కాంగ్రెస్‌ పాలనలో రైతాంగానికి తీవ్ర మోసం

– మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర రైతాంగం అడుగడుగునా మోసపోతోందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు, రుణమాఫీ, ధాన్యానికి బోనస్‌ తదితరాంశాలన్నింటిలో రేవంత్‌ సర్కార్‌ అన్నదాతలకు మొండి చెయ్యే చూపుతోందని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో 44.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగైందని అధికారిక వర్గాలు అంచనా వేశాయని తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 322 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. ఆచరణలో ఇప్పటి వరకూ ఒక్క రైతు దగ్గరా పత్తి కొనుగోలు చేసిన దాఖలాల్లేవని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకారం పత్తికి క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్‌ కలిపి రూ.8,021 ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వల్ల రైతులు ప్రయివేటు వ్యాపారస్తులకు రూ.5 వేలకే అమ్ముకునే దుస్థితి తలెత్తిందని హరీశ్‌ ఈ సందర్భంగా వాపోయారు. మరోవైపు అకాల వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఎకరానికి నాలుగు క్వింటాళ్ల పత్తి కూడా పండలేదని వివరించారు. గోరు చుట్ట మీద రోకటి పోటులా దిగుబడి తగ్గటంతోపాటు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావటం వల్ల పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ సర్కార్‌ వైఫల్యం వల్లే ఇలాంటి దుస్థితి తలెత్తిందని విమర్శించారు.
విద్యార్థుల ప్రాణాలతో సర్కారు చెలగాటం
మెదక్‌ జిల్లా హవేలి ఘనపూర్‌ గురుకులంలో నలుగురు విద్యార్థినులు కరెంట్‌ షాక్‌ తగిలి గాయాలపాలవటం పట్ల హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో గురుకులాల్లో పాము కాట్లు, కుక్క, ఎలుక కాట్లు, ఫుడ్‌ పాయిజన్‌ కేసులు సర్వసాధారణమయ్యాయని పేర్కొన్నారు.