– ఇంఫాల్‌లో ఘటన
ఇంఫాల్ : మణిపూర్‌లో అల్లర్లకు అడ్డుకట్ట పడటం లేదు. ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని మానవ హక్కుల కార్యకర్త బబ్లూ లోయిటాంగ్‌బామ్ ఇంటిని ఒక గుంపు ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కానప్పటికీ కొంత ఆస్తి నష్టం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని క్వాకీథెల్ థియామ్ లైకైలోని లోయిటాంగ్‌బామ్ నివాసంలో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబరు మొదటి వారం నుంచి లోయిటాంగ్‌బామ్ స్వయంగా ఇంఫాల్ నుంచి బయటికి వచ్చారు.
గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో లోయిటాంగ్‌బామ్ మెయిటీ లీపున్, అరంబై టెంగోల్ అని పిలువబడే కొన్ని కొత్త సమూహాల ఆవిర్భావాన్ని ఎత్తి చూపారు. మణిపూర్‌లో హింసాకాండకు గల కారణాలను చర్చిస్తున్నప్పుడు, ఈ గ్రూపులు మెయిటీ సమాజంలోకి ఉగ్రవాదాన్ని చొప్పించాయని అన్నారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పాత్రపై ఆయన నిరంతరం విమర్శలు చేస్తూనే, ఆయన రాజీనామాకు పిలుపునిచ్చారు. మీటీ లీపున్‌కు చెందిన లాంజింగ్ హంజాబా మీడియాతో మాట్లాడుతూ.. లోయిటాంగ్‌బామ్, తౌనోజామ్ హింసను ప్రేరేపించారని సంస్థపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు.