ఈ మధ్య ప్రధాని మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు ఈ పర్యటన తలపెట్టారన్నది ఒక నిగూఢ రహస్యమే. రష్యా నుండి ఎవరూ చమురు కొనుగోలు చేయరా దంటూ సామ్రాజ్యవాద దేశాలు విధించిన ఆంక్షల ను పక్కన పెట్టి భారతదేశం ఇంతవరకూ రష్యా నుండి ముడి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తోంది. ఈ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేయవద్దని, సామ్రాజ్యవాద దేశాల ఆంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని మోడీని కోరారు.
ఇలా మన ప్రధానిని కోరుతున్న వ్యక్తి ఎటువంటివాడు? రెండో ప్రపంచ యుద్ధంలో (అప్పుడు ఉక్రెయిన్ సోవియట్ రష్యాలో అంతర్భాగం) నాజీ జర్మనీకి ఏజెంటుగా వ్యవహరించి స్వంత దేశానికే ద్రోహం తలపెట్టిన స్టెపాన్ బండెరా వంటి పరమ నీచుల మద్దతుతో ఉక్రెయిన్‌ను అతగాడు పాలిస్తున్నాడు. పోనీ, ఆ సంగతి పక్కన పెడదాం. బుష్ హయాంలో గోర్బచేవ్‌తో కుదిరిన అంగీకారం ప్రకారం నాటో తూర్పు వైపుగా, అంటే రష్యా వైపుగా విస్తరించ కూడదు. అదే మాదిరిగా ఉక్రెయిన్ విడిపోయినప్పుడు రష్యా-ఉక్రెయిన్ దేశాల నడుమ మిన్స్క్ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఏకపక్షంగా ఉల్లంఘిం చింది. బ్రిటన్, అమెరికా దేశాలు ఉక్రెయిన్‌లో తమ కీలు బొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ద్వారా ఈ ఉల్లంఘన జరిగేట్టు చేశాయి. ఆ ఒప్పందానికే గనుక ఉక్రెయిన్ కట్టుబడి వుంటే ఈ యుద్ధమే జరిగేది కాదు. పోనీ, ఆ విషయాన్నీ పక్కన పెడదాం. భారతదేశం తన స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోంది. తద్వారా మన దేశం సామ్రాజ్య వాదులు విధించిన ఆంక్షలను పక్కన పెట్టినట్టయింది. దీనినీ పక్కన పెడదాం. అసలు ఈ ”ఏకపక్ష” ఆంక్షలకు ఉన్న నైతికత ఏమిటో చర్చిద్దాం.
పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు తమ ఆదేశాలను ఖాతరు చేయని దేశాలపై విధించే ఆంక్షలనే మనం ఇక్కడ ఏకపక్ష ఆంక్షలు అంటున్నాం. వీటికి ఐక్య రాజ్య సమితి ఆమోదం ఎంత మాత్రమూ లేదు. అన్ని దేశాలకూ ఉమ్మడి వేదికగా ఉన్న ఐరాస ఆమోదంతో ఎప్పుడైనా, ఏ దేశం మీదనైనా ఆంక్షలు విధిస్తే వాటి సంగతి వేరు. అప్పుడు ప్రపంచ ప్రయోజనాలు మొత్తంగా పరిగణన లోకి తీసుకునే వీలుంటుంది. కాని ఈ ఏకపక్ష ఆంక్షలు వేరు. సామ్రాజ్యవాద దేశాల ఆదేశాలను వ్యతిరేకించి నందుకు క్యూబా నుంచి వెనిజులా వరకు, సిరియా నుండి లిబియా వరకు పలు దేశాలు ఈ విధమైన ఏకపక్ష ఆంక్షలకు లోను కావలసి వచ్చింది. ఈ ఏకపక్ష ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం అంటే మన దేశం కూడా సామ్రాజ్యవాద దేశాల దూకుడుకు, దానిలో భాగంగా అమలు చేసే కుట్రలకు ఆమోదం వేసినట్టే అవుతుంది.
ఈ ఏకపక్ష ఆంక్షలకుండే ప్రత్యేక లక్షణం: అవి ప్రజలను దెబ్బ తీస్తాయి. నిజంగానే ఈ తరహా ఆంక్షలు ప్రజలను దెబ్బ తీయడానికే ఉద్దేశించ బడినటు వంటివి. ఎంత బలంగా అవి ప్రజలను దెబ్బ తీస్తాయో అంతబాగా ఈ ఆంక్షలు అమలు జరిగినట్టు లెక్క. యుద్ధ సమయంలో సాధారణ పౌరులమీద బాంబుదాడులు చేయకూడదు. కాని కొన్ని సార్లు బాంబు దాడులు జరుగు తూంటాయి (ప్రస్తు తం గాజాలో మాది రిగా). అప్పుడు సాధారణ ప్రజానీ కాన్ని మూకుమ్మడిగా శిక్షించడానికి పూనుకున్నట్టే లెక్క. అదే మాదిరిగా ఈ ఆంక్షలు కూడా సామాన్య ప్రజలను, వారు చేసిన నేరం ఏమీ లేకపోయినా, శిక్షిస్తాయి. నాల్గవ జెనీవా సదస్సు తీర్మానం లోని 33వ అధికరణం ప్రకారం ఆవిధంగా చేయడం యుద్ధ నేరంగా పరిగణించబడుతుంది. అదే మోతాదు ప్రభావాన్ని ప్రజల మీద కలిగించే ఆంక్షలు కూడా యుద్ధ నేరంతో సమానమే. ఇప్పుడు జెలెన్‌స్కీ ఆ నేరాన్నే చేయమని మన దేశాన్ని మోడీ ద్వారా అడుగు తున్నాడు! ఈ ఆంక్షలు రష్యా దేశ ప్రజలను ఎంతవరకూ దెబ్బ తీశాయన్నది ఇక్కడ అప్రస్తుతం. ఆంక్షల వెనుక లక్ష్యమే ఇక్కడ ప్రధానం. ఆ లక్ష్యం యుద్ధ నేరానికి పాల్పడిన దానితో సమానం.
ఆ దేశం తప్పు చేసింది కాబట్టే మేం ఆంక్షలు విధించాం అంటున్నది సామ్రాజ్యవాదం. తమ చర్యను ఈ విధంగా సమర్ధిం చుకోవడం వెనుక న్యాయబద్ధత ఏమీ లేదు. ఆంక్షలకు గురైన దేశంలోని ప్రభుత్వం ఆ దేశపు ప్రజానీకపు మద్దతుతో నడిచేదే ఐతే, అప్పుడు ఈ ఆంక్షలు ఒక ప్రజామోదం పొందిన ప్రభుత్వపు సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీసినట్టు అవుతుంది. వారిని సమిష్టిగా శిక్షించినట్టు అవుతుంది. అందుచేత ఇది సామాన్య పౌరులను బాంబు దాడులతో మూకుమ్మడిగా చంపడం వంటి యుద్ధ నేరంతో సమానమే.
నిజానికి ఈ ఆంక్షల ప్రభావం పౌరుల మీద జరిపే బాంబు దాడులు కలిగించే ప్రభావం కన్నా ఎక్కువ. బాంబు దాడులు ఎటువంటి మిలిటరీ లక్ష్యమూ లేకుండా, సామాన్య పౌరుల మీద జరుగుతాయి. అయితే వాటి ప్రభావం ఆ దాడులు జరిగిన ప్రాంతం మీదనే పడుతుంది. కాని ఆంక్షల ప్రభావం ఒక దేశ ప్రజానీకం మొత్తం మీద పడుతుంది. బాంబు దాడుల నుండి తప్పించుకోడానికి వేరే ప్రదేశానికి తరలిపోవచ్చు. కాని ఆ దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికి తరలిపో యినా, ఆంక్షల నుండి తప్పించుకోలేం. రెండవది: బాంబు దాడులు కొద్ది పరిమిత కాలం పాటే సాగుతాయి. కాని ఈ ఆంక్షలు అలా నిరవధికంగా కొనసాగుతూనే వుంటాయి. క్యూబానే తీసుకోండి. ఆ దేశం మీద ఆంక్షలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇరాన్ మీద కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. మూడవది: బాంబు దాడులవలన సంభవించే మరణాల కన్నా ఆంక్షల వలన మరణించేవారు ఎక్కువగా ఉంటారు. ఆంక్షలకు గురయ్యే దేశాల ప్రజానీకానికి ఆహారం, ఔషధాలు సరఫరా జరగకు ండా నిషేధించినందు వలన జరిగే మరణాలు చాలా ఎక్కువ. ఇప్పటి దాకా ఆంక్షలకు గురైన దేశాలన్నీ దాదాపుగా ఆహార కొరతను, ఔషధాల కొరతను చవిచూశా యి. నాలుగవది: ఈ కారణం గానే ఆంక్షలు ప్రత్యేకించి వృద్ధుల మీద, చిన్న పిల్లల మీద, గర్భవతుల మీద ఎక్కువ హానికర ప్రభావాన్ని చూపిస్తాయి. మామూలుగా యుద్ధ సమయాల్లో ఈ తరగతుల ప్రజానీకాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు. కాని ఈ ఆంక్షలు వారినే ముఖ్య లక్ష్యంగా చేసుకుంటాయి.
ఈ విధంగా ఆంక్షలకు గురయ్యే దేశాలలో ఆ ఆంక్షలను తట్టుకుని నిలబడి తమ ప్రజానీకానికి కావలసిన ఆహారాన్ని, ఔషధాలను, ఇతర అవసరాలను అందించడానికి పూనుకునే సత్తా ఉన్నవి కొన్ని ఉండవచ్చు. కాని వాటిని వేరే ఇతర మార్గాల్లో సేకరించవలసి వస్తుంది. అప్పుడు దాని ఫలితంగా ఆ దేశాలలో ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఆ ఆహారం గాని, ఔషధాలు గాని చాలా మందికి అందుబాటులో లేకుండా పోతాయి. ఈ విధంగా ధరలు పెరగడానికి రెండు కారణాలు ఉంటాయి. మొదటిది: ప్రజలందరి అవసరాలనూ తీర్చగలిగేం తగా ఆ అత్యవసర సరుకులను అందించడం ఆంక్షల నేపథ్యంలో సాధ్యపడదు. అందుచేత వాటికి కొరత ఏర్పడి, ధరలు పెరుగుతాయి. రెండవది: ఆంక్షల ఫలితంగా ఆ దేశపు కరెన్సీ మారకపు రేటు పడిపోతుంది. అప్పుడు దిగుమతులకు చెల్లించే విదేశీ మారకపు ద్రవ్యం విలువ పెరుగుతుంది. దాని ఫలితంగా ధరలు పెరుగుతాయి. పైగా, ఆ దేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక దాదాపు నిలిచిపోతుంది. దానివలన కూడా విదేశీ మారకపు ద్రవ్యంలోటు పెరుగుతుంది. పైగా ఆ దేశపు విదేశీ మారకపు నిల్వ లు ఏదైనా విదేశీ బ్యాంకుల్లో దాచివుంటే ఆ బ్యాంకులు ఈ ఆంక్షల కారణంగా ఆ ఖాతాలను స్తంభిం పజేస్తాయి. అందుచేత కొన్ని మిత్ర దేశాలు తోడుగా నిలిచినప్పటికీ, ఆంక్షలు ఆ దేశఆర్థిక వ్యవస్థ ను, ముఖ్యంగా సామాన్య ప్రజానీకాన్ని దారుణంగా దెబ్బ తీస్తాయి.
దీన్నిబట్టి ఆంక్షలు విధించడం అంటే అది ప్రచ్ఛన్న యుద్ధం సాగించడమే. అంతే కాదు, ప్రత్యక్ష యుద్ధం కన్నా ఎక్కువ ప్రమాదకరం. కాని పైకి అలా కనపడదు. ఆంక్షల ఫలితంగా ఆస్పత్రులలో అవసరమైన ఔషధాలు లభించక మరణించేవారి సంఖ్య పెరిగిపోతుంది. సరైన తిండి లేక మరణించేవారి సంఖ్య పెరుగుతుంది. లేదా, జబ్బుల పాలయేవారి సంఖ్య పెరిగిపో తుంది. కాని ఈ ప్రభావం యుద్ధంలో బాంబు దాడుల వలన మరణాలు సంభవించినట్టుగా కొట్టొచ్చినట్టు కనిపించదు. ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు రష్యాలో నెలకొన్నాయని చెప్పలేం. రష్యా ఈ ఆంక్షలను తట్టుకోగలుగుతోంది. సోవియట్ యూనియన్ కాలం నుండీ అందివచ్చిన వారసత్వంగా రష్యాకు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థఉంది. నిజానికి సామ్రాజ్యవాద దేశాలు ఒక అభివృద్ధి చెందిన దేశం మీద ఆంక్షలు విధించినది తొలిసారిగా రష్యా పైనే. బలహీనంగా ఉండే మూడవ ప్రపంచదేశాల కన్నా రష్యా ఈ ఆంక్షలను తట్టు కోగలుగుతోంది. పైగా ఏకకాలంలో పలు దేశామీద ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీని వలన ఆ ఆంక్షల ప్రభావం పలుచనైపోతోంది.
అయితే, ఈ కారణాల రీత్యా ఆంక్షలను తక్కువ చేసి చూడనక్కరలేదు. ఈ ఆంక్షలు మూడవ ప్రపంచ దేశాల ప్రజల మీద ప్రయోగించడానికి సామ్రాజ్యవాదులు సిద్ధం చేసివుంచు కున్న ఒక అత్యంత ప్రమాదకర ఆయుధం. ఈ విధంగా ఏకపక్షంగా ఆంక్షలను విధించడాన్ని ఐరాస నిషేధించాల్సిందే. ఐతే, అటువంటి నిషేధాలేవీ ఐరాస భద్రతా మండలి ఆమోదం లేకుండా అమలు లోకి రావన్నది తెలిసినదే. ఐనప్పటికీ, ఐరాస ఆంక్షలను నిషేధించడం అనేది ఒక నైతిక బలాన్ని బాధిత దేశాలకు సమకూరుస్తుంది. భారత దేశాన్ని రష్యా మీద జరిగే ఆర్థిక యుద్ధంలో చురుకైన భాగస్వామిగా మార్చాలన్నదే జెలెన్‌స్కీ ప్రతిపాదన సారాంశం. ఇది యుద్ధ నేరానికి తోడ్పడటం కన్నా తక్కువేమీ కాదు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్