బీజేపీ ఓటమికి ఐక్య పోరాటం

United fight to defeat BJP– రైతు, కార్మిక విరోధి మోడీ సర్కార్‌
– 23న దేశవ్యాప్త ఆందోళనలు
– ఎంఎస్పీ చట్టాన్ని చేయాలి : చారిత్రాత్మకంగా కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో కార్పొరేట్‌లతో కలిసి దేశ సంపదను దోచుకుంటున్న మోడీ ప్రభుత్వాన్ని కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ హెచ్చరించింది. గురువారం నాడిక్కడ రాంలీలా మైదానంలో ఎస్కేఎం ఆధ్వర్యంలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ జరిగింది. లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. మహిళలు, విద్యార్థులు, యువకులు, న్యాయవాదులు, మేథావులు, రచయితలు సంఘీభావం తెలిపారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు పిలుపునిచ్చిన కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌ను జయప్రదం కాకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలను రైతులు, కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టారు. కేవలం ఐదు వేల మందిని మాత్రమే ఢిల్లీకి అనుమతిస్తామన్న పోలీసుల తీరుకు ప్రతిగా లక్షన్నర మంది హాజరయ్యారు.
చారిత్రాత్మక మహా పంచాయత్‌లో అపూర్వమైన మహిళల భాగస్వామ్యముంది. ఢిల్లీలోని పంజాబ్‌, హర్యానా వంటి పొరుగు రాష్ట్రాలతో పాటు, దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా రైతులు, వ్యవసాయ కార్మికులు తెల్లవారుజామునే రాంలీలా మైదానంలో పోటెత్తారు. ఢిల్లీలో ఐటీవో సహా వివిధ ప్రాంతాల్లో రైతులను నిలువరించే ప్రయత్నం జరిగింది. ఉదయం తొమ్మిది గంటలకే మైదానం దాదాపు నిండిపోయింది. మహా పంచాయత్‌ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసే సమయానికి పోలీసులు పెద్దఎత్తున నిరసన స్థలానికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం మంగళవారం అనుమతి లభించినా బుధవారం రాత్రి బురద నీటితో మైదానాన్ని నింపిన పోలీసుల కుయుక్తులు రైతుల ముందు ఫలించలేదు. బీజేపీని తరిమికొట్టండి, దేశాన్ని రక్షించండి అంటూ నినాదాలు ర్యాలీ వేదికగా మార్మోగాయి.
కేంద్రంపై ఉద్యమం ఉధృతం
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఐక్యంగా పోరాడాలని మహా పంచాయత్‌ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. యునైటెడ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ఫోరంను ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిల్లో ఆందోళనలు నిర్వహిస్తామని, కేంద్రంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. హర్యానాలో యువ రైతు శుభకరణ్‌ సింగ్‌ను కాల్చి చంపి రైతుల అణిచివేతకు కారణమైన కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని మహా పంచాయత్‌ డిమాండ్‌ చేసింది. అమిత్‌ షాతో పాటు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, మాజీ హౌంమంత్రి అనిల్‌ విజ్‌లపై హత్యానేరం మోపాలని డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలని, 2020 నాటి చారిత్రాత్మక రైతు ఉద్యమం ముగించినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పీ చట్టంతో సహా అనేక వాగ్దానాలను నెరవేర్చలేదని పేర్కొంది. లఖింపుర్‌ఖేరీ రైతు మారణకాండ సూత్రధారి, కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను బీజేపీ తిరిగి పోటీకి నిలపడాన్ని నిరసిస్తూ 23న అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమం చేపట్టనుంది.
దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే పోరాటంలో ప్రజలందరూ తరలిరావాలని మహా పంచాయత్‌ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం నేతలు అశోక్‌ దావలే, విజూ కృష్ణన్‌, హన్నన్‌ మొల్లా, కృష్ణ ప్రసాద్‌, రాకేష్‌ టికాయిత్‌, దర్శన్‌పాల్‌, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, సునీలం, సత్యవాన్‌, రావుల వెంకయ్య, హర్మీత్‌ కడియన్‌, బసవ రాజప్ప, లింగరాజ్‌ ఆజాద్‌, వికాస్‌ సిసార్‌, తేజిందర్‌ సింగ్‌ విర్క్‌, గుర్నామ్‌ సింగ్‌ చదువుని, అవిక్‌ సాహా, మేధా పాట్కర్‌, రాజారామ్‌ సింగ్‌, హరీందర్‌ లఖోవల్‌, కుల్వంత్‌ సంధు, చమ్రాసా మాలి పాటిల్‌, జోగిందర్‌ నయన్‌, జగ్తార్‌ బజ్వా, మంజీత్‌ ధనేర్‌, సుభాష్‌ కకుష్టే, సురేష్‌ కౌత్‌, రాజేంద్ర చౌదరి, అశోక్‌ బైతా, జంగ్వీర్‌ చౌహాన్‌, సత్యదేవ్‌ పాల్‌, బూటా సింగ్‌ బుర్జ్‌గిల్‌, రాజిందర్‌ సింగ్‌ దీప్సింగ్వాలా తదితరులు పాల్గొన్నారు.a