పోస్టుల పెంపు కోసం నిరుద్యోగుల ర్యాలీ..

– జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ 
– లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : గ్రూప్ 2 ,   గ్రూప్ 3, డీఎస్సీ ల లొ పోస్టుల పెంపుకై 400 మందికి పైగా  నిరుద్యోగులు శనివారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం నుండి క్లాక్ టవర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇదే పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి  25 వేల తో మెగా డీఎస్సీ, 2 వేల పోస్టులతో గ్రూప్ 2,  3000 పోస్టులతో గ్రూప్ 3 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు విస్మరించాలని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సంవత్సరం లోపల ఉద్యోగాలు నింపి నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తామని దొంగ హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం నిరుద్యోగులను గాలి కోదిలేసిందని, ప్రస్తుతం మా ఆవేదన పట్టించుకునే నాయకుడు ఒకరు లేరని ఆవేదన చెందారు.  గతంలో తామంతా కలిసి  గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, ప్రజా పాలన వస్తుందని నమ్మి  వేలాది మంది నిరుద్యోగులు ప్రస్తుత ప్రభుత్వానికి ఓట్లు వేశారని అన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్  ప్రకటించకపోతే లక్షలాది నిరుద్యోగులు టీజీపీఎస్సి భవన్,  అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెడి కిరణ్, కృష్ణ, మైనం యుగంధర్,  చిమట వెంకట్, జోగు నగేష్, శ్రీవిద్య, సిరి, రాధా, అనుష, నవ్య, ప్రియాంక, కొండల్, శివాజీ, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు పాల్గొన్నారు.