– ఇంకా కొనసాగుతూనే ఉన్న ‘కమలం’ గందరగోళం
– మొన్న 60 మంది ఎమ్మెల్యేలతో బలప్రదర్శన
– ఇప్పుడు ఢిల్లీ దర్బార్ ముందుకు వసురధర
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా.. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. జైపూర్ నుంచి ఢిల్లీ వరకు చర్చోపచర్చలు , సమావేశాలు జరుగుతున్నా సీఎం కుర్చీ రగడ మాత్రం చల్లారటం లేదు. ఎన్నికల ఫలితాలొచ్చి వారం రోజులైనా.. బీజేపీ హైకమాండ్ నాన్చుతూనే ఉన్నది. మరోవైపు వసుంధర రాజే సీఎం పదవి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మిగతా నేతలతో పోలిస్తే ఆమె చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. రాజస్థాన్‌లో బలనిరూపణ తర్వాత వసుంధర ఇప్పుడు ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీలో బీజేపీ హైకమాండ్‌ను కలవవచ్చు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీకి సమయం కావాలని కోరారు.
నిజానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల మాదిరిగానే రాజస్థాన్‌లో కూడా ముఖ్యమంత్రి ముఖం లేకుండానే బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ముఖాన్ని ఎన్నుకోవడం బీజేపీకి అతిపెద్ద సవాలుగా మారింది.. అయితే పాత ముఖాల కన్నా.. కొత్త వారిని తెరపైకి తెచ్చి.. 2024 లోక్‌సభ ఎన్నిక ల్లోకి వెళ్లాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.అయితే స్థాని క తిరుగుబాటును ఆపాలని చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడ బెడిసికొడతాయోనన్న భయం కూడా వెంటాడుతోంది.
రేసులో పలువురు..
రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే ఒక్కరే కాదు. ఎంపీ దియా కుమారి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, బాబా బాలక్‌నాథ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా సీఎం రేసులో ఉన్నారు. దియా కుమారి, బాబా బాలక్‌నాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. దియా కుమారి బుధవారం పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వసుంధర రాజే చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం దాదాపు 60 మంది కొత్త ఎమ్మెల్యేలతో వసుంధర రాజే తన నివాసంలో సమావేశ మయ్యారు. వసుంధర రాజేను సీఎం చేయాలని ఈ ఎమ్మెల్యేలు మీడియా ముందు బాహాటంగానే డిమాండ్ చేశారు. అయితే, ముఖ్యమంత్రి పేరు ను పార్టీ పార్లమెంట రీ బోర్డు నిర్ణయిస్తుం దని, అంతకు ముందు బీజేపీ శాసనసభా పక్ష సమావేశాన్ని పిలుస్తామని బీజేపీ స్పష్టం చేసింది. అయితే ఈ భేటీ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
జైపూర్‌లో వసుంధర రాజే సత్తా చూపుతున్న ప్పటికీ, ఆమె తన క్రియాశీలతను తిరుగుబాటుగా చూడ కూడదనుకుంటున్నారు. అందుకే తాను పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, పార్టీ లైన్ నుంచి ఎప్పటికీ బయటకు వెళ్లబోనని ఆమె బీజేపీ హైకమాండ్‌కు చెప్పిందట. ఇప్పుడు ఆమె జేపీ నడ్డా నుంచి కూడా సమయం కోరారని, తొందరగానే ఇద్దరు నేతలు భేటీ కావచ్చని భావిస్తున్నారు. నడ్డాతో భేటీలో ఎమ్మెల్యేల మద్దతు ను ప్రస్తావిస్తూ సీఎం పదవిపై తన వాదనను వినిపించవచ్చని భావిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఆమె తనకు సీఎం పదవి ఇవ్వాలని హై కమాండ్ ను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు. వసుంధర రాజే రెండుసార్లు రాజ స్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురా లు కూడా.మరి మోడీ, అమిత్‌షా కనుసన్నల్లో జరిగే సీఎంల నియామ కానికి వసుంధర కు లైన్ క్లియర్ చేస్తారా..లేక మరొ కరిని ఎంపిక చేస్తారా.. అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో వ్యక్తమవు తోంది.
రాజస్థాన్‌లో ఉత్కంఠ
ఇప్పటి వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లో సీఎం కావడానికి ఏ నాయకుడి ప్రయత్నం కనిపించటం లేదు. పైకి మాత్రం అంతా హైకమాండ్ నిర్ణయమంటూ..లోలోన మాత్రం సీఎం కుర్చీ దక్కకపోతే తేల్చుకుందామన్న ధోరణి కనిపిస్తోందని వారి సన్నిహితుల్లో పెద్ద చర్చ. మొత్తానికి రాజస్థాన్‌లో ఊహించని సందడి కనిపిస్తోంది. వసుంధర రాజే ఎమ్మెల్యేలను కలవడం ద్వారా మద్దతు కూడగట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. వసుంధర ఇప్పటి వరకు 60 మందికి పైగా ఎమ్మెల్యేలను కలిశారని చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేలు కూడా వసుంధరకు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్‌ను లేవనెత్తుతున్నారు.