– భౌతికదాడులతో ఉద్యమాలను ఆపలేరు
– ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై ఏబీవీపీ గుండాల దాడిని ఖండిస్తున్నాం :ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు ఆర్‌ఎల్ .మూర్తి, నాగరాజు
నవతెలంగాణ- సిటీబ్యూరో/ రంగారెడ్డి ప్రతినిధి/కంఠేశ్వర్
జేఎన్‌టీయూలో ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కార్తీక్‌పై ఏబీవీపీ గుండాలు భౌతిక దాడికి పాల్పడటం హేయమైన చర్య, దాడులతో ఉద్యమాలను ఆపలేరని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, నాగరాజు తెలిపారు. ఈ దాడులను నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఏబీవీపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ఎస్‌ఎఫ్‌ఐ బృందం వెళ్ళి విద్యార్ధులతో మాట్లాడి తిరిగి వస్తున్న క్రమంలో వారిపై ఏబీవీపీ నాయకులు దిలీప్, కొంతమంది ఘర్షణకు దిగారని తెలిపారు. అంతేగాక ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్‌ను బూతులు తిడుతూ ఆయనపై 12 మంది ఏబీవీపీ నాయకులు ఒకేసారి దాడిచేసి గాయపరిచారన్నారు. ఈ చర్యలను ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. కొంతకాలంగా జేఎన్‌టీయూలో ఏబీవీపీ అరాచకాలకు పాల్పడుతోందని తెలిపారు. విద్యార్ధుల సమస్యలు పరిష్కారం కోసం పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐపై ఓర్వలేక దాడులు చేస్తోందన్నారు. గతంలో సంగారెడ్డి, కరీంనగర్, మహాబుబ్‌నగర్ జిల్లాలో దాడులకు పాల్పడ్డారని గుర్తుచేశారు. నిజంగా విద్యార్థులు సమస్యలపై ఏబీవీపీకి చిత్తశుద్ధి ఉంటే పోరాడాలని, భౌతికంగా దాడులు చేస్తే సహించమని హెచ్చరించారు. ఇకనైనా దాడుల సంస్కృతి ఏబీవీపీ మానుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్, రజనీకాంత్, మమత, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య, స్టాలిన్, ప్రశాంత్, సుష్మ, చరణ్ శ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై ఏబీవీసీ దాడికి నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు మస్కు చరణ్ మాట్లాడుతూ.. కార్తిక్‌పై చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ఎస్‌ఎఫ్‌ఐని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక దాడులకు పాల్పడుతుందని తెలిపారు. దాడులకు పాల్పడ్డ వారిపై పోలీసులు ఇప్పటికైనా కేసు నమోదు చేసి, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్ష కార్యదర్శులు వంశీ, మద్దెల శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు సుమంత్, తరంగ్, వేణు నాయకులు తదితరులు పాల్గొన్నారు.