నిరుద్యోగ జాతర

నిరుద్యోగ జాతర– ఖమ్మంలో మెగా జాబ్‌మేళాకు పోటెత్తిన యువత
– సున్నా నుంచి పీజీ వరకు అర్హతతో నిర్వహణ
– 5వేల ఉద్యోగాలకు 11,530 మంది రిజిస్ట్రేషన్‌
– రూ.10వేల నుంచి రూ.50వేల వేతనంతో నియామకం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో శనివారం నిరుద్యోగ జాతర జరిగింది. తెలంగాణ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్‌ సొసైటీ ఫర్‌ ట్రెనింగ్‌ అండ్‌ ఎంప్లారుమెంట్‌ ప్రమోషన్‌ (టీఎస్‌- స్టెప్‌) సౌజన్యంతో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు భారీగా అభ్యర్థులు తరలి వచ్చారు. 65కు పైగా కంపెనీలు 5,000 ఉద్యోగాల కోసం నిర్వహించిన ఈ మేళా కోసం 11,530 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అధికారి తుంబూరు సునీల్‌ కుమార్‌, జిల్లా ఉపాధి కల్పన అధికారికొండపల్లి శ్రీరామ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్‌ మేళాను జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి మొదలైన మెగా జాబ్‌మేళా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సున్నా నుంచి పీజీ వరకు విద్యార్హతలున్న 18-35 ఏళ్ల యువతీ యువకులను ఈ మేళాకు ఆహ్వానించారు.
కిటకిటలాడిన మేళా ప్రాంగణం..
నిరుద్యోగ యువత భారీగా తరలిరావడంతో మేళా ప్రాంగణం కిటకిటలాడింది. ఎటుచూసినా అభ్యర్థుల హడావుడే కనిపించింది. రెస్యూమ్‌లు, ఇతరత్ర సర్టిఫికెట్ల జిరాక్స్‌ల కోసం సంబంధిత సెంటర్లకు అభ్యర్థులు పోటెత్తారు. ఒక్కొక్కరు ఐదారు జాబ్‌లకు అప్లై చేశారు. ఖమ్మం లోకల్‌లో సుమారు 500 ఉద్యోగావకాశాలు కల్పించారు. రూ.10వేల నుంచి రూ.80వేల వేతనం ఉన్న ఈ జాబ్‌ల కోసం నిరుద్యోగులు పోటీ పడ్డారు. 40వేలకు పైన శాలరీ ఉన్న సుమారు 500 జాబ్‌లకు, రూ.25వేల నుంచి రూ.45 వేల మధ్యలో మూడు వేల ఉద్యోగాలకు ఈ మేళాలో అవకాశం కల్పించారు. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, రిటైల్‌, ఫార్మసీ, బ్యాంకింగ్‌ సెక్టార్లలో ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులందరూ ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.
అనంతరం తమ రిస్యూమ్‌లతో కంపెనీల స్టాల్స్‌ వద్దకు వెళ్లారు. ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌లు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కాగా, వివిధ కంపెనీలకు 1122 మంది యువత ఎంపికయ్యారు. 2,698 మంది షార్ట్‌లిస్టెడ్‌ అయినట్లు టీఎస్‌ స్టెప్‌ మేనేజర్‌ జగన్నాథ్‌ తెలిపారు. అభ్యర్థులకు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి జాబ్స్‌, ట్రెనింగ్‌కు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఖమ్మం, హైదరాబాద్‌, విజయవాడ, వరంగల్‌, తెలంగాణలోని వివిధ జిల్లాల కేంద్రాలు, పట్టణాలు, ప్రాంతాలు, పాన్‌ ఇండియా వ్యాప్తంగానూ ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. కలెక్టర్‌ వెంట సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ కె.సత్యనారాయణ ఉన్నారు.