– వర్షాలు, వరదల నిర్వాసితులను ఆదుకోవాలి..
– ప్రజారోగ్యాన్ని కాపాడాలి..
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
బ్యాంక్ లో వ్యవసాయ అప్పు ఉన్న ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు, అధికారం లోకి రాగానే ఋణాలు మాఫీ చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఇపుడేమో రైతు ఋణ మాఫీ కి రేషన్ కార్డ్, ధరణి ప్రామాణికం అంటు తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా బేషరతుగా వ్యవసాయ ఋణం పొందిన ప్రతీ రైతు అప్పును తీర్చాల్సిన దే నని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సీపీఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో మండల కమిటీ సభ్యుడు గడ్డం సత్యనారాయణ అద్యక్షతన,స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి కనకయ్య ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వానలు,వరదలు తో నిర్వాసితులు అయిన ప్రతీ ఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రాజెక్ట్ వరదల ముంపు నిర్వాసితులకు కు వెంటనే పునరావాసం కల్పించాలని అన్నారు.వరదలు,వానలు తో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నందున ప్రజారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండి వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. రైతు బరోసా అమలు జేసి రైతులకు విత్తనాలు,ఎరువులు రాయితీ పై ఇచ్చి సాగుకు సన్నద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య,జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ రావు,మండల కన్వీనర్ బి.చిరంజీవి, ముళ్ళగిరి గంగరాజు,మడకం గోవిందు,సోడెం ప్రసాద్,మడిపల్లి వెంకటేశ్వరరావు,తగరం నిర్మల ,తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.