాటం మరింత బలపడాలి.
(‘గణశక్తి’ సౌజన్యంతో)
పలాష్ దాస్