– ప్రయివేటు రంగంలో 75శాతం కోటా రిజర్వేషన్ బిల్లును కొట్టేసిన హర్యానా హైకోర్టు
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగంలోని ఉద్యోగాల్లో 75శాతం ఉద్యోగాలను రాష్ట్ర ప్రజలకు మాత్రమే కేటాయించాలని కోరుతున్న హర్యానా చట్టాన్ని పంజాబ్ – హర్యానా హైకోర్టు కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించే అవకాశం వుంది. హర్యానా రాష్ట్ర స్థానిక ఉపాధి బిల్లును 2020లో ఆమోదించిన తర్వాత అనేక మార్పులకు లోనయింది. ప్రయివేటు రంగంలో నెలకు రూ.30 వేల కన్నా తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగాల్లో 75శాతాన్ని డొమిసైల్ సర్టిఫికెట్ కలిగిన, రాష్ట్రానికి చెందినవారికే రిజర్వ్ చేయాలని ఆ బిల్లు పేర్కొంటోంది. రాష్ట్రంలో 15 ఏండ్లు నివసించి వుండాలన్న షరతును ఐదేండ్లకు తగ్గించారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఏడాది కూడా గడువు లేదు. ఈ నేపథ్యంలో తాజా చర్య మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. స్థానికుల ఓట్లను, ముఖ్యంగా జాట్‌ల ఓట్లను సంఘటితపరుచుకోవాలన్న లక్ష్యంతో ఈ బిల్లును ప్రభుత్వం తీసుకు వచ్చింది.