77 సంవత్సరాల స్వాతం త్య్రం, 75 వసంతాల గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఇంకా భారతదేశం అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, ఆహార భద్రత, విద్యా,వైద్యం అంశాల్లో అన్ని సూచికలు మన దేశ వెనుకబాటుతనాన్ని బయటపెడుతున్నవి ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు, ఆవశ్యకత, ఆర్థిక, సామాజిక అంశాల ప్రభావంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. 1991లో ప్రపంచీకరణ విధానాలు దేశంలో ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల జీవనస్థితిగతులు పడిపోయాయన్నది వాస్తవం. మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండేండ్లలో ఈ విధానాలు మరింత వేగంగా అమలవుతున్నది కూడా అంతే నిజం. బుల్లెట్ ట్రెయిన్ ఇండియాలో ప్రవేశపెట్టకపోయినా కార్పొరేట్ అనుకూల విధానాలు మాత్రం బుల్లెట్ ట్రెయిన్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నవి. ఫలితంగా అసమానతలు విపరీతంగా పెరుగుతున్నవి. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన దాని ప్రకారం ప్రపంచ సంపన్నులో ముకేశ్ అంబానీది 83.40 బిలియన్ డాలర్ల సంపదతో 9వ స్థానం. అదానీది 82.53 మిలియన్ డాలర్ల సంపద. అమెరికాలో అత్యంత శ్రీమంతుల్లో ఏడుగురు మనవారే. మన దేశ ఒక శాతం సంపన్నుల దగ్గర 40శాతం దేశ సంపద కలిగి ఉన్నది. మరోపక్క భారతదేశ అభివృద్ధి 5.4శాతం తగ్గింది. 2014లో నిరుద్యోగుల సంఖ్య సుమారు 4.7 కోట్లుగా ఉంటే 2025కు వచ్చేసరికి 5.8 కోట్లకు చేరింది. ఆకలి కేకల్లో 125 దేశాల్లో భారత దేశం 111 స్థానం.. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పేదరికం తగ్గించడం, సమానత్వం పెంపొందించడం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించటంలో చేసిన 175 దేశాల అధ్యయనంలో భారతదేశం దశా బ్దకాలంగా 130 నుండి 135 స్థానాల్లోనే కొనసాగుతున్నది. ఇంతకన్నా ఏంకావాలి? దేశం అసమానతల్లో ఉందని, అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పడానికి.
మోడీ గెలిచింది దేశాన్ని పాలించడం కోసం కాదన్న విషయం తెలియనిది కాదు. ఎందుకంటే, ఆయన వంతపాడేది, అభివృద్ధికి పాటుపడేది కార్పొరేట్ల కోసమేనన్నది మరువకూడదు. ఈ రోజు ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, భూములు, గనులు, నదులు, సముద్ర జలాలతో పాటు సమస్త ప్రకృతి వనరులను కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతున్నది మోడీ సర్కార్. మరోవైపు సామాన్యులపై భారాలు వేస్తూ సంక్షేమ పథకాలకు కోతలు పెడుతున్నది. ఈ ఆర్థిక అసమానతల భారత్‌లో సంక్షేమ పథకాలు పేదప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నవి. అవి కూడా అందకుండా చేసే కుట్ర కేంద్ర పాలకుల్లో ఉండటం నిజంగా మన దౌర్భగ్యం. కేంద్ర ప్రభుత్వ పథకాలైన గ్రామీణ ఉపాధి చట్టం, ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆహార భద్రతకు నిధులు చాలా అవసరం. ఎందుకంటే, మనదేశంలో 143 కోట్ల జనాభాలో 42శాతం అంటే 29.39 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆహార భద్రత ఇంతటి ప్రమాదకరస్థాయికి దిగజారడం ఆందోళన విద్యావంతులు, మేధావి వర్గానికే ఆందోళన కలిగిస్తున్నది. ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం ప్రతి వ్యక్తికి తగినంత సురక్షితమైన పౌష్టికాహారం అందించాల్సి ఉండగా వీటి అమల్లోనూ అనేక లోపాలు కొనసాగుతున్నాయి. పేరుకు మాత్రం బియ్యం ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నా లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం అందడం లేదన్నది వాస్తవం. 2024 -25 కేంద్ర బడ్జెట్‌లో ఆహారభద్రతకు రూ.2.05 లక్షల కోట్లు కేటా యించగా ప్రస్తుత బడ్జెట్‌లో 2.03 లక్షల కోట్లు మాత్రమే ప్రకటించారు. నిధుల్ని ఏడాదికేడాది తగ్గిస్తూ రావడం ప్రజల పట్ల బీజేపీ నిర్లక్ష్యం తెలుస్తున్నది. 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తి చేశామని చెప్పుకుంటూనే ఎనభైకోట్ల మందికి ఉచిత రేషన్ అందించామని చెప్పడం వెనుకున్న వాస్తవాల్ని గ్రహించాలి.ఆహారభద్రత తీరుతెన్నుల్లో భారత్‌కు సంబంధించి పౌష్టికాహారం లభించని వారు 196.4 మిలియన్లు ఉన్నారని ప్రపంచ నివేదిక పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మానవాభివృద్ధిలో 170 దేశాల్లో ఇండియా 130 నుంచి 150 స్థానంలో ఉంది. దీనికి కారణం నిరక్షరాస్యత, విద్యలో వెనకబాటు తనమే.గ్రామీణ ఉపాధి చట్టం గ్రామాల్లోని పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. వందరోజులు పని కల్పించడం వల్ల వలసలు తగ్గుతాయి. అయినా కూడా ఈ పథకానికి కేంద్రం నిధులు పెంచలేదు.
గతేడాది కేంద్ర బడ్జెట్ రూ.45.20 లక్షల కోట్లుంటే ఇందులో 70శాతం కార్పొరేట్లకు రాయితీల రూపంలో పోయింది. ఇక మిగిలింది దేశ అభివృద్ధికి ఏం సరిపోతుంది? 2019లో కార్పొరేట్ పన్నులు 30 శాతం నుంచి 21కి, మ్యానుఫ్యాక్చర్ రంగంలో 25 నుంచి 15శాతం తగ్గించింది. దీంతో 18.40 లక్షల కోట్ల రాబడి కేంద్రం కోల్పోయింది. కార్పొరేట్ సంస్థలకు 14.46 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేసింది. స్విస్ బ్యాంకులో మూడు లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఇప్పటికీ మూలుగుతూనే ఉంది. మొత్తం బడ్జెట్లో 70శాతంగా ఈ మొత్తాన్ని వీరి వద్ద నుంచి రాబడితే లోటు బడ్జెట్‌ను అధిగమించి భారత్ మిగుల్లో ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే అత్యంత పన్నుల ఆదాయంలో ప్రజలదే అధికం. కానీ, భారం వేసేది వీరిమీదైతే, రాయితీలు కల్పిస్తూ, వారి అప్పుల్ని రద్దుచేస్తూ దేశ ఆర్థిక పరిస్థితిని ఆందోళనకరంగా మారుస్తున్నది మోడీ సర్కార్. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రాధా న్యత కలిగిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నాయి. దారిద్య్రం నుంచి బయటపడేందుకు తోడ్పడుతున్నాయి. కానీ ఆ పథకాలకే బడ్జెట్‌లో కోతలు విధించడం చూస్తే మోడీ పాలన సాగిస్తున్నది ఎవరికోసం, ఎందుకోసమన్న విషయం ఇట్టే అర్థమవుతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంతా కూడా పేదల్ని దోచి పెద్దలకు పెట్టే విధంగానే ఉన్నది. ఇది పేదరికం నుంచి ప్రజల్ని విముక్తి చేయకపోగా మారింత అసమానతలకు దారి తీస్తుందనడంలో సందేహం లేదు. కేంద్రం ఉదారవాద విధానాలను తిప్పికొట్టా లన్నా, సంక్షేమ పథకాలు కోతలకి గురికాకుండా అమలు చేసుకోవాలన్నా ప్రజల ఐక్య పోరాటాలే మార్గం.
– కొండపల్లి శ్రీధర్ 8639295777