– పిల్లలు కుటుంబాలతో సహా వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్న మహిళ ఉపాధ్యాయినీలు
నవతెలంగాణ – కంటేశ్వర్
గత ప్రభుత్వం తీసుకొచ్చిన అశాస్త్రీయ విధానాల వలన ఉద్యోగస్తులైన భార్య, భర్తలు వివిధ జిల్లాలకు విసిరివేయబడ్డారు. మెమో నెంబర్ 1655 ప్రకారం భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేయాల్సి ఉన్న 19 జిల్లాలో స్పౌజ్ బదిలీలు జరిపి 13 జిల్లాలను బ్లాక్లో ఉంచడం జరిగింది. ఈ 13 జిల్లాలలో భర్త ఒక జిల్లాలో, భార్య మరోజిల్లా లో, పిల్లలు ఒకదగ్గర, వృద్ధులైన తల్లిదండ్రులు ఇంకొక దగ్గర, దీని మూలంగా కుటుంబ వ్యవస్థచిన్నా భిన్నమైంది. రెండు సంవత్సరాల నుంచి ధర్నాలు ర్యాలీ లు పిల్లలతో సహా రోడ్డెక్కిన కూడా గత ప్రభుత్వం కనికరించలేదని,ఈ సమస్యలో ముఖ్యంగా మహిళలే 85% ఇబ్బందికి గురి అవుతున్నారు. రోజు వందల కిలోమీటర్ల ప్రయాణాలు చేయలేక, పనిచేసే చోట కుటుంబాలను విడిచి ఉండలేక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. 2023 జనవరిలో అప్పటి ప్రభుత్వం కేవలం 615 స్పౌజ్ బదిలీలను మాత్రమే జరిపిందని ఇంకా 1500 స్పౌజ్ బదిలీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తమ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరగా స్పౌజ్ బదిలీలు జరిపించాలని బాధితులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్రవంతి,అనూష, నరేష్, అభిమన్యు తదితరులు పాల్గొన్నారు.