భూ సమస్య పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు నిర్మించాలి

భూ సమస్య పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు నిర్మించాలి– ఇదే అంబేద్కర్‌కు అర్పించే నివాళి : జయంతి సభలో టి.సాగర్‌, ఆర్‌.వెంకట్రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భూ సమస్య పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను నిర్మించడమే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు అర్పించే నిజమైన నివాళి అని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో అంబేద్కర్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమిని జాతీయం చేసి పేదలకు పంచాలని చట్టసభల్లో డిమాండ్‌ చేసిన మహనీయుడు అంబేద్కర్‌ అని కొనియాడారు.దున్నేవానికి భూమి కావాలని పోరాడి ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంచేటట్టు కమ్యూనిస్టులు పోరాడితే, నేడు ఆ భూములను ఢిల్లీలో మోడీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేదల చేతుల్లోని భూములను లాక్కుంటున్నదని విమర్శించారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పునరావాస ప్యాకేజీ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అంటరానితనం, కులవివక్ష, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలపై దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్ల కోసం పోరాటాలు ఉధృతం చేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఆహార భద్రతా చట్టాన్ని మోడీ సర్కారు సరిగా అమలు చేయడం లేదన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదనీ, ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణ చేయ కుండా ఆపేసిందని విమర్శించారు. దేశంలో పెరుగుతున్న సామాజిక ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలను చేయడమే అంబేద్కర్‌కు అర్పించే నివాళి అన్నారు.
రాజ్యాం గం స్థానంలో కులవివక్ష, అంటరానితనం అసమానతలు కొనసాగించే మన ధర్మం శాస్త్రాన్ని తీసుకురావాలని చూస్తున్న మతోన్మాద బీజేపీ అభ్యర్థులను పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌, బొప్పని పద్మ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ నాయక్‌, రాష్ట్ర నాయకులు కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.