– కీలక పాత్ర పోషించాలంటూ జీ-20 దేశాలకు యూఎన్ క్లైమేట్ చీఫ్ వినతి
బాకూ : వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వర్ధమాన దేశాలకు అవసరమైన నిధులను సమీకరించడానికి ఒప్పందం కుదుర్చుకునే దిశగా కాప్ 29 చర్చలు ముందుకు సాగేలా చూడాలని ఐక్యరాజ్య సమితి(యూఎన్) వాతావరణ విభాగ చీఫ్ సిమన్ స్టెయిల్ శనివారం జీ20 దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఒప్పందానికి జరగాల్సిన కసరత్తు ఇంకా చాలా వుందని ఆయన హెచ్చరించారు. బాకూలో జరుగుతున్న వాతావరణ సదస్సులో నిధి ఏర్పాటు విషయంలో నేతల మధ్య విభేదాలు ఇంకా తొలగిపోలేదు. వాటిని పరిష్కరించుకోవడానికి ఆదివారం రాత్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. వచ్చే వారం మంత్రులు కూడా హాజరు కానున్నప్పటికీ ప్రధాన అంశాలపై విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సిమన్ మాట్లాడుతూ.. సోమవారం నుంచి బ్రెజిల్‌లో సమావేశమవుతున్న జీ20 నేతలు ఈ విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగే దేశాలు, అలాగే కాలుష్య కారక జాబితాలో కూడా అగ్ర స్థానంలో వున్న దేశాలు జీ20లో వున్నాయి. రియో డీ జెనీరోలో జీ20 నేతలందరూ సమావేశమవుతున్న వేళ.. ఆర్థిక అగ్రగామి దేశాల కీలకాంశం వాతావరణ కార్యాచరణే కాగలదన్న బలమైన సంకేతాలను ఈ సదస్సు ఇవ్వగలదని ఆశిస్తున్నామని, యావత్ ప్రపంచం అందుకోసం ఆతృతగా ఎదురుచూస్తోందని సిమన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు.
వాతావరణ కాలుష్యానికి కారణం కాకపోయినా దానితో కలిగే మార్పులతో ఇబ్బందులు పడుతున్న పేద, వర్ధమాన దేశాలు ఏడాదికి 1.3 ట్రిలియన్ల డాలర్ల మేరకు సాయమందించాలని కోరుతున్నాయి. అంటే ప్రస్తుతం అమెరికా, యురోపియన్ యూనియన్, జపాన్‌లు చెల్లిస్తున్న మొత్తాలకు 10రెట్ల కన్నా ఎక్కువే. ఎవరు చెల్లించాలి, ఏ తరహాలో నిధులు అందించాలి, చివరగా ఎంత మొత్తం వుండాలనే కీలక అంశాలపైనే ప్రతిష్టంభన నెలకొంది. చైనా, సంపన్న గల్ఫ్ దేశాలు కూడా దాతల జాబితాలో చేరాలని అభివృద్ధి చెందిన దేశాలు కోరుతున్నాయి.
మార్పులు, చేర్పులతో చివరగా రూపొందించిన ముసాయిదా 25పేజీలు ఉన్నది. ఇందులో కూడా అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా ఒప్పందంపై కసరత్తు కొనసాగుతునే ఉన్నది. అయితే, ఇప్పటికే సగం రోజులు గడిచిపోయిన అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉన్నదని సిమన్ చెప్పారు. ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉన్నదని హెచ్చరించారు.