కేంద్ర ప్లానింగ్ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 3న రాజ్యసభలో మాట్లాడుతూ ‘మన దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి 2011-12 తర్వాత ఏ విధమైన గణాంకాలూ అందుబాటులో లేవు’ అని ప్రకటించారు. అందుచేత ఆ ఏడాది తర్వాత ఎంతమంది పేదరికస్థాయి నుండి బయట పడ్డారో చెప్పలేమని అన్నారు. అయితే ఐక్యరాజ్యసమితికి (ఐరాస) చెందిన యుఎన్‌డిపి (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) జులై 18న ఒక ప్రకటన చేసింది. దాని ప్రకారం 2005 నుండి 2019 మధ్య కాలంలో భారతదేశంలో 41 కోట్ల 50 లక్షల మంది పేదరికపు స్థాయిని అధిగమించారు. కరోనా అనంతర కాలపు పరిస్థితి గురించిన అంచనాలను యుఎన్‌డిపి చెప్పలేదు. కాని అంతకు ముందరి కాలానికి సంబంధించి యుఎన్‌డిపి చెప్పినది విపరీతంగా ప్రచారం అయ్యింది. గొప్పలు చెప్పుకోడానికి అది దారి తీసింది. కాని, ఇక్కడ గమనించని వాస్తవం ఏమంటే యుఎన్‌డిపి పేదరికానికి సంబంధించి అంచనాలు వేసే పద్ధతి, అది తీసుకున్న కొలబద్దలు వేరు, మన దేశంలో పేదరికాన్ని అధ్యయనం చేయడానికి తీసుకునే కొలబద్దలు వేరు. యుఎన్‌డిపి అంచనాలు సైద్ధాంతికంగా సమర్థించుకోగలిగినవి కావు. ఆ అంచనాలకు రావడానికి అది ఉపయోగించిన గణాంకాలు కూడా సరైనవి కావు.
మన దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఒక ప్రధానమైన కొలబద్ద పౌష్టికాహారం. అది అందనివారు పేదలుగా పరిగణింపబడతారు. అంతే కాదు. మన జాతీయ శాంపిల్ సర్వే చాలా పెద్దది. ఆ సర్వే చాలా పెద్ద సంఖ్యలో ప్రజలను కలిసి వివరాలు సేకరిస్తుంది. అయితే 2011-12 తర్వాత మన ప్రభుత్వం దగ్గర ఏ గణాంక వివరాలూ లేవని ఎందుకు ప్రకటించారు? ఆ తర్వాత 2017-18 సంవత్సరంలో చేసిన సర్వేలో బయటపడ్డ చేదు వాస్తవాలను వెల్లడించే సాహసం కేంద్ర ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం ఎటువంటి సర్వేనూ చేపట్టనే లేదు. అందుచేత తమ వద్ద 2011-12 తర్వాత వివరాలు లేవంటూ బుకాయిస్తున్నారు.
ఇక యుఎన్‌డిపి సర్వే విధానం చూస్తే అది పూర్తిగా భిన్నమైనది. పేదరికపు అంచనాల కోసం అది తీసుకునే సూచికలు కొన్ని ఉన్నాయి. వాటన్నింటినీ బట్టి ఒక అంచనాకి వస్తారు. ఉదాహరణకి: ఒక వ్యక్తి ఎంత ఎత్తు ఉన్నాడు అన్నది కొలిచి దాని వర్గాన్ని లెక్కిస్తారు. అలా వచ్చిన అంకెను 18.5తో గుణిస్తారు. అప్పుడు వచ్చిన అంకె కన్నా ఆ వ్యక్తి తక్కువ కిలోల బరువు ఉంటే అతడుపేదవాడిగాలెక్క (ఉదా: ఎత్తు 1.5 మీటర్లు అయితే దాని వర్గం 2.25. దానిని 18.5తో గుణిస్తే 41.625 కిలోలు వస్తుంది. ఆ వ్యక్తి బరువు అంతకన్నా తక్కువ ఉంటేనే అతడిని పేదవాడుగా గుర్తిస్తారు). ఇంకొక కొలబద్ద: ఆ ఇంట్లో గత ఐదేళ్ళలో 18 సంవత్సరం వయస్సు లోపు ఉన్నవారు ఎవరైనా మరణించారా? అన్నది. ఇంకొకటి: ఆ ఇంట్లో 12 ఏళ్ళ వయస్సుకు పైబడిన పిల్లలు ఉంటే వారు కనీసం 6 సంవత్సరాల స్కూలు చదువు పూర్తి చేశారా? లేదా? అన్నది. స్కూలుకు పోయే వయస్సు ఉన్న పిల్లల్లో 8వ తరగతి వరకూ చదవకుండా మధ్యలోనే ఆపివేశారా? అన్నది ఇంకొకటి.
‘ఆధునిక’ సమాజాలుగా పరివర్తన జరుగుతున్న ఏ సమాజంలోనైనా పైన తెలిపిన కొలబద్దల ప్రాతిపదికన చూస్తే అభివృద్ధి తప్పనిసరిగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఉదాహరణకి: 18 ఏళ్ళ లోపు వయస్సు ఉండే పిల్లల్లో మరణాల రేటు ఆ సమాజాల్లో తగ్గుతూనే వుంటుంది. అదేమాదిరిగా స్కూలుకి పోయే పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మంచి చదువు ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న భావన అప్పో, సప్పో చేసైనా పిల్లల్ని చదివించాలనే తాపత్రయం ఉండే తల్లిదండ్రులు పెరుగుతున్నకొద్దీ స్కూళ్ళకి పోయే పిల్లల సంఖ్య పెరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం వంటివి కూడా స్కూలు హాజరు రేటును మెరుగుపరుస్తాయి. అయితే, ఆ కుటుంబపు ఆదాయం తగ్గిపోతున్నా, ఈ కొలబద్దలన్నీ అందుకోవచ్చు. ఆ కుటుంబం ఇతరత్రా వినియోగించే సరుకుల మొత్తం అంతకంతకూ తగ్గించుకుంటూ బిడ్డల్ని చదివించుకోవడం జరుగుతుంది. అంటే ఆ కుటుంబంలో ఒకవైపు పేదరికం పెరుగుతున్నా, యుఎన్‌డిపి కొలబద్దలను బట్టి చూస్తే, ఆ కుటుంబం పేదరికంలో లేనట్టే లెక్క.
యుఎన్‌డిపి తన కొలబద్దలు పేదరికాన్ని బహుముఖంగా పరిశీలించడానికి తోడ్పడతాయని చెపుతుంది. ఈ బహుముఖపు పేదరికం అంటే ఏమిటి? ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ సమాజపు ఆధునీకరణ ఏ విధంగా జరగాలని కోరుకుంటుందో ఆ దిశకు అనుగుణంగా ఇది ఉంటుంది.మరి ఈ ఆధునీకరణ జరగడానికి మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు? శ్రామిక ప్రజలా? లేక సంపన్నులా? యుఎన్‌డిపికి ఈ ప్రశ్న అసలు ఉదయించదు. ఆధునీకరణ జరిగిందా లేదా అన్నదే దానికి ముఖ్యం (వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగి కూలీలకు పనులు దక్కకుండా పోయినా అది అభివృద్ధికిందే లెక్క. రెగ్యులర్ కార్మికుల స్థానంలో కాంట్రాక్టు కార్మికులను పెట్టుకుని నడిపే పరిశ్రమలు పెరిగితే అదీ అభివృద్ధి కిందే లెక్క).
ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మన దేశంలో ఈ తరహా ఆధునీకరణ వేగంగా జరుగుతోంది. అందుకే యుఎన్‌డిపి లెక్కల్లో మన దేశంలో పేదరికం తగ్గినట్టు కనిపిస్తోంది. కాని ఈ ఆధునీకరణకు మూల్యం చెల్లిస్తున్నది శ్రామిక ప్రజలే. వారి వినిమయ శక్తి (లేదా కొనుగోలు శక్తి) పడిపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబం చేసే ఖర్చులలో ప్రాధాన్యతలు కూడా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆహారం కోసం చేసే ఖర్చు తగ్గుతోంది. అందువల్ల పేదరికాన్ని అంచనా వేయడానికి ఆయా కుటుంబాల ఆహారపు పౌష్టిక విలువలను (ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు అన్నది) ప్రాతిపదికగా తీసుకోవడం అవసరం. పేదరికపు తీరు తెన్నులకు అద్దం పట్టే ప్రమాణం ఇదే. అంతే కాదు, కుటుంబపు వాస్తవ ఆదాయం పెరుగుతోందా లేక తగ్గుతోందా అన్నది కూడా ఈ ప్రమాణాన్ని బట్టి నిర్ధారించగలుగుతాం. రూపాయి లెక్కల్లో ఆదాయం పెరిగనట్టు కనిపించినా, ఆ రూపాయి విలువ నిగ్గు తేల్చేది ఒకానొక కుటుంబం పౌష్టికాహారాన్ని పొందగలుగుతోందా లేదా అన్న పరిశీలనే.
ఇటువంటి ముఖ్యమైన కొలబద్ద- పౌష్టికాహారం పొందగలగడం-యుఎన్‌డిపి పెట్టుకున్న ప్రమాణాలలో ఆరో వంతు ప్రాధాన్యత మాత్రమే కలిగివుంది. పైగా పౌష్టికాహార లభ్యతకు వాళ్ళు ఇచ్చే నిర్వచనమే వేరుగా ఉంది. శరీరానికి తగ్గట్టు బరువు ఉందా లేదా అన్నది (బాడీ-మాస్ ఇండెక్స్), వారి ప్రమాణం. పౌష్టికాహారం పొందలేనప్పుడే బరువు తగ్గుతుంది. ఒక్కోసారి బరువులో తేడా కనిపించకపోవచ్చు కాని రోగాలబారిన పడే అవకాశాలు పెరుగుతాయి. అంటే శరీరపు బరువును బట్టి పేదరికాన్ని లెక్క వేయడం శాస్త్రీయం కాదు. నిజానికి పౌష్టికాహారం తీసుకోలేకపోతే ఆ వెంటనే శరీరపు బరువు తగ్గిపోదు. దానికి కొంత కాలం పడుతుంది. అందుచేత యుఎన్‌డిపి పెట్టుకున్న కొలబద్దలకు వాస్తవ పౌష్టికాహార సమస్య దొరకదు. పైగా దీనికి ఆరో వంతు ప్రాధాన్యత మాత్రమే ఇవ్వడం బట్టి యుఎన్‌డిపి దృక్కోణం ఏమిటో తెలుస్తూనే ఉంది.
యుఎన్‌డిపి ప్రమాణాలకు, మన జాతీయ శాంపిల్ సర్వే ప్రమాణాలకు ఎంత తేడా ఉందో తెలియాలంటే ఈ ఉదాహరణ చూడాలి: 2005-2006 నాటికి భారతదేశంలో 64 కోట్ల 50 లక్షల మంది పేదలు ఉన్నారని, 2015-16 నాటికి ఈ సంఖ్య 37 కోట్లకు పడిపోయిందని యుఎన్‌డిపి లెక్కలు తెలుపుతున్నాయి. అంటే అప్పటికి 27 కోట్ల 50 లక్షల మంది పేదరికం నుండి బయటపడినట్లు అవుతుంది. అదే జాతీయ శాంపిల్ సర్వే 75వ రౌండ్ సర్వేలో (2017-18) గ్రామీణ ప్రాంతంలో ప్రజల వినియోగం (అన్ని సరుకుల, సేవలనూ కలుపుకుని) 9శాతం పడిపోయిందని తేల్చింది.
(ఈ నిర్ధారణ మోడీ ప్రభుత్వాన్ని ఎంత వణికించిందంటే ఆ గణాంకాలను విడుదల చేసిన కొద్ది గంటలలోపే వాటిని తొలగించివేసి, ప్రజానీకానికి దొరక్కుండా దాచిపెట్టింది. ఆ కొద్ది గంటల వ్యవధి లోపలనే కొందరు వ్యక్తుల ఆ గణాంకాలను వీలైన మేరకు డౌన్‌లోడ్ చేసుకున్నారు. అప్పటి మీడియాలో కూడా ఆ గణాంకాల ఆధారంగా కొంత చర్చ జరిగింది.)
భారత ప్రణాళికా సంఘం మొదట్లో గ్రామీణ ప్రజలకు కనీసం 2200 క్యాలరీల శక్తి రోజుకు ఒక్కొక్కరికి అందాలన్నది ప్రమాణంగా నిర్ణయించింది. ఆ లెక్క చూస్తే 1993-94లో కనీస పౌష్టికాహారం పొందలేని గ్రామీణులు 58శాతం ఉన్నారు. 2011-12 నాటికి వాళ్ళు 68శాతానికి పెరిగారు. 2017-18 నాటికి వాళ్ళు అమాంతం 77శాతానికి పెరిగారు! కాని యుఎన్‌డిపి లెక్కల్లో మన దేశంలో కోట్లాది మంది పేదరికం లోంచి బైటపడ్డారు! మనం ఇంతవరకూ గ్రామీణ పేదరికం గురించి చర్చించాం. కరోనా మహమ్మారి విరుచుకు పడకముందు 2019-20లో మన దేశంలో నిరుద్యోగం అప్పటికి 45ఏళ్ళకు పూర్వం ఏనాడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుంది. దీనిని బట్టి మన దేశంలో పేదరికం తగ్గలేదని స్పష్టంగా చెప్పవచ్చు. వాస్తవానికి అది మరింత పెరిగింది. కాని యుఎన్‌డిపి లెక్కలు దానికి భిన్నంగా చెప్తున్నాయి.
యుఎన్‌డిపి పెట్టుకున్న కొలబద్దలను ఇక్కడ మనం విమర్శించడం ప్రధానాంశం కాదు. ఆ కొలబద్దల ఆధారంగా పేదరికం పెరిగిందా లేక తగ్గిందా అన్న నిర్ధారణకు రావడాన్ని మనం విమర్శిస్తున్నాం. దేశంలో పేదరికంపై జరుగుతున్న చర్చ కాస్తా యుఎన్‌డిపి గణాంకాలతో పూర్తిగా దారి తప్పింది. మన దేశం పెట్టుకున్న కొలబద్దలకు, యుఎన్‌డిపి కొలబద్దలకు మధ్య తేడాను గమనించకపోతే చర్చను మళ్ళీ గాడిలో పెట్టడం సాధ్యం కాదు. మొత్తం 121 దేశాలకు గాను ప్రపంచ ఆకలి సూచికలో 107వ స్థానానికి దిగజారిన మన దేశంలో మరోవైపు కోట్లాదిమంది ప్రజలు పేదరికస్థాయినుండి బయట పడ్డారని చెప్పుకుంటే దానిని ఏ విధంగా ప్రజలు విశ్వసిస్తారు?
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్