అధర్మధర్మం

 Sampadakiyamతమ విద్వేష ఎజెండా అమలుకు, ఉన్మాద చర్యలకు అడ్డొచ్చిన వారిని బీజేపీ, ఆరెస్సెస్‌ పరివారం ఏ విధంగా కక్షకట్టి వేటాడి వెంబడించి చిత్రవధలకు గురిచేస్తాయో గుజరాత్‌ మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ ఉదంతం తిరుగులేని ఉదాహరణ. ఆలిండియా సర్వీస్‌ పోలీస్‌ అధికారికే ఇంతటి ఘోర అనుభవం ఎదురైందంటే, ఇక సాధారణ వ్యక్తుల పరిస్థితేంటో తలచుకుంటే భయం కలుగుతుంది. దాదాపు 27 సంవత్సరాల కింద పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితుడిని నేరం ఒప్పుకోవాలని ప్రమాదకర ఆయుధాలతో, కరెంట్‌ షాక్‌లతో టార్చర్‌ పెట్టారన్న కేసులో సంజీవ్‌ భట్‌ను నిర్దోషిగా గుజరాత్‌లోని పోర్‌బందర్‌ అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఇటీవల ప్రకటించింది. ప్రాసిక్యూషన్‌ సందేహింపజాలని సాక్ష్యాధారాలు చూపలేక పోయిందని, ఒక ప్రభుత్వ అధికారి ప్రాసిక్యూషన్‌కు సరైన అనుమతి తీసుకోలేదని కోర్టు తప్పుబట్టింది. కాగా రెండున్నర దశాబ్దాలకుపైన తనపై నమోదైన అభియోగాలు తప్పుడువని నిరూపించుకోడానికి పోలీస్‌ అధికారి భట్‌ పడ్డ వ్యయప్రయాసలు, ఎదుర్కొన్న మానసికవ్యధ మాటల్లో చెప్పలేం. ఇక్కడితోనే న్యాయపోరాటం ఆగిపోయిందని కాదు. భట్‌ పూర్తిగా బయటపడ్డారనుకోవడానికి వీల్లేదు.
ఎంతటి వారినైనా బీజేపీ ఏ రకంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తుందో భట్‌ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. 1994లో ఆర్‌డిఎక్స్‌, ఇతర భయంకర అక్రమ ఆయుధాల ల్యాండింగ్‌పై పోలీసులు 22 మందిపై టాడా కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు. అహ్మదాబాద్‌ సబర్మతి జైలులో ఉన్న నరన్‌ జాదవ్‌, ఇతర నిందితులను 1997లో పి.టి. వారెంట్‌పై పోర్‌బందర్‌కు విచారణకై తరలించారు. అక్కడ పోలీస్‌ కస్టడీలో నేరం ఒప్పుకోవాలంటూ ఎస్‌పిగా ఉన్న భట్‌, కానిస్టేబుల్‌ వాజుభాయి చౌ తమను టార్చర్‌ చేశారని నిందితుడు నరన్‌ జాదవ్‌ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశాడు. కొన్నేళ్ల విచారణ అనంతరం 2013లో భట్‌, చౌలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. తీర్పు వచ్చేలోపు కానిస్టేబుల్‌ చౌ చనిపోయాడు. ఉగ్రవాద నిరోధక చట్టం టాడా కేసులోని నిందితుడి ఫిర్యాదుపై ఇన్నేళ్లు ఒక ఐపిఎస్‌ అధికారిపై కేసు నడవడం స్థానిక బీజేపీ ప్రభుత్వ ప్రోద్భలం లేకుండా అసంభవం. 61 సంవత్సరాల మాజీ ఐపిఎస్‌ మరో రెండు కేసుల్లో శిక్ష పడి రాజ్‌కోట్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇవి కూడా బీజేపీ వెనుకుండి బనాయించిన కేసులే కావడం గమనార్హం.
సంజీవ్‌భట్‌పై బీజేపీకి ఎందుకంత కక్షనో అర్థం కావాలంటే కాస్త వెనక్కి వెళ్లాలి. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం 1990లో ఎల్‌కె అద్వానీ చేపట్టిన దేశవ్యాప్త రథయాత్రను నిలిపేశాక గుజరాత్‌లో పెద్దఎత్తున మత అల్లర్లు రేగాయి. జామ్‌జోథ్‌పూర్‌ పట్టణంలో బంద్‌లో ఘర్షణలు సృష్టిస్తున్న 150మందిని పోలీస్‌ అధికారిగా ఉన్న భట్‌ అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిచిపెట్టాక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. దాన్ని లాకప్‌ మరణంగా చిత్రీకరించడంతో ఆ కేసులో భట్‌ జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఒక లాయర్‌ను డ్రగ్స్‌ కేసులో 1996లో ఇరికించిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2002లో గుజరాత్‌ మత అల్లర్ల విషయంలో అబద్ధపు సాక్ష్యాలు సృష్టించారన్న కేసులో సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌, నాటి డీజీపీ శ్రీకుమార్‌తో పాటు భట్‌ కూడా నిందితుడు. అన్నింటికీ మించి 2002లో గోద్రా అనంతర మారణకాండకు అప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రమేయం ఉందని భట్‌ అఫిడవిట్‌ ఇవ్వగా సిట్‌ తోసిపుచ్చింది. ఈ కార్పణ్యంతోనే భట్‌ను ఏవో సాకులు చెప్పి సర్వీస్‌ నుంచి 2015లో గుజరాత్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేయగా, కేంద్రహోం మంత్రిత్వశాఖ ఏకంగా సర్వీస్‌ నుంచి తొలగించింది. న్యాయంకోసం భట్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీజేపీ, మోడీ కక్ష కడితే ఇలా ఉంటుందని భట్‌ జీవితం ద్వారా తెలుస్తుంది. పైశాచికంగా సామూహిక లైంగికదాడికి గురై, కుటుంబాన్ని కోల్పోయిన బిల్కిస్‌బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిలకు చట్టం, రాజ్యాంగం, కోర్టులను కాలరాసి క్షమాభిక్ష పెట్టగలరు. భీమాకొరేగావ్‌ వంటి కేసుల్లో అక్రమంగా ఇరికించి ఏండ్లకేండ్లు బెయిల్‌ రాకుండా అడ్డుకోనూగలరు. తమ దారికి రాని భట్‌ వంటి సిన్సియర్‌ అధికారులను వెంటాడి వేధిస్తారు. ఇదీ బీజేపీ, మోడీ, సంఘ్ పరివారం ధర్మం, నీతి!