
నవతెలంగాణ – డిచ్ పల్లి
భారత విప్లవ వేగుచుక్క కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా పీడీఎస్ యూ, పివైఎల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణయూనివర్సిటీ లోని ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా పిడిఎస్ యూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నామాల ఆజాద్ పాల్గొని మాట్లాడుతూ..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విద్యను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని చూస్తుందన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చిందని విమర్శించారు. స్వదేశంలో కూడా ఆదాని, అంబానీ, టాటా లాంటి కార్పొరేట్ సంస్థలకు విశ్వవిద్యాలయాలు పెట్టుకునేందుకు వెసులుబాటు కల్పించిందన్నారు. ఈ విధానాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ధ్వంసం చేయడానికి తీసుకుంటున్న చర్యలని విమర్శించారు. విద్యను కాషాయీకరణ వైపు తీసుకువెళుతుందన్నారు. శాస్త్రీయమైన ఆలోచనలను, దూరం చేసెందుకు విద్యార్థుల మెదల్లో మత భావాలతో కూడిన పాఠ్యాంశాలను జాతీయ నూతన విద్యా విధానం పేరుతోను తీసుకొస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా వ్యతిరేక సంస్కరణలను వ్యతిరేకించాలని భగత్ సింగ్ చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నూతన విద్యావిధానం పేరుతో యూనివర్శీటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆరెస్సెస్ ఎజెండా అమలుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని, ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నవారినే యూనివర్శీటీలలో నియమాకాలు చేస్తుందని వారు దుయ్యబట్టారు. నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేసిన బిజెపి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. తె.యూ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం10% శాతం బడ్జెట్ కేటాయింపులు చేయకుండా, జిడిపిలో 6% శాతం నిధులు కేటాయించకుండా ఎలా నూతన విద్యావిధానం అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా, ఫెలోషిప్స్ విడుదల చేయకుండా, ఖాళీలు భర్తీ చేయకుండా ప్రభుత్వ విశ్వవిద్యలయాలపై కేంద్ర ప్రభుత్వం అక్కసుతో కూడిన దాడికి పాల్పడుతున్నారన్నారు. తె.యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దత్తహరి మాట్లాడుతూ యూనివర్శీటీలలో ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా చేయడంపై విద్యార్ధులు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.సదస్సుకు పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ అధ్యక్షత వహించారు. ఈ సభలో పివైఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనీష్, నవీన్, పిడిఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్,కోశాధికారి నిఖిల్, నాయకులు మమత, మహేష్, అజయ్,ముస్తాఫ విద్యార్థులు పాల్గొన్నారు.