చాలామంది ఆర్థికవేత్తలు భారతదేశంలో సార్వత్రిక ప్రాథమిక ఆదాయాన్ని అమలు చేయాలని వాదిస్తున్నారు. 2016-17 ఆర్థిక సర్వేలో సైతం ఈ విషయాన్ని అధికారికంగానే సూచించారు. అయితే దానిని ఏ విధంగా అమల్లోకి తేవాలన్న ఆచరణాత్మక విషయం మీద ప్రతిపాదనలు రకరకాలుగా వస్తున్నాయి. ఒకానొక స్థాయి కన్నా తక్కువగా ఆదాయం పొందుతున్న వారందరినీ గుర్తించి వారందరికీ ఒకేవిధంగా నగదు బదిలీ చేయాలన్నది ఒకటి. ఎవరెంత తక్కువ స్థాయిలో ఆదాయం పొందుతున్నారన్నది పరిశీలించి దానికి తగ్గట్టు నగదు బదిలీ వివిధ రకాలుగా చేయాలన్నది రెండోది. ఈ తేడాలను పక్కన పెడితే సార్వత్రిక పాథమిక ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం) అనే భావన సారాంశం ఒక్కటే. సమాజంలో ప్రతీ ఒక్కరూ ఒక కనీస ప్రాథమిక స్థాయికి తగ్గకుండా ఆదాయాన్ని పొందగలగాలి. అందుకు వీలుగా ప్రభుత్వం నగదు బదిలీ చేయాలి. అప్పుడు ప్రతీ ఒక్కరూ ఒక కనీస స్థాయిలో సరుకులను పొందగలిగే పరిస్థితిలో ఉంటారు. ఆ విధంగా కనీస జీవన ప్రమాణాలను అందుకోగలుగుతారు.
ఈ సార్వత్రిక ప్రాథమిక ఆదాయం అనే భావన పట్ల కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఆర్థిక సర్వే వాటిని వివరంగా పేర్కొని తన నివేదికలో వాటిపై చర్చించింది. ప్రధానమైన అభ్యంతరాలు మితవాద శక్తులనుండి వచ్చాయి. వాళ్ళ ప్రధానమైన అభ్యంతరం ఒక్కటే. ఈ విధంగా ప్రభుత్వం నేరుగా నగదు అందిస్తే ఇక దానిని అందుకున్నవాళ్లు తమ వంతు కష్టపడి పనిచేయడం మానేస్తారు. పనిచేసినా, చెయ్యకపోయినా ఎటూ ఆదాయం రావడం ఖాయం గనుక ఆ కాడికి మనం పని చేయడం దేనికి? అన్న ధోరణి పెరుగుతుంది. మనం ప్రస్తుతం ఉంటున్న సమాజంలో ఒక వ్యక్తి ఆదాయం అతడు చేసే కష్టం మీద ఆధారపడి వుంటుంది అన్న ప్రాతి పదికన ఈ వాదన నడుస్తుంది. ఒక వ్యక్తి కష్టపడకపోయినా అతనికి లేదా ఆమెకు కనీస స్థాయిలో ఆదాయం గ్యారంటీగా వచ్చే పద్ధతి ప్రవేశపెడితే, అప్పుడు మన సమాజం నడక మారిపోతుంది అని మితవాదులు అంటారు. కాని ఈ వాదన బొత్తిగా అర్ధరహితం. ఎందుకంటే, ప్రస్తుత సమాజంలో ధనవంతులు ఏ కష్టమూ పడకుండానే విపరీతంగా తమ సంపదను పెంచుకోగలుగుతున్నారు. ఇంకో పక్క పేదలు చాలా కొద్దిపాటి కూలి డబ్బుల కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు.
ఒకానొక కార్మికుడు ఎంత ఎక్కువ కష్టంతో కూడిన పని చేస్తే, ఎంత ఎక్కువ ప్రమాదంతో కూడిన పని చేస్తే అంత ఎక్కువ జీతం అతడికి వస్తుంది అని ఆడమ్ స్మిత్ చెప్పాడు. ఐతే ఆచరణలో ఆ విధంగా లేదని జాన్ స్టువార్ట్ మిల్ అనే మరో ఆర్థికవేత్త గమనించాడు. నిజానిక అటువంటి కష్టతరమైన, ప్రమాదాలతో కూడిన పనులు చేసేవారికి అతి తక్కువ వేతనాలు లభిస్తున్నాయని అతడు ఎత్తిచూపాడు. అందుచేత ఇక్కడ సార్వత్రిక ప్రాథమిక వేతనం అమలు చేయడం అంటే ఏ పనీ చేయనందుకు ఇచ్చే ఆదాయం కాదు. అతడు చేసే పనికి ఎక్కువ రేటు వేతనాన్ని చెల్లించడం ఔతుంది. (ఒకానొక వ్యక్తి నిరుద్యోగిగా ఉన్నాడంటే అది అతడి వ్యక్తిగతమైన తప్పు కాదు, అది ఈ సామాజిక వ్యవస్థ లోపం. ఈ విషయానికి, ప్రస్తుత చర్చతో సంబంధం లేదు).
సార్వత్రిక ప్రాథమిక ఆదాయం గ్యారంటీ చేస్తే దాని వలన జనాలు పని చేయడం మానేస్తారు అన్న వాదన ఎలాంటిదంటే, జీతాలు ఎంత పెంచితే కార్మికులు అంతగా పని ఎగ్గొడతారు అన్న వాదన లాంటిది. కార్మికుల జీతాలకు ”డిమాండ్-సప్లరు” సూత్రాన్ని వర్తింపజేసే మితవాద ఆర్థికవేత్తల వాదన ఇది. ఈ వాదన నైతికంగా సహించకూడనిది, విశ్లేషణాత్మకంగా చూస్తే నిరాధారమైనది. అందుకే ”ధనవంతులు ఎంత ఎక్కువగా సంపాదిస్తే అంత బాగా పని చేస్తారు, పేదలు ఎంత తక్కువ జీతం ఇస్తే అంత బాగా పని చేస్తారు” అన్నట్టుగా వీళ్ళ వాదన ఉందని జెకె గాల్బ్రియత్ అనే అమెరికన్ ఆర్థికవేత్త మితవాదులని అవహేళన చేశాడు.
మితవాదులు సార్వత్రిక ప్రాథమిక ఆదాయాన్ని వ్యతిరేకిస్తే, అభ్యుదయ కాముకులైన ఉదారవాదులు (లిబరల్స్) ఈ ప్రతిపాదనను బలంగా ముందుకు తెస్తున్నారు. ఐతే ఈ ఉదారవాదుల ప్రతిపాదన ఎలాంటిదంటే కోడిగుడ్డును పగలగొట్టకుండానే ఆమ్లెట్‌ను తయారు చెయ్యాలన్నటువంటిది. మామూలుగా ఈ ఉదారవాదుల ప్రతిపాదనలన్నీ ఈ విధంగానే ఉంటాయి. వీళ్లు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ లోపలనే సమాజం కొనసాగాలనుకుంటారు. అదే సమయంలో ఈ సమాజం కార్మికవర్గం పట్ల మరింత మానవత్వంతో మెలగాలని అంటారు. మరైతే అందుకోసం పెట్టుబడిదారులను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని కూడా అంటారు. అందుకనే సార్వత్రిక ప్రాథమిక ఆదాయం పేర చెల్లించవలసిన మొత్తం చాలా స్వల్పంగా ప్రతిపాదించారు. ఉదాహరణకి 2016-17 ఆర్థిక సర్వే ఒక సంవత్సరానికి ఒక వ్మక్తికి రు.7620 చొప్పున బదిలీ చేయాలని ప్రతిపాదించింది. మెరుగైన జీతాలు పొందే 25 శాతం కార్మికులను మినహాయించి తక్కినవారందరికీ తలా రూ.7620 చొప్పున ఏడాదికి చెల్లించాలంటే అందుకు మన జిడిపిలో 4.9 శాతం కేటాయించాలి. దానితో సరిసమానమైన మొత్తాన్ని గనుక అత్యల్ప ఆదాయాలు పొందుతున్న 75 శాతం ప్రజలకు కేటాయిస్తే (2011-12 నాటి ధరల ప్రాతిపదికన) దాని వలన దేశంలో పేదరికం ఆ ఏడాదిలో (2011-12 లో) కేవలం 0.5 శాతం మాత్రమే ఉండివుండేది. అంటే పేదరికం దాదాపు లేకుండా పోయేదని ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే, తలా రూ.7620 చెల్లించడం కోసం అవసరమయ్యే ఆర్థిక వనరులను సేకరించడానికి ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రకరకాల సబ్సిడీలన్నింటికీ కోత పెట్టవచ్చునని ఆర్థిక సర్వే సూచనప్రాయంగా చెప్పింది.
ఆర్థిక సర్వే చెప్పిన లెక్కలతో రెండు సమస్యలు ఉన్నాయి. మొదటిది: సార్వత్రిక ప్రాథమిక ఆదాయం అమలు జరగడం వలన పేదలు తినే ఆహారపు కేలరీల విలువ దాదాపు 50 శాతం పెరుగుతుందని ఆ సర్వే చెప్పింది. ఆ మేరకు వారికి బదిలీ చేసే నగదు మొత్తంలో పెరుగుదల ఉండాలంటే జిడిపిలో 4.9 శాతం చాలదు, 7.5 శాతం కావాలి. ఆర్థిక సర్వే సూచించినట్టు సార్వత్రిక ప్రాథమిక వేతనాన్ని అమలు చేసేటప్పుడు ఇతర సబ్సిడీలకు కోత పెట్టడం జరిగితే అప్పుడు సాలుకి రూ. 7620 సరిపోదు. సార్వత్రిక ప్రాథమిక వేతనాన్ని అమలు చేయడానికి వచ్చిన ఇతర సూచనలు చాలా పరిమితలక్ష్యాలతో ఉన్నాయి.
ఒకవేళ ఈ సార్వత్రిక ప్రాథమిక ఆదాయం విధానాన్ని అమలు చేయడానికి పార్లమెంటులో ఒక చట్టాన్ని తీసుకు వచ్చి, అందులో పెరిగే ధరలకు అనుగుణంగా చెల్లింపులు పెంచాలన్న నిబంధనను కూడా విధిస్తే (ఇప్పుడు ఉపాధిహామీ చట్టంలో ఉన్నట్టు) అప్పుడు ప్రభుత్వం విద్య, వైద్యం తదితర పద్దుల్లో కోత పెట్టి ఈ విధానాన్ని అమలు చేస్తుంది. అప్పుడు పేదల దగ్గర ప్రభుత్వం ఇచ్చిన సార్వత్రిక ప్రాథమిక ఆదాయం అయితే ఉంటుంది కాని, వాళ్ళ బిడ్డల్ని ఉచితంగా చదివించే స్కూళ్లుగాని, వాళ్ళ రోగాలకి ఉచితంగా వైద్యం చేసే ఆస్పత్రులు గాని ఉండవు. ఒకవేళ ప్రయివేటు స్కూళ్ళకు, ప్రయివేటు ఆస్పత్రులకు పోతే ప్రభుత్వం సార్వత్రిక ప్రాథమిక ఆదాయం కింద ఇచ్చిన సొమ్ము కాస్తా వాటికే పోతుంది. అప్పుడు వారి వినిమయ శక్తి తగ్గిపోతుంది. సార్వత్రిక ప్రాథమిక ఆదాయం విధానాన్ని ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరదు. అందరికీ ప్రాథమిక వేతనాన్ని పొందే హక్కు కల్పించే చట్టాన్ని తెచ్చినా, అందుకోసం ప్రభుత్వం అందించే నగదు బదిలీల నిమిత్తం ఇతర సబ్సిడీలలో విధించే కోతల కారణంగా ఆ చట్టం నిరుపయోగం అవుతుంది.
అందుచేత సార్వత్రిక ప్రాథమిక ఆదాయాన్ని పొందే హక్కును ఒక చట్టంగా చేయడం కన్నా, ప్రజలకు కొన్ని కనీస హక్కులను గ్యారంటీ చేసే చట్టాలను తీసుకురావడం ఎక్కువ ఉపయోగం. నాణ్యత కల విద్యను ఉచితంగా పొందే హక్కు, నాణ్యత కలిగిన విద్య, సేవలను ఉచితంగా పొందే హక్కు, ఉపాధి పొందే హక్కు, ఉచితంగా వృద్ధాప్య పెన్షన్ పొందే హక్కు, అంగవైకల్యానికి పరిహారం పొందే హక్కు వగైరా హక్కులను కల్పిస్తూ చట్టాలు తీసుకురావడం అవసరం. నిజానికి సార్వత్రిక ప్రాథమిక వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదన దేనికి? ఆ పేదలు విద్య, వైద్యం, వగైరాలను పొందడానికే కదా? అటువంటప్పుడు ఆయా హక్కులను కల్పించే చట్టాలను చేయడం ప్రయోజనకరం ఔతుంది కాని, సార్వత్రిక ప్రాథమిక ఆదాయాన్ని ఇస్తూ అందుకోసం విద్య, వైద్యం తదితర హక్కులలో కోతలు పెట్టడం వలన ఏమిటి ఉపయోగం?అందుచేత సార్వత్రిక ప్రాథమిక ఆదాయం అనే భావన చాలా సదుద్దేశ్యంతో కూడినదైనప్పటికీ, అది బొత్తిగా అర్ధం లేనిది. నిజంగా దేశంలో ప్రజల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలనుకుంటే, అప్పుడు వైద్యం, విద్య, ఉపాధి తదితర హక్కులను కల్పించే చట్టాలను చేయడమే గాక, సంక్షేమానికి కేటాయింపులను బాగా పెంచాల్సి వుంటుంది. ఆర్థిక సర్వే సూచించిన మొత్తం ఏ మూలకూ చాలదు. ఆహార హక్కు, ఉపాధి హక్కు ( లేదా ఉపాధి దొరికేదాకా కనీస వేతనం) నాణ్యత కల వైద్యం పొందే హక్కు, నాణ్యత కల విద్య పొందే హక్కు, వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ పొందే హక్కు- ఈ అయిదింటినీ కల్పించాలంటే అందుకు మన జిడిపిలో కనీసం 10 శాతం కేటాయించడం అవసరం. అందుకోసం ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కనీసం 7శాతం మేరకు పెంచాలి (తక్కిన 3 శాతం ప్రజలు చేసే ఖర్చు పెరిగినందు వలన లభిస్తుంది.).
అదనంగా 7 శాతం పన్నులు పెంచడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. సంపన్నుల మీద అదనపు పన్నులు వేయగలగాలి. అంతే. అత్యంత సంపన్నులైన ఒక్క శాతం జనాభా మీద సంపద పన్ను 2 శాతం చొప్పున అదనంగా విధించాలి. వారసత్వంగా ఆస్థి సంక్రమించినప్పుడు (ఈ ఒక్క శాతం జనాభాలోనే) అందులో 33.33 శాతం వారసత్వ పన్నుగా విధించాలి. ఈ రెండు పన్నులూ చాలు. దేశం మొత్తం మీద పైన చెప్పిన 5 హక్కులనూ అమలు చేయడానికి సరిపడా ధనం సమకూరుతుంది. ఐతే అప్పుడు మన దేశం సంక్షేమ రాజ్యం ఔతుంది. ఆ విధంగా మార్చడం ఈ బూర్జువా వ్యవస్థ శక్తికి మించిన పని. బూర్జువా వ్యవస్థ పరిధిని దాటని ఉదారవాద ఆర్థికవేత్తల అవగాహనకు అందని వ్యవహారం ఇది.
– (స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్