విదేశీ మారకం నిల్వల్లో ఆగని పతనం

Unrelenting fall in foreign exchange reserves– మరో 4.11 బిలియన్‌ డాలర్లు తగ్గుదల
– ఎనిమిది నెలల కనిష్టానికి క్షీణత
ముంబయి : భారత విదేశీ మారకం నిల్వల పతనం కొనసాగు తోంది. వరుసగా నాలుగో వారంలో నూ క్షీణించాయి. ప్రస్తుత ఏడాది డిసెంబర్‌ 27తో ముగిసిన వారంలో మారకం నిల్వలు 4.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.35వేల కోట్లు విలువ) తరిగిపోయి 640.28 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యా యి. దీంతో ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయిన ట్లయ్యిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఓ రిపోర్ట్‌లో తెలిపింది. అంతకు ముందు మూడు వారాల్లో ఫారెక్స్‌ రిజర్వ్‌ నిల్వలు 13.7 బిలియన్‌ డాలర్లు పైగా క్షీణించాయి. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 85 దిగువకు పడిపోవడంతో విదేశీ మారకం నిల్వలపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైనప్పటి నుంచి భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల భారీగా తరలిపోవడంతో పాటుగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి దాదాపు రెండేండ్ల కనిష్టానికి దిగజారడం, రూపాయి విలువ పడిపోవడం విదేశీ మారకం నిల్వలు కరిగిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరులో పారెక్స్‌ రిజర్వ్‌ నిల్వలు 704.885 బిలియన్‌ డాలర్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకాయి. కేవలం గడిచిన మూడు నెలల్లోనే రూ.5.20 లక్షల కోట్ల విలువ చేసే 65 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకం నిల్వలు కరిగిపోవడం ఆందోళనకరం. డిసెంబర్‌ 27 నాటి వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 551.9 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. బంగారం రిజర్వులు 541 మిలియన్‌ డాలర్లు తగ్గి 66.268 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద భారత్‌ రిజర్వ్‌ నిల్వలు యథాతథంగా 4.217 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆర్బీఐ వద్ద విదేశీ మారకం నిల్వలు భారీగా క్షీణించనున్నాయి. దీంతో విదేశీ రుణాలు, వాణిజ్య చెల్లింపులకు కటకట ఏర్పడే ప్రమాదం ఉంది.