పెట్టుబడుల లోగుట్టు…

Under investment...పన్నెండు రోజుల విదేశీ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ నేతృత్వంలోని బృందం బుధవారం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, ఉన్నతాధికారులు ఆ టీమ్‌కు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు, తద్వారా ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన సీఎం పర్యటన జయప్రదంగా ముగియటం హర్షణీయం. అయితే లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టు పెట్టుబడులను ఆకర్షించేందుకోసమంటూ విదేశాలు పట్టుకు తిరుగుతున్న మన పాలకుల ఆర్భాట ప్రచారాలు, ప్రకటనలు వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా, తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్‌, రేవంత్‌ల పరిస్థితి అయినా ఇదే. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం లోని బృందం అమెరికాకు పయనమైంది. ఎనిమిది రోజులపాటు అక్కడ పర్యటించిన ఆయన టీమ్‌, ఆ తర్వాత దక్షిణ కొరియాకు కూడా వెళ్లింది. మొత్తం మీద ఆ రెండు దేశాల్లో 50కి పైగా భేటీలు, మూడు రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ పర్యటనల ద్వారా రూ.31,532 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించామని ప్రభుత్వం వెల్లడించింది. 19 కంపెనీలతో చేసుకున్న వివిధ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 30,750 కొత్తఉద్యోగాలు లభించ నున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ప్రకటించింది. ఇవిగాక గత జనవరిలో దావోస్‌లో పర్యటించిన సీఎం…రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయంటూ ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి జులై వరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల విలువ మరో రూ.9,800 కోట్లంటూ పరిశ్రమల శాఖ లెక్కలేసింది.
ఇందుకు సంబంధించి మనం కొద్దిగా వెనక్కెళ్లి గతంలోకి తొంగిచూస్తే పాలకుల ప్రచారార్భాటాల్లోని డొల్లతనాన్ని అర్థం చేసుకోవచ్చు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తొలిసారి సీఎం అయ్యాక 2015లో చైనాలో పది రోజులపాటు పర్యటించారు. సెల్‌కాన్‌, మకనో, షాంఘై ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌, లియో గ్రూప్‌ తదితర కంపెనీలతో ఆయన పలు ఒప్పందాలు చేసుకున్నారు. తద్వారా రూ.1,160 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయంటూ ఊదర గొట్టారు. కానీ వీటిలో ఒక్క సెల్‌కాన్‌ సంస్థ తప్ప మరే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోవటం గమ నార్హం. అది కూడా కేవలం రూ.160 కోట్ల విలువైన యూనిట్‌ మాత్రమే నెలకొల్పటం కొసమెరుపు. అదే బీఆర్‌ఎస్‌ హయాంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్‌… దావోస్‌లో 2022లో నిర్వహించిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొని, రూ.4,200 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించినట్టు ప్రకటించారు. రూ.322 కోట్లతో హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో తెలంగాణ మొబిలిటీ వ్యాలీని జర్మనీకి చెందిన జడ్‌.ఎఫ్‌. అనే కంపెనీ స్థాపించబోతోందని ఆయన అప్పట్లో వెల్లడించారు. ఇలాంటి ఒప్పందాలు, ఉద్యోగాల కల్పనలన్నీ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో సఫలీకృతం కాలేదన్నది అనుభవంలో తేలిన విషయం.
చంద్రబాబు హయాంలోనూ వివిధ విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ అవన్నీ మన నిరుద్యోగ యువతకు పూర్తి స్థాయిలో కొలువులు కల్పించలేకపోయాయి. ఐటీరంగం ద్వారా ఏటా దాదాపు పది వేల ఉద్యోగాలను సృష్టిస్తామంటూ అప్పట్లో ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆచరణలో అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దేశంలోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అనేది పాలకుల తారకమంత్రం. పెట్టుబడికి ఆంక్షలులేని స్వేచ్ఛనిచ్చిన తర్వాత, మోడీసర్కార్‌ చట్టాలన్నింటినీ మార్చిపారేస్తున్న నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగుల బతుకులు బాగుపడేదేముంది?
ఇక్కడో విషయాన్ని మనం గమనించాలి. దేశంలోగానీ, మన రాష్ట్రంలోగానీ ఇప్పటికీ 60 నుంచి 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఆ రంగంలో యాంత్రీకరణ పెరగటంతో ఉపాధి అవకాశాలు నానాటికీ సన్నగిల్లుతున్నాయి. ఫలితంగా ప్రజలు పనుల కోసం ఊళ్లొదిలిపెట్టాల్సిన దుస్థితి. ఈ క్రమంలో ఒక రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఈ వలసలు పెరిగిపోతున్నాయి. అంతిమంగా ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది. కరోనాలాంటి విపత్కర సమయాల్లో సైతం అనేక రంగాల్లో ఉద్యోగులను గాలికొదిలేస్తే, వారిని ఆదుకున్నది, అక్కున చేర్చుకున్నది వ్యవసాయరంగమే. అందువల్ల ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించటంతోపాటు ‘సాగు’ను బహు’బాగు’ చేయటం ద్వారా ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.