– కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
– ములుగు అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించాలి : పంచాయతీరాజ్, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
– జాకారంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ -ములుగు
గిరిజనుల్లో 100కు వంద అక్షరాస్యత సాధించేందుకు ములుగు జిల్లా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఉపయోగపడుతుందనికేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గిరిజన ప్రాంతంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభించుకోవడం సంతోషకరమని చెప్పారు. ములుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్‌ను రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ కవితతో కలిసి శుక్రవారం కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనుల అక్షరాస్యత 49 శాతం శాతంగా ఉందని, గిరిజన మహిళల్లో 39 శాతంగా ఉందని, 100కు 100 శాతం అక్షరాస్యత శాతం పెంచేందుకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సమ్మక్క-సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కోసం కేంద్రం రూ.889.07 కోట్లు కేటాయించిందన్నారు. 2024- 25 విద్యా సంవత్సరం నుంచి జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో రెండు కోర్సులతో తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రవేశం కోసం స్థానిక యువత దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 35 శాతం గిరిజన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారన్నారు. యూనివర్సిటీ నిర్మాణానికి ప్రధాని మోడీ సీఎం, రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయడానికి సన్నాహాలు చేయాలని అధికారులకు చెప్పారు. యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణ పనుల కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు టూరిజం, ఎడ్యుకేషన్ హబ్‌గా ఏర్పడుతుందన్నారు. ములుగు జిల్లాలో అనేక టూరిజం ప్రాంతాలు ఉన్నాయని, దేశం నలుమూలల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మహబూబాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఏర్పాటుతో స్థానిక గిరిజన యువతకు విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి శరత్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ షబరీష్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఆర్‌డిఓ సత్యపాల్ రెడ్డి, తుకారాం పోరిక(కంట్రోలర్, ఎగ్జామినేషన్), డాక్టర్ వంశీకృష్ణరెడ్డి(ఓఎస్డి), హనుమంతరావు (యూనివర్సిటీ ఇంజినీరింగ్), డాక్టర్ సంజరుకుమార్ శర్మ(డైరెక్టర్ ఐటి), అభిషేక్ కుమార్ (డిప్యూటీ రిజిస్ట్రార్), మహమ్మద్ అలీ బెగ్ (స్తిస్టం అనాలసిస్ట్) పాల్గొన్నారు.