– యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఓటమి
– 33వేలకు పైగా ఓట్ల మెజారిటీతో : ఎస్పీ అభ్యర్థి విజయం
లక్నో : యూపీలోని లఖింపూర్ ఖేరీలో కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఆయన ఓటమి పాలయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ఉత్కర్ష్ వర్మ ‘మధుర్’ 34329 ఓట్ల తేడాతో కేంద్ర మంత్రిని ఓడించారు. అజరు కుమార్ తేనీ ఇక్కడ నుంచి ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. ప్రస్తుతం వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిద్దామనుకున్న ఆయన ఆశలపై ఖేరీ ప్రజలు నీళ్లు చల్లారు. దీంతో ప్రస్తుతం ఓటమి పాలయ్యారు.
2021లో లఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేంద్ర మంత్రికే చెందిన ఒక వాహనాన్ని రైతుల పైకి ఎక్కించిన ఘటన ఇక్కడ చోటు చేసుకున్నది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన బెయిల్‌పై బయటకు వచ్చారు. కాగా, లఖింపూర్ ఖేరీ ఘటనతో నియోజకవర్గ ప్రజల్లో కేంద్ర మంత్రిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా, ఈ నియోజకవర్గంలో సిక్కులు కూడా అధికంగా ఉన్నారు. వీరికి కూడా బీజేపీ అభ్యర్థి పట్ల వ్యతిరేకత ఉన్నది. దీంతో ప్రజలకు కేంద్ర మంత్రిని ఓడించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.