ఐక్య ఉద్యమాలు బలోపేతం కావాలి

– రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌యూటీఎఫ్‌ దశాబ్ది ఉత్సవాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ విద్యారంగ అభివృద్ది, ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు బలోపేతం కావాలనీ, అందుకు టీఎస్‌యూటీఎఫ్‌ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీిఎస్‌యూటీఎఫ్‌) పదకొండో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో పతాకాన్ని అధ్యక్షులు జంగయ్య ఆవిష్కరించారు. అనంతరం సంఘం సీనియర్‌ నాయకులు, సాహితీ వేత్త మోతుకూరి నరహరి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాలు, మేనేజిమెంట్లు, క్యాడర్ల అడ్డు గోడలను బద్దలుగొట్టి ఉపాధ్యాయులందరికీ ఒకే సంఘం ఉండాలనే ఆశయంతో 1974లో యూటీిఎఫ్‌ ఆవిర్భవించిందని తెలిపారు.
ఆ తర్వాతనే అన్ని సంఘాలూ రాష్ట్ర వ్యాప్త సంఘాలుగా మారాయన్నారు. రాష్ట్ర విభజన కారణంగా 2014 ఏప్రిల్‌ 13 న ఏర్పాటైన టీఎస్‌యూటీిఎఫ్‌ తెలంగాణలో పోరాట సంఘంగా ఎదిగిందని అభినందించారు. చావ రవి మాట్లాడుతూ గత పదేండ్ల కాలంలో ఐక్య ఉద్యమాల నిర్మాణంలో టీఎస్‌ యూటీిఎఫ్‌ చురుగ్గా వ్యవహరించిందని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా, వివక్షను ప్రదర్శించినా లొంగకుండా విద్యారంగం, ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడటానికే నికరంగా నిలబడిందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, పాలకులు ఎవరైనా టీఎస్‌యూటీఎఫ్‌ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ విద్యాభివృద్ది, ఉపాధ్యాయుల హక్కుల రక్షణ కోసం పాటుపడుతున్నదని గుర్తు చేశారు. కోర్టు స్టే ఎత్తేసినందున అవసరమైతే సీఈసీ అనుమతి తీసుకుని మల్టీ జోన్‌ 2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులివ్వాలనీ, టెట్‌ పై ఉపాధ్యాయుల సందేహాలు నివృత్తి చేయాలనీ, ఇన్‌ సర్వీస్‌ టెట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌ యూటీఎఫ్‌ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయనీ, పార్లమెంటు ఎన్నికల అనంతరం రాష్ట్ర కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి సింహాచలం, సీనియర్‌ నాయకులు మాణిక్‌ రెడ్డి, మస్తాన్‌ రావు, రాజారావు, శారద, బుచ్చిరెడ్డి, రామకృష్ణ, బాషా తదితరులు పాల్గొన్నారు.