మణిపూర్‌లో ఆగని హింస

Unrelenting violence in Manipur– గృహ దహనాలు…సెక్యూరిటీ గార్డు నుండి ఆయుధాల అపహరణ
ఇంఫాల్‌ : మణిపూర్‌లో హింసాకాండ చల్లారడం లేదు. రాజధాని ఇంఫాల్‌లో ఆదివారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో మూడు ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. సెక్యూరిటీ సిబ్బంది నుండి ఆయుధాలు అపహరిం చారు. ఆ ఇళ్లలో ప్రస్తుతం ఎవరూ నివసించకపోవ డంతో ప్రాణనష్టం తప్పింది. ఇళ్లు తగలబడి పోతున్న దృశ్యాలు చూసి స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆ ప్రాంతంలో వెంటనే రాష్ట్ర, కేంద్ర దళాలను మోహరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు భాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. మరో ఘటనలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ డైరెక్టర్‌ కె.రాజో ఇంటికి కాపలా కాస్తున్న భద్రతా సిబ్బంది నుండి గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఆయుధాలు అపహరించారు. ఇంఫాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సగోల్‌బంద్‌ బిజోరు గోవింద ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఆయుధాలలో రెండు ఏకే సిరీస్‌ తుపాకులు, ఒక కార్బైన్‌ ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. నిందితులను పట్టుకొని, ఆయుధాలను స్వాధీనం చేసుకొనేందుకు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. తాజా ఘటనలపై రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు మేఘచంద్ర స్పందిస్తూ ఘర్షణలు ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకూ హింసాకాండ చల్లారలేదని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు రాజధాని ఇంఫాల్‌లో ఈ ఘటనలు జరిగాయని గుర్తు చేస్తూ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఈ సంఘటనలు నిరూపించాయని ఆయన అన్నారు.