– 24 గంటల్లో భారీ సంఖ్యలో లక్ష్యాలపై దాడులు
– సిరియాలో అమెరికా దాడులు…
– ఉద్రిక్తతలకు ఆజ్యం
జెరూసలేం : గాజాపై రెండోసారి భూతల దాడికి ఇజ్రాయిల్ దిగింది. గాజా నగర శివార్లలోని లక్ష్యాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు, డ్రోన్‌లు దాడులకు పాల్పడ్డాయని మిలటరీ శుక్రవారం తెలిపింది. గాజాపై తీవ్రస్థాయిలో, పెద్ద ఎత్తున పదాతిదాడులు జరపాలని ఇజ్రాయిల్ సైన్యం సిద్ధమై, గురువారం తెల్లవారుజామున మొదటిసారిగా భూతల ఆపరేషన్ మొదలుపెట్టింది. గత 24గంటల్లో తమ పదాతి దళాలు గాజాలో డజన్ల సంఖ్యలో మిలిటెంట్ లక్ష్యాలపై దాడులు చేసినట్లు మిలటరీ ప్రకటించింది. గాజా శివారులోని షిజయాపై ఇజ్రాయిల్ విమానాలు, శతఘ్నులు బాంబు దాడులు జరిపాయి. తమ సైనికులు దాడులు ముగిసిన తర్వాత ఎలాంటి నష్టం జరగకుండానే సరిహద్దు దాటి వచ్చేశారని మిలటరీ తెలిపింది. గురువారం తెల్లవారు జామున ఉత్తర గాజాలో చేపట్టిన ఆపరేషన్ కొద్ది గంటల పాటు సాగింది. శత్రువును బయటకు వచ్చేలా చేయడం ఈ దాడుల లక్ష్యమని, మిలిటెంట్లను హతమార్చి, పేలుడు పదార్ధాలను, లాంచ్‌పాడ్‌లను తొలగించారని ఇజ్రాయిల్ మిలటరీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. తదుపరి దశ యుద్ధానికి తగినట్లుగా పరిస్థితులను సన్నద్ధం చేయడం ఈ ఆపరేషన్ లక్ష్యమని చెప్పారు. గత మూడు వారాలుగా గాజాలో కొనసాగుతున్న విధ్వంసకాండ, బాంబు దాడులతో జరుగుతున్న వినాశనం ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. పలు ప్రాంతాలకు సంబంధించి యుద్దానికి ముందు, ఇటీవలి రోజుల్లో తీసిన ఫోటోలు చూస్తుంటే విధ్వంసం ఏ స్థాయిలో వుందో స్పష్టమవుతోంది. వరుసగా వున్న నివాస భవనాలు ఒక్కసారి కనుమరుగై కేవలం దుమ్ము ధూళితో కూడిన శిధిలాల గుట్టగా మారడం ఆ ఫోటోల్లో కనిపిస్తోంది.
ఇదిలావుండగా, మరోవైపు అమెరికా యుద్ధ విమానాలు తూర్పు సిరియాలోని లక్ష్యాలపై దాడులు చేశాయని పెంటగన్ ప్రకటించింది. దాడులు జరిగిన రెండు ప్రాంతాలు మిలిటెంట్లకు ఇరాన్ ఆయుధాలు అందించే ప్రాంతాలేనని సిరియా ప్రతిపక్ష కార్యకర్తలు తెలిపారు. దాడులకు ముందుగా ఆ ప్రాంతాల నుండి ప్రజలను ఖాళీ చేయించారు. మూడు వారాల నుండి కొనసాగుతున్న గాజా యుద్ధంతో ఇప్పటికే పెచ్చరిల్లుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఈ దాడులు ఆజ్యం పోశాయి. ఇజ్రాయిల్‌తో గల సరిహద్దులోని తాబా పట్టణంలోని మెడికల్ బిల్డింగ్‌పై రాకెట్ దాడితో ఆరుగురు గాయపడ్డారని ఈజిప్ట్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
ఇజ్రాయిల్ విచక్షణారహితంగా పాశవిక దాడులు కొనసాగిస్తుండడంతో ఇప్పటికే 7వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. గురువారం మరణించిన వారి పేర్లు, ఐడి నెంబర్లతో ఒక జాబితాను పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మృతి చెందిన వారిలో 2,900మంది మైనర్లు కాగా, 1500మందికి పైగా మహిళలు వున్నారు. గతంలో ఇజ్రాయిల్, హమస్ మధ్య సాగిన ఘర్షణలు, యుద్ధాల్లో మరణించిన వారి కన్నా ఈసారి ఎక్కువమంది మరణించారు. గాజాలో ఎక్కువ భాగం నేలమట్టమై, ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. ఇప్పటికే 10లక్షల మందికి పైగా తమ ఇండ్లను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.