– డైరీ ఆవిష్కరణలో పోతినేని, సాగర్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, రాష్ట్ర నాయకులు టి.కిషోర్, టీపీఎస్‌కే రాష్ట్ర నాయకులు జి.రాములు తదితరులు చైతన్య సేద్యం 2024 డైరీని ఆవిష్కరించారు. చైతన్య సేద్యం పత్రిక ఎడిటర్ ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడంతోపాటు కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని కోరారు. సహకార రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. వాటిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ‘మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.కార్పొరేట్లను తరిమికొట్టాలి.
దేశాన్ని రక్షించాలి’ అనే నినాదంతో ఈనెల 26న దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్, వాహనాల ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.