కార్మికుల హక్కుల కోసం ఐక్యపోరాటాలు

United struggles for workers' rights– లేబర్‌ కోడ్‌లతో ఆధునిక బానిసత్వం
– మతపర భావోద్వేగాలతో ప్రజాసమస్యల విస్మరణ : ఏఐటీయూసీ ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక సంఘాల నేతలు
– ఏఐటీయూసీ డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కార్మికుల హక్కుల కోసం ఐక్యపోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్తామని కార్మిక సంఘాల నేతలు ప్రతినబూనారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లతో కార్మికులు ఆధునిక బానిసత్వంలోకి నెట్టబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు, కర్షకులు, ప్రజలంతా ఐక్యమై బీజేపీ హఠావో..దేశ్‌కీ బచావో నినాదంతో మోడీ సర్కార్‌ను గద్దెదింపాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో గల సత్యనారాయణరెడ్డి భవన్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్‌డీ యూసుఫ్‌, బాలరాజ్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే బోస్‌, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు ఎస్‌ఎల్‌.పద్మ, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ్మ, సీనియర్‌ నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి ప్రేమ్‌ పావని, బి చంద్రయ్య, రాష్ట్ర కార్యదర్శులు ఓరుగంటి యాదయ్య, కే కరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో కార్మిక ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దేశంలోని నిరుద్యోగం, ఆకలికేకలు, పేదల సమస్యలు ఎజెండాగా మారకుండా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొడుతూ మోడీ సర్కారు ముందుకెళ్తున్నదని విమర్శించారు. ఇలాంటి సమయంలో కార్మికవర్గాన్ని చైతన్యపర్చాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపై ఉందని నొక్కి చెప్పారు. నియంతృత్వం తీవ్రమైతే ప్రజలే తిరగబడి పాలకులను బండకేసి కొడుతారనీ, బీఆర్‌ఎస్‌ ఓటమే దానికి ప్రత్యక్ష ఉదహరణ అని అన్నారు. సమ్మెలు, నిరసనలపై ఉక్కుపాదం మోపి, అణిచివేతలకు పాల్పడినందుకు కార్మికులు, ప్రజలు ఆ పార్టీని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు.