జడలు విప్పిన మతోన్మాదం

 Unraveled fanaticism– హర్యానాలో ఐదుగురు మృతి…పలువురికి గాయాలు
– మసీదు, వాహనాలకు నిప్పు
– నూహలో కర్ఫ్యూ…గురుగ్రామ్‌లో 144వ సెక్షన్‌

చండీఘర్‌ : హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన మతపరమైన హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. నూహ జిల్లాలో సోమవారం వీహెచ్‌పీ నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. ర్యాలీలో పాల్గొన్న వారు మార్గమధ్యంలో ముస్లింలతో ఘర్షణకు దిగారు. ఆందోళనకారులు వందలాది వాహనాలను తగలబెట్టారు. నూహ పొరుగున ఉన్న గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, పల్‌వాల్‌ జిల్లాలకు కూడా అల్లర్లు వ్యాపించాయి. నూహలో కర్ఫ్యూ విధించగా గురుగ్రామ్‌లో 144వ సెక్షన్‌ అమలులో ఉంది. సోమవారం చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు హోం గార్డులు సహా నలుగురు చనిపోయారు. అనేకమంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో సాద్‌ అనే వ్యక్తి మంగళవారం చనిపోవడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
నూహలో చెలరేగిన హింస తొలుత గురుగ్రామ్‌కు పాకింది. అక్కడ సెక్టార్‌ 57లోని ఓ మసీదుకు మతోన్మాదులు నిప్పుపెట్టారు. మారణాయుధాలతో అర్థరాత్రి స్వైరవిహారం చేసిన దుండగులు ముందుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చనిపోయాడు. అతనిని బీహార్‌కు చెందిన సాద్‌గా గుర్తించారు. నూహలో చెలరేగిన హింసాకాండలో తీవ్రంగా గాయపడిన హోం గార్డులు నీరజ్‌, గురుసేవక్‌ ఆ తర్వాత ప్రాణాలు విడిచారు. అల్లర్లలో భదాస్‌ గ్రామానికి చెందిన శక్తి కూడా చనిపోయాడు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది.
నూహ అల్లర్లలో పది మంది పోలీసులు సహా మొత్తం 23 మంది గాయపడ్డారు. జిల్లాలో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 27 మందిని అరెస్ట్‌ చేశారు. జిల్లాలో జరిగిన హింసాకాండలో కనీసం 120 వాహనాలు ధ్వంసమయ్యాయి. వీటిలో పోలీసులకు చెందిన ఎనిమిది వాహనాలు సహా యాభై వాహనాలు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. ముస్లింలు అధికంగా నివసించే నూహలో హింస చెలరేగిందన్న వార్తలు ఇతర ప్రాంతాలకు వ్యాపించడంతో సోహ్నాలో అల్లరి మూకలు రెచ్చిపోయి నాలుగు వాహనాలకు, ఓ దుకాణానికి నిప్పు పెట్టారు. నూహ, సోహ్నాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పోలీసులు, పారామిలటరీ దళాలను పెద్ద ఎత్తున మోహరించారు. నూహలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నదని అధికారులు తెలిపారు. ఇప్పటికే 13 కంపెనీల కేంద్ర బలగాలను అక్కడికి పంపారు. మరో ఆరు కంపెనీలను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నూహలో హింసాకాండ, గురుగ్రామ్‌లో మసీదు దగ్థం నేపథ్యంలో ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. నూహ, ఫరీదాబాద్‌లలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలను మూసివేశారు.
హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. నూహలోని ఖెడ్లా మాద్‌ ప్రాంతంలో జరుగుతున్న ప్రదర్శనను కొందరు అడ్డుకోవడంతో అల్లర్లు చెలరేగాయని పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. ముస్లింలపై రాళ్లు రువ్వారని, వారికి చెందిన పలు వాహనాలను తగలబెట్టారని వివరించారు. కాగా బజరంగ్‌దళ్‌కు చెందిన ఓ కార్యకర్త సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన వీడియోను పోస్ట్‌ చేయడంతో ఉద్రిక్తత చెలరేగిందని నూహకు చెందిన పలువురు చెప్పారు. అర్థరాత్రి సమయంలో దుండగులు తుపాకులు, లాఠీలు, కర్రలు పట్టుకొని మసీదు వద్దకు వచ్చి బీభత్సం సృష్టించారని మసీదు కమిటీ సభ్యుడు మహమ్మద్‌ అస్లాం చెప్పారు. ‘బహిరంగ ప్రదేశాలలో నమాజ్‌ చేయడంపై గతంలో కొందరు హిందూత్వ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గురుగ్రామ్‌లోని ఈ మసీదులో మాత్రమే మేము ఎలాంటి ఆటంకాలు, బెదిరింపులు లేకుండా ప్రార్థనలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది కూడా కాలి బూడిదైంది’ అని గురుగ్రామ్‌ ఏక్తా మంచ్‌ ప్రతినిధి అల్టాప్‌ అహ్మద్‌ అవేదన వ్యక్తం చేశారు.
ముంబయిలోని ఓ రైలులో రైల్వే రక్షణ దళానికి చెందిన కానిస్టేబుల్‌ ఒకరు ముగ్గురు ముస్లింలపై కాల్పులు జరిపి హతమార్చిన సంఘటన హర్యానాలో చెలరేగిన హింసాకాండకు ప్రేరణ కలిగించి ఉండవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముగ్గురిపై కాల్పులు జరపడానికి ముందు అతను తన సీనియర్‌ అయిన గిరిజన అధికారిని కూడా తన తూటాలకు బలి చేశాడు. అరెస్ట్‌ చేసిన అనంతరం ఆ కానిస్టేబుల్‌ ముస్లింలకు వ్యతిరేకంగా మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది.