3,146 తండాలు, గూడేలు పంచాయతీలుగా మార్పు గురుకులాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య మెరుస్తున్న గిరిజన ఆవాసాలు
”పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధికి నిష్పక్షపాతంగా రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తోంది. ఆదివాసీ గిరిజనులకు ముఖ్యమంత్రి భారీ స్థాయిలో నిధులు కేటాయిం చారు. ఎన్నో దశాబ్దాల అణచివేతకు, ఆర్ధికంగా వెనుకబాటు కు గురైన ఆదివాసీలు, బంజారాలు ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగేందుకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోటాను పెంచారు. వారి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి తగిన నిధులు ప్రభుత్వం కేటాయించింది. గిరిజన గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం
సానుకూలంగా స్పందించి. రాష్ట్రంలోని 3,146 తండాలు, గూడేలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించాము. ఆ పంచాయతీల్లో రూ.1,897.08 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కోసం రూ. 300 కోట్లు ఎమ్‌ఎఎస్డీఎఫ్ కింద ప్రత్యేక నిధులను ఈ ఏడాది కేటాయించాము” అంటూ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నవతెలంగాణ ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వూ…. ఈ వివరాలు మానవి పాఠకుల కోసం…
విద్యాభివృద్ధి కోసం చేస్తున్న కృషి?
గిరిజన విద్యార్థుల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా 92 గురుకుల విద్యాలయాలను నెలకొల్పింది. వీటిలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, ఫైన్ ఆర్ట్స్, లా కాలేజీలు, సైనిక్ స్కూల్, కాలేజ్ ఆఫ్ ఎక్స్టెన్స్ సహా పలు విద్యా సంస్థలను నెలకొల్పింది. గురుకుల భవనాల నిర్మాణానికి రూ. 292 కోట్లు కేటాయించింది. గురుకులాల్లో శిక్షణ పొందిన వందలాది మంది ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకున్న వారికి ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున రూ.33.49 కోట్లు అందజేసింది.
దశాబ్ది ఉత్సవాల ప్రత్యేకత ఏంటి?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పదేండ్లు నిండిన సందర్భంగా ప్రభుత్వం ఈ కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా మరో సారి ప్రజలకు వివరిస్తాం. ఉత్సవాలను పండుగలా నిర్వహిస్తాం. పదేండ్ల ప్రగతిని చాటుతాం. అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తాం. గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో ప్రణాళిక రూపొందించాం. గిరిజన విద్యాలయాల్లో సంబురాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. గిరిజనుల సాంస్కృతిక ఉత్సవాలు, ఆర్ట్ ఫ్రేమ్‌ల ప్రదర్శన, గిరిజనుల ఉత్పత్తుల వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం.
రైతు బీమా పథకం ద్వారా 4,93,720 మంది ఎస్టీ రైతులకు ప్రభుత్వమే రూ.6.11 కోట్ల ప్రీమియం చెల్లించి ఉచిత బీమా సదుపాయం కల్పించింది.ఆసరా పథకం ద్వారా 3,75,816 మంది గిరిజనులకు రూ.4.286 కోట్ల పింఛన్ మొత్తాన్ని అందించింది. కల్యాణలక్ష్మి పథకం ద్వారా 1,38,730 మంది గిరిజన ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం రూ.1,126.61 కోట్లను అందించింది. ఎస్టీల నివాస గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసీ గిరిజనుల వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా కోసం రూ.221 కోట్లు ఖర్చుచేసింది..
ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏంటి?
ఆదివాసీ గిరిజనుల అభివృద్దే ధేయంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమాలు చేపట్టింది. పల్లెప్రగతిలో భాగంగా అన్ని గిరిజన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను సమకూర్చింది. పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాలతో సహా అధునాతన వసతులను కల్పించింది. రాష్ట్రంలోని 1,082 గిరిజన ఆవాసాలలో రూ.1,270 కోట్లతో బీటీ రోడ్లు వేసింది. ఈ ఏడాది 2000 గిరిజన పల్లెల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయించింది. అత్యంత వెనకబడిన ఆదివాసీ తెగలు నివసిస్తున్న గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థల నిర్మాణానికి ప్రత్యేక నిధుల కింద రూ. 133 కోట్లు కేటాయించింది.
గిరిజన ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా రక్షితతాగు నీటిని అందిస్తున్నది. ఏజెన్సీ ఏరియాల్లో విషజ్వర మరణాలు అరికట్టడంలో సఫలీకృతమైంది. ఎస్టీ మహిళలు 2,28,089 మంది రూ.151 కోట్ల విలువైన కేసీఆర్ కిట్లు పొందారు. గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేకంగా గిరిపోషణ పథకాన్ని అమలుచేస్తున్నది. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 821 ఆవాసాలలో పౌష్టికాహారాన్ని అందిస్తున్నది.
పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తామంటున్నారు ఎలా సాధ్యం?
ఆదివాసీ గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం సీఎంఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నొవేషన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ)లో ఈ పథకం కోసం ఎంపికైన అర్హులకు ఉచితంగా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 162 మందికి లబ్ధి చేకూరింది. అలాగే డ్రైవర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం రూరల్ ట్రాన్స్‌ఫోర్ట్ పథకం కింద సుమారు రూ.101.50 కోట్లు వెచ్చించి 1,424 మంది గిరిజన యువకులకు వాహనాలను సమకూర్చి ఉపాధి కల్పించింది.
సంక్షేమ పథకాలు సక్రమంగా అందటం లేదన్న విమర్శ ఉంది?
ఇందులో వాస్తవం లేదు. అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగానే అందుతున్నాయి. రైౖతుబంధు పథకంలో భాగంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 8.21,780 మంది రైతులకు రూ.7,354 కోట్ల పంట పెట్టుబడిని అందించింది. రైతు బీమా పథకం ద్వారా 4,93,720 మంది ఎస్టీ రైతులకు ప్రభుత్వమే రూ.6.11 కోట్ల ప్రీమియం చెల్లించి ఉచిత బీమా సదుపాయం కల్పించింది. ఆసరా పథకం ద్వారా 3,75,816 మంది గిరిజనులకు రూ.4.286 కోట్ల పింఛన్ మొత్తాన్ని అందించింది. కల్యాణలక్ష్మి పథకం ద్వారా 1,38,730 మంది గిరిజన ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం రూ.1,126.61 కోట్లను అందించింది. ఎస్టీల నివాస గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. మారు మూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసీ గిరిజనుల వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా కోసం రూ.221 కోట్లు ఖర్చుచేసింది..