
నవతెలంగాణ – కోహెడ
మండలంలోని బస్వాపూర్ గ్రామ అంబేద్కర్ చౌరస్తా సమీపంలో మురికి కాల్వ సరఫరాకు తీసిన కాలువ నెల రోజులు గడుస్తున్న మట్టిని పూడ్చకపోవడంతో గ్రామస్థులు, వాహనచోదకులు ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. మెదక్ నుంచి ఎల్కతూర్తి వరకు గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న జాతీయ రహాదారి పనుల నేపథ్యంలో బస్వాపూర్ గ్రామ అంబేద్కర్ చౌరస్తా ప్రధాన రోడ్డు పక్కన కాలువ తీసి వదిలేశారు. రోడ్డుకు ఇరువైపుల మురికి కాల్వల నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని పలువురు అసహానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ నెల 29న అమావాస్య రోజున సింగరాయ జాతర జరగనుంది. ఈ ఒక్కరోజు జాతరకు లక్షలాదిగా భక్తులు ఇదే మార్గం గుండా జాతరకు వెళ్తుంటారు. జాతర సమయం దగ్గరపడుతుండడంతో ప్రమాదం జరిగితెనే పట్టించుకుంటారా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మట్టిని పూడ్చి పనులు త్వరగా పూర్తి చేయాలని గ్రామస్థులు, మండల ప్రజలు కోరుకుంటున్నారు.